కేటీఆర్-కవిత: ఇది అన్నా‌చెల్లెళ్ల యుద్ధమేనా? పార్టీలో దెయ్యాలు ఎవరు, కోవర్టులు ఎవరు?

కవిత, కేటీఆర్

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/FB

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌కు వెళ్లను అని చెప్పిన కవిత చివరవరకూ బీఆర్ఎస్‌లోనే ఉంటాను అనే మాట చెప్పలేదు.
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన అన్న, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపై పరోక్షంగా, ఘాటుగా విమర్శలు చేశారు.

అంతర్లీనంగా తండ్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ధిక్కార స్వరం వినిపించారు.

తాజాగా ఆమె 'సింగరేణి జాగృతి' అనే సంస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ తాజా పరిణామాలు, కవిత వ్యాఖ్యలు చూస్తుంటే కచ్చితంగా ఆమె బీఆర్ఎస్‌ను వీడి కొత్త మార్గంలో వెళతారని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ కవిత వ్యూహం ఏంటి?

కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ లీకవడం, అందులోని అంశాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.

''కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దెయ్యాలున్నాయి'' అనే కవిత మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి.

''బీజేపీని అవసరమైనంత విమర్శించలేదు'' అంటూ తన సొంత పార్టీని ఘాటుగా విమర్శించారు కవిత.

దానిపై స్పందించిన కేటీఆర్, ''పార్టీకి అంతా సమానమే, ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకోవాలి'' అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/FB

ఫొటో క్యాప్షన్, కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్‌నుద్దేశించినవే అని పాత్రికేయులు భావిస్తున్నారు

కేటీఆర్‌ను ఉద్దేశించే అన్నారా?

కవిత గురువారంనాడు తన నివాసంలో, విలేఖర్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా తన మనసులో మాట చెప్పేశారు.

కాంగ్రెస్‌కు వెళ్లను అన్నారుగానీ, చివరి వరకూ బీఆర్ఎస్‌లోనే ఉంటా అని మాత్రం అనలేదు. కేసీఆర్ నాయకుడన్నారుగానీ, పార్టీ చేయాల్సిన పనిలో సగం నేనే చేస్తున్నా అంటున్నారు.

''నాకు నీతులు చెబుతున్ననేతలు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుంది. కోవర్టులు ఉన్నారంటున్న వారు, కేసీఆర్‌కు నోటీసు ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారు? ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తది?’’

‘‘నా మీద దిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయి. లీకు వీరులను పట్టుకోమంటే, గ్రీకు వీరులు నా మీద దండెత్తారు. కేసీఆర్‌పై కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నారు ఈ గ్రీకు వీరులు? ట్విటర్‌లో పెట్టి వదిలేస్తే అయిపోతుందా?’’

‘‘దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుంటాం, నీ మీద దాడులు చేస్తాం అంటే ఎలా? ఆ తెలివి ప్రతిపక్ష పార్టీలపై చూపించండి. నా జోలికి వస్తే బాగుండదు. అసలే నేను మంచిదాన్ని కాదు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు?'' అన్నారు కవిత.

ఆమె ఎక్కడా చెప్పకపోయినా, ఈ మాటలన్నీ కేటీఆర్ ను ఉద్దేశించినవే అని అక్కడున్న విలేఖర్లకు అర్థమైంది.

కవిత మరో మాట కూడా చెప్పారు.

''బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా'' అన్నారు.

రెండు రోజుల కిందట సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థను కాపాడటమే ధ్యేయమంటూ తన జాగృతి సంస్థ తరపున 'సింగరేణి జాగృతి' అనే సంస్థను కవిత ప్రారంభించారు.

సింగరేణిలో ఇప్పటికే బీఆర్ఎస్‌కు అనుబంధంగాపనిచేస్తున్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ఉంది.

విచిత్రం ఏమిటంటే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలు కూడా కవితే. తాను నడిపించాల్సిన సంస్థకు అదనంగా, అదేచోట మరో కొత్త జెండా ఎగరేయడం చూస్తే, కవిత కొత్త దారి వెతుక్కుంటున్నారా అన్న అనుమానం బలపడుతోందన్నది విశ్లేషకుల మాట.

కేసీఆర్, కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/FB

ఫొటో క్యాప్షన్, వివాదాన్ని ముగించమని కేసీఆర్ చెబితే, దానిని కొనసాగిస్తున్నారంటే కేసీఆర్‌ను ధిక్కరించడమే కదా అంటున్నారు విశ్లేషకులు

కేసీఆర్‌ను కవిత ధిక్కరిస్తున్నారా?

''కథ క్లైమాక్స్ కి చేరింది. ఆమె నేరుగానే కేటీఆర్‌ను టార్గెట్ చేసింది. సెపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తోంది. అందరూ హరీశ్ అన్నారుగానీ, హరీశ్ కూడా ఉండొచ్చు. కానీ, అసలైన యుద్ధం అన్నాచెల్లెళ్ల మధ్యనే. ఇప్పుడు కవిత పార్టీని కుదిపేస్తున్నారు.

