Spinal Cord Injury: వెన్నెముక పూర్తిగా తెగిన వ్యక్తి మళ్లీ లేచి నిలబడ్డాడు, నడుస్తున్నాడు.. ఇదెలా సాధ్యమైందంటే..

మైఖేల్ రొక్కాటి
ఫొటో క్యాప్షన్, మైఖేల్ రొక్కాటి
    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, సైన్స్ ప్రతినిధి

వెన్నెముక పూర్తిగా తెగిపోవడంతో పక్షవాతానికి గురైన వ్యక్తి ఇప్పుడు మళ్లీ నడవగలుగుతున్నారు. అందుకు కారణం, స్విట్జర్లాండ్ పరిశోధకులు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంప్లాంట్.

పూర్తిగా వెన్నుముక తెగిన ఒక వ్యక్తి తిరిగి నడవడం ఇదే మొదటిసారి.

ఈ టెక్నాలజీ సాయంతో పక్షవాతానికి గురైన మరో రోగి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దీనివల్ల ఆయన ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు.

దీనికి సంబంధించిన పరిశోధన నేచర్ మెడిసిన్ జర్నల్లో పబ్లిష్ అయింది.

ఐదేళ్ల క్రితం మొటార్ బైక్ ప్రమాదంలో గాయపడిన మైఖేల్ రొక్కాటి వెన్నుపూస పూర్తిగా దెబ్బతినడంతో ఆయన పక్షవాతానికి గురై, తన కాళ్లలో స్పర్శను కోల్పోయారు.

కానీ ఇప్పుడాయన తిరిగి నడవగలుగుతున్నారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు ఆయన వెన్నెముకలో ఎలక్ట్రికల్ ఇంప్లాంట్‌ అమర్చారు. దాని సాయంతో మైఖేల్ తిరిగి నడుస్తున్నారు.

ఇంత తీవ్రంగా గాయపడిన వ్యక్తి మళ్లీ నడిచిన ఘటనలు ఇంతకు ముందెప్పుడూ జరగలేదు.

అయితే వెన్నెముక గాయానికి ఇది చికిత్స కాదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని రోజువారి జీవితంలో ఉపయోగించడం తేలికైన విషయం కాదని కూడా స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు జీవితాన్ని మెరుగుపర్చడానికి ఇది ఒక సానుకూల ముందడుగుగా దీనిని మెచ్చుకుంటున్నారు.

నేను ఈ ఇంప్లాంట్‌ను తయారు చేసిన ల్యాబొరేటరీ దగ్గర మైఖేల్‌ను కలిసాను. ఈ టెక్నాలజీ తనకు దక్కిన వరమని ఆయన చెప్పారు.

స్పైనల్ ఇంప్లాంట్స్ ఎలా పనిచేస్తాయో చెప్పే చిత్రం
ఫొటో క్యాప్షన్, స్పైనల్ ఇంప్లాంట్స్ ఎలా పనిచేస్తాయో చెప్పే చిత్రం

"నేను లేచి నిలబడి, వెళ్లాలనుకునే చోటుకి నడవగలుగుతున్నాను. నేను మెట్లు ఎక్కగలుగుతున్నా, ఇది దాదాపు సాధారణ జీవితంలాగే ఉంది" అని మైఖేల్ చెప్పారు.

మిచెల్ కోలుకోవడానికి టెక్నాలజీ ఒక్కటే కారణం కాదు, దీని వెనుక అతడి ఉక్కు సంకల్పం కూడా ఉంది.

ప్రమాదం జరిగిన రోజు నుంచీ తాను వీలైనంత పురోగతి సాధించాలని పట్టుదలతో ఉన్నానని ఈ ఇటలీ యువకుడు చెప్పాడు.

"నేను జిమ్‌లో బాక్సింగ్, రన్నింగ్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందాను. కానీ ప్రమాదం తర్వాత నాకు ఇష్టమైన వాటిని చేయలేకపోయాను. కానీ నా మానసిక స్థితి దిగజారనివ్వలేదు. కోలుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు. నేను ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నా" అన్నారు.

మైఖేల్ వేగంగా కోలుకోవడం చూసి ఆయనకు శస్త్ర చికిత్స చేసి ఇంప్లాంట్ అమర్చిన వైద్యులు ఆశ్చర్యపోయారు.

