గ్రిప్ స్ట్రెంగ్త్: ‘ఈ టెస్ట్ మీ ఆయుష్షును చెప్పేస్తుంది’

కొండలెక్కడం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేవిడ్ కాక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పట్టు(గ్రిప్ స్ట్రెంగ్త్) అనేది టైప్ 2 డయాబెటిస్ నుంచి డిప్రెషన్ వరకు పలు రకాల ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. మరి మీ గ్రిప్ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసుకోవడం ఎలా?

కండరాల బలాన్ని కొలిచే ప్రక్రియల్లో ఒకటి సింపుల్‌గా కుర్చీలో కూర్చుని, టెన్నిస్ బాల్‌ను నొక్కడం.

చేతి పట్టు బలంపై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ డెర్బీలోని జాషువా డేవిడ్‌సన్ దీన్ని ప్రతిపాదించారు.

ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అత్యంత గుర్తింపు పొందిన కొలమానంగా ఈ పరీక్ష నిలుస్తోంది.

గ్రిప్ స్ట్రెంగ్త్‌పై క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షలు నిర్వహించినప్పుడు శాస్త్రవేత్తలు హ్యాండ్ డైనమోమీటర్ వాడారు.

చేయి, మోచేతిలోని కండరాల ద్వారా ఉత్పత్తయ్యే బలాన్ని కొలిచేందుకు ఈ డివైస్‌ను ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా నొక్కాలి.

కొన్ని కంపెనీలు ప్రస్తుతం ఈ డైనమోమీటర్‌ను కేవలం క్లినిక్‌లకే కాకుండా ఇళ్లలో పరీక్షించుకునేందుకు కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.

ఎవరైనా తమ గ్రిప్ స్ట్రెంగ్త్‌ను తెలుసుకునేందుకు మొబైల్ యాప్స్‌తో తేలికగా ఈ డివైస్‌లను వాడుకునేలా రూపొందిస్తున్నాయి.

''టెన్నిస్ బంతిని కానీ స్ట్రెస్ బాల్‌ను కానీ చేతిలో పట్టుకుని గట్టిగా నొక్కడం వల్ల మీకు మీ గ్రిప్ స్ట్రెంగ్త్ గురించి ఒక అవగాహన వస్తుంది'' అని డేవిడ్‌సన్ అన్నారు.

‘‘అలసట వచ్చేంత వరకు వీలైనంత ఎక్కువ సేపు గట్టిగా దాన్ని నొక్కి పట్టండి.

టెన్నిస్ బాల్ వంటి వాటిని గరిష్ఠంగా 15 నుంచి 30 సెకన్ల పాటు గట్టిగా పట్టుకుని ఉండగలగడం ప్రామాణికంగా భావిస్తారు.

పట్టు వదలకుండా ఎంత సేపు మీరు అలా పట్టుకుని ఉంటారో దాన్ని బట్టి మీ గ్రిప్ స్ట్రెంగ్త్‌ను తెలుసుకోవచ్చు'' అని డేవిడ్‌సన్ చెప్పారు.

బలహీనమైన గ్రిప్ స్ట్రెంగ్త్ ఉంటే మీ రోజువారీ జీవితంపైనా ప్రభావం పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ ప్రొఫెసర్ మార్క్ పీటర్‌సన్ చెప్పారు.

సీసాలు, డబ్బాల మూతలు తీయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కానీ, శరీరమంతా ఉన్న మస్క్యులోస్కెలెటాల్ స్ట్రెంగ్త్‌ లాగా పట్టు బలాన్ని పరిశోధకులు వాడుతున్నారు.

ఒక వ్యక్తి అవసరమైనంత చురుకుగా ఉన్నాడా, బలహీనత ప్రమాదం ఎంత, మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా దిగజారుతుంది? వంటి పలు విషయాలను గ్రిప్ స్ట్రెంగ్త్ తెలియజేస్తుంది.

అత్యధిక, మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లో 1,40,000 మందిపై నిర్వహించిన అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తల దృష్టిని ఇది ఆకర్షించింది. రక్తపోటు వంటి సూచికల కంటే గ్రిప్ స్ట్రెంగ్త్ లేకపోవడం అనేది ముందస్తు మరణానికి సూచిక అని గుర్తించారు.

ఒక వ్యక్తి గ్రిప్ స్ట్రెంగ్త్ 100 ఏళ్ల వరకు జీవించే అవకాశాన్ని కూడా సూచిస్తుందని మరో అధ్యయనం పేర్కొంది.

ఒక అధ్యయనంలో భాగంగా 56 నుంచి 68 ఏళ్ల మధ్య వయసున్న కొందరి గ్రిప్ స్ట్రెంగ్త్‌ను 1965 నుంచి 1968 మధ్య కొలిచారు. అనంతరం వారిలో ఎవరు ఎంతకాలం బతికారన్నది 44 ఏళ్ల పాటు పరిశీలించారు.

79 ఏళ్ల వయసులోనే మరణించిన వారితో పోలిస్తే, వందేళ్లు నిండిన వారిలో పట్టు బలం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.

చేతి గ్రిప్ స్ట్రెంగ్త్ గురించి కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీలోని మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డారిల్ లియోంగ్ వివరించారు.

మొత్తం కండరాల బలాన్ని తెలుసుకోవడం ద్వారా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా లేవా? అన్నది తెలుసుకోవచ్చని అన్నారు. అందుకే, ఇది ఎన్నో ఆరోగ్య విషయాలతో ముడిపడి ఉందన్నారు.