దేవుడి కంటే బలమైన దెయ్యాలు ఉండవు. దేవుడికి ఇష్టం లేకుండా దెయ్యాలు ఉండవు. అన్ని లేఖలూ చించేసిన కేసీఆర్ ఇది ఎందుకు చించలేదు. ఒకరకంగా ఆమె తన తండ్రిని ధిక్కరిస్తోంది. కాకపోతే మర్యాద కోసం బయటపడడం లేదు.

బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుంది అనే మాట ఆ పార్టీ అస్తిత్వాన్ని, ఉనికినే పణంగా పెట్టింది. ఆమె వ్యూహానికి బహుళ కోణాలు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె వేరుపడినట్టే భావించవచ్చు. ఆమె విలేఖర్లను ఇంటికి పిలిచి మరీ చెప్పింది కదా.. పార్టీ ముగించమన్న చర్చను ఆమె కొనసాగిస్తున్నారంటే అర్థం అదే కదా?'' అని విశ్లేషించారు సీనియర్ పాత్రికేయుడు, విశ్లేషకుడు తెలకపల్లి రవి.

''కవిత తగ్గే రకం అయితే కేసీఆర్ రాయబారం పంపినప్పుడే తగ్గి ఉండేవారు'' అన్నారు రవి.

అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. కొంత కాలంగా కవిత పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 2019లో ఓటమి నుంచి మొదలు, మధ్యలో ఎమ్మెల్సీ పదవి పొందడం, 2024 ఎన్నికల్లో ఆమె అరెస్టు వరకూ ఒక రాజకీయం. కవిత-అసంతృప్తి అనే అంశాన్ని బయటివారు ఎవరూ పెద్దగా పట్టించుకోని రోజులవి.

కానీ ఆమె అరెస్టు-విడుదల తరువాత పరిణామాలు మెల్లిగా మారడం మొదలయ్యాయి. పార్టీతో నిమిత్తం లేకుండా తన సొంత సంస్థ జాగృతి తరపున ఆమె కార్యక్రమాలు నిర్వహించడం, ఒక సభలో ‘సామాజిక తెలంగాణ రాలేదు’ అనడం వంటి వాటిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యర్థులు కూడా గమనిస్తూనే ఉన్నారు.

కానీ వాటిని అంత తీవ్రంగా ఎవరూ తీసుకోని సమయంలో, బీఆర్ఎస్‌లో చీలిక అంటే హరీశ్ రావే తెస్తారని అంటుంటే, నాకు ఆ ఉద్దేశం లేదని హరీశ్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ప్రతిపక్షాలు ఊదరగొట్టేవేళ, ఎవరూ ఊహించని పక్షం నుంచి లేఖాస్త్రం పంపారు కవిత.

కేసీఆరే నాయకుడు, పార్టీని కాపాడుకుంటాను అని కవిత చెబుతున్నారు కానీ ఆమె చర్యలు ఆ దిశగా లేవు. పైగా ఆయనే తనపై చర్యలు తీసుకునేలా చేసి, అప్పుడు బయటకు వెళ్లే వ్యూహం కూడా కావచ్చనేది ఎక్కువమంది పరిశీలకుల అభిప్రాయం.

కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/FB

ఫొటో క్యాప్షన్, కవిత వ్యూహం వెనుక ఉన్నది బీజేపీనా, కాంగ్రెస్సా అనే చర్చ నడుస్తోంది

కవిత వెనుకున్నది బీజేపీనా, కాంగ్రెస్సా?

కవిత బీఆర్ఎస్ లో ఉండే అవకాశం దాదాపు లేదని అర్థమవుతోంది. కానీ ఈ వ్యూహం వెనుక ఎవరు ఉండొచ్చు అంటే, బీజేపీ ప్రణాళికే కావచ్చంటున్నారు కొందరు.

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అన్నారు కవిత. ఆ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, ఇక్కడ తామే ప్రత్యామ్నాయం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు కవిత మాటలే సాక్ష్యమన్నారాయన.

''ఆమె వైఖరి, ఆమె బీజేపీ గురించి అంటున్న మాటలు చూస్తుంటే, ఆమె తిరుగుబాటు వెనుక బీజేపీ లేకపోలేదనిపిస్తోంది. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తున్నా నిర్దిష్టంగా బీజేపీపై ఇలా పోరాడాలన్న మాటలేదు. పైగా ఇలా పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీకి ఉంది కాబట్టి అనుమానం ఇంకా బలపడుతోంది'' అన్నారు రవి.

‘‘పైగా ఇప్పుడు బీఆర్ఎస్‌కు గండి పడితే కాంగ్రెస్ కంటే దీర్ఘ కాలికంగా ఎక్కువ లాభం బీజేపీకే ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలే దానికి ఉదాహరణ'' అన్నారాయన.

