ఐవీఎఫ్ క్లినిక్ పొరపాటు.. వేరొకరి బిడ్డకు తల్లయిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫానీ రెత్‌మెయిర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఒక మహిళ పిండాలను(ఎంబ్రియోస్) మరో మహిళలో ప్రవేశపెట్టడం వల్ల ఆమె తనకు ఏమాత్రం తెలియని వ్యక్తి బిడ్డకు జన్మనిచ్చారు.
బ్రిస్బేన్‌లోని మోనాష్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఇది మానవ తప్పిదం వల్లే జరిగిందని ఆస్ట్రేలియా మీడియా రాసింది.
"మోనాష్ ఐవీఎఫ్ తరపున ఈ పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నాను" అని ఆ సంస్థ సీఈఓ మైఖేల్ నాప్ చెప్పారు.
నిరుడు ఇదే క్లినిక్‌లో వందల మంది మహిళల ఎంబ్రియోలు పాడయ్యాయి. వాటిని భద్రంగా ఉంచడానికి అవకాశం ఉన్నప్పటికీ పాడవడంతో 56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 480 కోట్లు) పరిహారం చెల్లించింది.
బిడ్డ పుట్టిన తర్వాత.. జన్మనిచ్చిన తల్లిద్రండులు ఇంకా మిగిలిన తమ పిండాలను వేరే క్లినిక్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అడిగారు. అప్పుడు తమ సిబ్బందికి జరిగిన పొరపాటు అర్థమైందని మోనాష్ ఐవీఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఒక రోగికి చెందిన పిండాన్ని పొరపాటున మరొకరి గర్భంలోకి ప్రవేశపెట్టడంతో ఆమెకు బిడ్డ పుట్టిందంటూ మోనాష్ క్లినిక్ తమ పొరపాటును అంగీకరించింది.

ఈ సంఘటనపై క్లినిక్ విచారణకు ఆదేశించింది.
తమ క్లినిక్‌లో ఇదొక్కటే పొరపాటున ఇలా జరిగిందని, వేరే ఇంకెవరి పిండాలు మారిపోలేదన్న నమ్మకం తమకుందని సీఈవో నాప్ అన్నారు.
ఈ పొరపాటు తమ దృష్టికి రాగానే క్లినిక్‌కు సంబంధించిన సంక్షోభ నిర్వహణ యాజమాన్యం వారం రోజుల్లోనే బాధిత పేషంట్లను కలిసి, వారికి క్షమాపణ చెప్పడంతో పాటు వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు మోనాష్ ఐవీఎఫ్ క్లినిక్ చెప్పింది.
ఈ సంఘటన గురించి ‘రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ అక్రిడేషన్ కమిటీ’తో పాటు ఇతర నియంత్రణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు క్లినిక్ పేర్కొంది. న్యూ క్వీన్స్‌లాండ్ ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ రెగ్యులేటర్‌కు కూడా తాము స్వచ్ఛందంగానే సమాచారం ఇచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) విధానంలో మహిళ అండాశయం నుంచి అండాలను వేరు చేసి ప్రయోగశాలలో పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చెందిస్తారు. ఫలదీకరణం చెందిన ఆ అండాలు పిండాలుగా మారిన తరువాత వాటిని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడతారు.
ఇది చాలా ఖరీదైన ప్రక్రియ, అంతేకాకుండా అన్నిసార్లూ విజయవంతం కాకపోవచ్చు.
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో ఐవీఎఫ్ విధానంలో 2021లో 20,690 మంది బిడ్డలు జన్మించారని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ నివేదిక వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