నేను నిజంగా ఆశ్చర్యపోయా, మైఖేల్ ఒక అధ్బుతమైన వ్యక్తి, పురోగతి కోసం ఈ టెక్నాలజీని ఆయన ఉపయోగించగలగాలి. ఆయన పరిస్థితి మరింత మెరుగుపడాలి" అని LNTM ప్రొఫెసర్ జోసిలిన్ నాతో అన్నారు.

వెన్నెముకలోని నరాలు, మెదడు నుంచి కాళ్లకు కొన్ని సంకేతాలు పంపిస్తాయి. గాయాల వల్ల ఆ నరాలు దెబ్బతిన్నపుడు కొందరికి పక్షవాతం వస్తుంది.

మైఖేల్ విషయంలో వెన్నెముక పూర్తిగా తెగిపోవడంతో ఆయన మెదడు నుంచి కాళ్లకు చేరే సంకేతాలు అసలు లేకుండా పోయాయి. కానీ, ఈ కొత్త ఇంప్లాంట్‌ను ఆన్ చేసినపుడు మాత్రం అది ఆయన నడవగలిగేలా మెదడు నుంచి వచ్చే సంకేతాలను నేరుగా కాళ్లకు పంపిస్తుంది.

నడుస్తున్న మైఖేల్

ఇప్పటి వరకూ మొత్తం 9 మందికి ఈ ఇంప్లాంట్‌ను అమర్చారు. దాంతో వాళ్లంతా తిరిగి నడవగలిగే శక్తిని పొందారు.

కానీ రోజూ నడవటం కోసం దీనిని అప్పుడే వినియోగించడం వీలుకాదు. మొదట కొంత కాలం నడవడం ప్రాక్టీస్ చేసి, అలా కండరాల కదలికల్లో పురోగతి సాధించి, ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకున్న తర్వాత వారు మెల్లగా నడవగలిగే స్థితికి చేరుకుంటారు.

ఇక ఇంప్లాంట్ అమర్చిన మరో పేషెంట్ డేవిడ్ ఎంజీ కూడా మైఖేల్‌లాగే మళ్లీ నడవగలిగే స్థితికి చేరుకున్నారు. అయితే, ఆయన వాకర్ సాయం కూడా తీసుకుంటున్నారు.

తర్వాత ఆయన తన పార్టనర్ జెనైన్‌తో కలిసి ఒక పాపకు తండ్రి కూడా అయ్యారు 2010లో ఆయనకు ప్రమాదం జరిగిన తర్వాత ఇది సాధ్యం అవుతుందని అసలు ఎవరూ ఊహించలేదు.

ఇప్పుడాయన కూతురు జోకు ఏడాది నిండింది. నేను వాళ్లతో ఉన్నపుడు ఆ పాప బేబీ వాకర్ సాయంతో తన తండ్రితో పోటీపడుతూ ఆనందిస్తోంది.

"ఇది చాలా బాగుంది. తనతో కలిసి నేను ఇలా నడవడం ఇదే మొదటిసారి. పాప తన బేబీ వాకర్‌తో, నేను నా వాకర్‌తో ఇలా నడుస్తుంటే బావుంది" అని డేవిడ్ సంతోషంగా చెబుతున్నారు.

డేవిడ్‌కు ఆయన కుటుంబం ఎనలేని సంతోషాన్ని పంచుతోంది. ఆయనకు అమర్చిన ఇంప్లాంట్ కాసేపే అయినా, ముఖ్యమైన పనులకు సాయపడుతోంది.

అయితే పక్షవాతానికి గురైన రోగులు అందరూ తిరిగి నడిచే విధంగా, ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టీన్ చెబుతున్నారు.

ఆయన ఈ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసిన బృందాన్ని లీడ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఇంప్లాంట్ ద్వారా నడవగలిగే వరకూ పురోగతి కనిపిస్తోంది. కానీ వెన్నెముకని తిరిగి సాధారణ స్థితికి తేవడానికి అవసరమైన వైద్యం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అందుకు స్టెమ్ సెల్ థెరపీ పద్దతులు సాయపడొచ్చు. అయితే అవి ఇంకా పరిశోధనా క్రమంలోనే ఉన్నాయి.

ISWOTY Footer
వీడియో క్యాప్షన్, వెన్నెముక నిలవలేని సమస్య ఉన్నా.. పారా క్లైంబింగ్‌లో ప్రపంచ చాంపియన్ ఎలా అయ్యారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)