అయితే కవిత మీడియాతో మాట్లాడిన మర్నాడే విలేఖర్ల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే…కవిత వెనుక రేవంత్ ఉండవచ్చని సూచిస్తున్నాయంటున్నారు మరికొందరు విశ్లేషకులు.

''మా పార్టీలో కూడా కోవర్టులు ఉండొచ్చని, రేవంత్ కోవర్టులు ఉన్నారేమోనని, ఉంటే వాళ్లే బయటపడతారని కేటీఆర్ అన్న మాటలు, కవితను ఉద్దేశించినవే. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న ఆమె మాటలు కేటీఆర్‌ను ఉద్దేశించినవే. కవిత వెనుక బీజేపీయే ఉందని చెప్పలేం. రేవంత్ కూడా నడిపించవచ్చు'' అని బీబీసీతో అన్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు.

కాకపోతే కవిత బయటకు వెళ్లినా పార్టీకి నష్టం స్వల్పమే తప్ప, భారీగా ఉండకపోవచ్చని ఆ నాయకుడి అంచనా.

''కవిత తిరుగుబాటు చేస్తే రేవంత్ సహకారం కొంత కాలం అందవచ్చు'' అని బీబీసీతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ అన్నారు.

ఇప్పుడు బంతి కేసీఆర్ కోర్టులో పడింది. పార్టీకి ధిక్కార స్వరం వినిపిస్తున్న కవితపై ఏం చర్యలు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. చర్యలు తీసుకోకపోతే ఈటలతో పోలిక వస్తుంది. ఈటల మాత్రమే కాదు, ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్న కేసీఆర్… కూతురు విషయంలో వేచి చూసే ధోరణి చూపిస్తే, ఇప్పటికే ఉన్న కుటుంబ పార్టీ ముద్రకు మరింత బలం చేకూరుతుందన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది.

ఎందుకంటే ఆమె కేవలం కేటీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేయలేదు. పరోక్షంగా కేసీఆర్‌నూ అన్నట్టే. కేసీఆర్ కు తెలియకుండా పార్టీ విలీనం అనేది జరిగే ప్రక్రియ కాదు. అయినా పార్టీ విలీన ప్రతిపాదనలు నడిచాయి అంటే, ఆ విషయంగా కేసీఆర్ ను కూడా ఇరుకున పెట్టేలా కవిత మాట్లాడినట్టే.

దీనిపై స్పందిస్తూ ''చిట్ చాట్‌లో మాట్లాడిన వాటిపై షోకాజ్ ఇవ్వలేం కదా?'' అన్నారు బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్.

కవిత వ్యవహారం చక్కబడుతుందనే ఆయన అంటున్నారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/FB

ఫొటో క్యాప్షన్, కవిత సింగరేణిలో ఓ సంస్థను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది

కవిత భవిష్యత్తు ఏంటి?

కవిత పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమన్న అభిప్రాయం మాత్రం విస్తృతంగా వినిపిస్తోంది. అయితే, సొంత పార్టీ పెడతారా? వేరే పార్టీలో చేరతారా? అనేది స్పష్టత లేదు.

''నిజామాబాద్ లో పార్టీ బలంగా ఉండి కవిత ఓడిందంటే, అందులో పార్టీ పాత్ర లేదని అనలేం. అప్పటి నుంచే కుటుంబంలో తేడాలు ఉన్నాయి. బాగోదని ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పట్లో సద్దుమణిగింది. కానీ ఇప్పుడు కవిత వేస్తున్నది గొప్ప వ్యూహాత్మక అడుగు మాత్రం కాదు. ఒక ప్రయత్నం చేస్తోంది. ఆమె ప్రభావం అసలు ఉండదని నేను అనుకోను. జాగృతిని నడిపిన సమర్థత పార్టీని నడపడానికి సరిపోతుందనుకోను'' అని బీబీసీతో అన్నారు సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్.

''బీఆర్ఎస్‌కు కవిత వల్ల జరగాల్సిన నష్టం జరిగింది. ఇక కొత్తగా జరగడానికి ఏమీ లేదు. కొంత అలజడి సృష్టించి, కొంత హడావుడి చేయగలదు తప్ప శాశ్వత ప్రభావం చూపగలదు అనుకోవడం లేదు'' అన్నారు రవీందర్.

''ఆమె బయటకు వెళితే బీఆర్ఎస్‌కు నష్టం లేదు. ఆమెకు పెద్దగా లాభం జరిగే పొలిటికల్ బేస్ కాని, పర్సనల్ బేస్ కాని లేదు. కానీ డిస్ట్రబెన్స్ జరుగుతుంది. కానీ ఒకటి… కేసీఆర్ అథారిటీ, నైతికంగా పట్టు తగ్గుతుంది. మీ పిల్లలే మీ మాట వినలేదు అన్నది వస్తుంది'' అన్నారు తెలకపల్లి రవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)