డైనమోమీటర్ పరీక్ష వాడిన ఒక అధ్యయనం ప్రకారం.. పురుషులకు 25.5 కిలోగ్రాములు, మహిళలకు 18 కిలోగ్రాముల కంటే తక్కువ గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్నవారికి, శరీరమంతా సార్కోపెనియా (కండరాల క్షీణత, కండర సామర్థ్యం, పనితీరు క్రమంగా కోల్పోయే వ్యాధి) ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.

దీనివల్ల, ఎక్కువ కాలం జీవించే అవకాశం తగ్గుతుంది. ఫ్రాక్చర్లు వస్తుంటాయి.

పట్టు బలం గ్రాఫ్

ఫొటో సోర్స్, ©2011 Massy-Westropp et al; licensee BioMed Central Ltd

ఒక చిన్న హ్యాండ్‌షేక్ నుంచి కూడా ఎంతో చెప్పగలమని మెక్‌మాస్టర్ యూనివర్సటీ మెడిసిన్ ప్రొఫెసర్, ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ గిల్లామ్ పారే అన్నారు. గ్రిప్ స్ట్రెంగ్త్ ఆధారంగా ఎవరికైనా సార్కోపెనియా ఉందా? లేదా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ''హ్యాండ్‌షేక్ బలహీనంగా ఉంటే, చేతిని పూర్తిగా పట్టుకుని వేళ్లు ముడుచుకునేందుకు ఇబ్బంది పడతాయి. లేదా చేతి కండరాలు దెబ్బతిన్న చోట ఎర్రటి గుర్తులు కనిపిస్తాయి'' అని చెప్పారు.

దీర్ఘాయువుకు, గ్రిప్ స్ట్రెంగ్త్‌కు మధ్య సంబంధం శారీరక సామర్థ్యాలకు మించినది. మెటబాలిక్ సిస్టమ్‌లో కండరాలు కీలకమైనవిగా ఉంటున్నాయి.

బలహీనమైన గ్రిప్ స్ట్రెంగ్త్.. జీవక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఎన్నో సమస్యలకు దారితీస్తుందని సూచిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ నుంచి ఎముకల్లో ఖనిజ సాంద్రత తక్కువ ఉండడం వరకు.. పోషకాహార లోపం, డిప్రెషన్ వంటి వాటికి కారణమవుతుంది.

ఒకవేళ మీ ఇంట్లో డైనమోమీటర్ ఉంటే, మీ గ్రిప్ స్ట్రెంగ్త్‌ను పైన చార్ట్‌తో సరిపోల్చి చూసుకోవచ్చు.

2022లో పీటర్సన్ అధ్యయనం కూడా 1,275 మంది పురుషులు, మహిళల గ్రిప్ స్ట్రెంగ్త్‌ను పరిశీలించింది. వారి డీఎన్ఏలతో ఫలితాలను పోల్చిచూసింది.

తక్కువ గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్న వారిలో వృద్ధాప్యం తొందరగా వస్తుందని పీటర్సన్ అధ్యయన బృందం గుర్తించింది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకునేందుకు, వ్యాధులను తట్టుకునే దృఢత్వానికి గ్రిప్ స్ట్రెంగ్త్ కీలకమని తేల్చారు.

క్యాన్సర్ రోగుల్లో కూడా అధ్యయనం చేపట్టారు. తక్కువ గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్న వారు వేగంగా బలం కోల్పోవడం లేదా సన్నగా అయిపోవడం తీవ్రంగా కండరాలు లేదా కొవ్వు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. వారు సాధారణంగా తింటున్నప్పటికీ ఈ పరిస్థితి ఎదురవుతుంది.

''మనకు ఒకసారి ఈ వ్యాధి వస్తే, దానిపై పోరాడే సామర్థ్యం పరిమితంగా ఉంటుంది.'' అని పీటర్సన్ అన్నారు.

ఉదాహరణకు.. తక్కువ గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్నవారిలో న్యూమోనియాతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గ్రిప్ స్ట్రెంగ్త్ కేవలం చివరి దశపై అవగాహన గురించే కాదు. ఒక దేశ జనాభా సగటు గ్రిప్ స్ట్రెంగ్త్‌పై ఒలింపిక్ గేమ్స్‌లో ఎన్ని పతకాలను గెలుచుకుంటుందనేది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. గ్రిప్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్న టీనేజర్లు, యువత చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఫోన్లు లేదా ఇతర డివైజ్‌లను ఎక్కువగా వాడే టీనేజర్లకు తక్కువగా గ్రిప్ స్ట్రెంగ్త్ ఉంటుందని బ్రెజిల్‌లోని ఒక అధ్యయనం గుర్తించింది.

పట్టు బలం

ఫొటో సోర్స్, Getty Images

పట్టు బలాన్ని పెంచుకోవచ్చా?

గ్రిప్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అని డేవిడ్‌సన్ అన్నారు. మీ వయసుతో సంబంధం లేకుండా గ్రిప్ స్ట్రెంగ్త్ పెంచుకునేలా పనిచేయొచ్చన్నారు. టెన్నిస్ బాల్ వాడటం ద్వారా మీ చేతిలోని కండరాల పనిని పెంచవచ్చు. నిరంతర సాధనతో, కాలానుగుణంగా స్థిరమైన మెరుగదలను మీరు చూడొచ్చు అని డేవిడ్‌సన్ తెలిపారు.

శారీరకంగా చురుకుగా ఉండేందుకు, మీ శరీరం కింద, పైన కండరాలకు శిక్షణ ఇస్తూ ఉండాలని లియోంగ్ ప్రతిపాదించారు. అలా చేస్తే, మీ గ్రిప్ స్ట్రెంగ్త్ మెరుగవుతుందని సూచించారు.

వయసు పెరుగుతున్నా కొద్ది రెగ్యులర్‌గా శారీరక వ్యాయామాలు చేయాలని సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)