బర్డ్‌ఫ్లూలాంటి వైరస్‌లు సోకకుండా ఉండాలంటే మాంసాన్ని ఎలా వండాలి?

ఫొటో సోర్స్, Getty Images
బర్డ్‌ఫ్లూ భయం తొలిగిపోయిందనుకుంటున్న సమయంలో ఇటీవల పల్నాడు జిల్లాలో వైరస్ బారిన పడి ఓ చిన్నారి మృతిచెందిందన్న వార్త కలకలం రేపింది.
బర్డ్ ఫ్లూ ఉన్న కోడి మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే తినడంతో రెండేళ్ల చిన్నారి వైరస్ సోకి మరణించిందని అధికారులు చెప్పారు.
పచ్చి మాంసం తినడం వల్ల ఆ పక్షి లేదా జంతువులో ఉండే వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయని, ఉడకబెట్టిన మాంసంతో ఇలాంటి సమస్య తక్కుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరి మాంసం తినబోయే ముందు దాన్ని ఎంత ఉష్ణోగ్రతతో ఉడికించాలి? ఆరోగ్యానికి హాని కలగకుండా మాంసం ఉడికించే పద్ధతేంటి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు?


ఫొటో సోర్స్, MANGALAGIRI AIIMS
అసలు పల్నాడు జిల్లాలో ఏం జరిగింది?
నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మార్చి 15న చనిపోయింది.
దీనిపై ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ''జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రెండేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు మార్చి 4న ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపను చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి చనిపోయింది. చిన్నారి శాంపిళ్లను పుణెకు పంపగా హెచ్5ఎన్1 సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసు 25 రోజుల క్రితం నమోదయింది. ఆ తర్వాత మంగళగిరి ఎయిమ్స్‌లో ఆ లక్షణాలతో ఎవరూ చేరలేదు'' అని ప్రకటనలో ఆస్పత్రి తెలిపింది.
హెచ్5ఎన్1 అనేది బర్డ్ ఫ్లూ వైరస్ రకం. చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించినట్టు తేలడంతో ఆమె కుటుంబ సభ్యులకు, ఇంటి చుట్టుపక్కలవారికి అనేక పరీక్షలు నిర్వహించారు.
ఇంటి సమీపంలో ఆరోగ్య శాఖ సర్వే జరపగా, వ్యాధి లక్షణాలున్న వారెవరూ లేరని తేలిందని పల్నాడు జిల్లా డీఎంహెచ్‌వో రవి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మాంసం ఎలా వండాలి?
చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడానికి కారణం ఉడకని మాంసాన్ని నోట్లో పెట్టుకోవడమన్న ప్రచారం జరుగుతోంది.
మాంసం లేదా ఇతర వంటకాలను అధిక ఉష్ణోగ్రతల దగ్గర క్రమబద్ధంగా, పూర్తిస్థాయిలో ఉడికించిన తర్వాతే తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు.
‘‘కోడిమాంసాన్ని సరైన విధంగా ఉడికించి తింటే, ఆ కోడికి బర్డ్ ఫ్లూ ఉన్నా అది మనుషులకు సోకే అవకాశం ఉండదు, ఆ పాప కోళ్లకు దగ్గరగా తిరగడంతోపాటు పచ్చిమాంసం ముక్క నోట్లో పెట్టుకోవడం వల్లే బర్డ్ ఫ్లూ బారిన పడి ఉండొచ్చు’’ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు. ఆయన తన పేరు రాయడానికి ఇష్టపడ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వేడిగా ఉన్నప్పుడే తినాలి
‘‘మాంసం లేదా ఇతర ఉడికించిన ఆహార పదార్థాలేవైనా వేడిగా ఉన్నప్పుడే తినాలి. శుభ్రంగా కడిగిన తర్వాతే మాంసం వండాలి. పచ్చిమాంసం ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. అయితే డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ప్యాకింగ్ (మూత సరిగ్గా పెట్టడం) చేయాలి. చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుంటే, తినేముందు బయటకు తీసిన వెంటనే వేడిచేయాలి, ఆ వేడి చల్లారకముందే తినాలి. అలాగే మాంసం మొత్తం ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి మొత్తం వేడిచేసి, కొంత తిని, మళ్లీ మరికొంత ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎంత తినాలో అంత వరకే వేడిచేసుకోవాలి’’ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టు సూచించారు.
మాంసాన్ని ఉడికించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఉష్ణోగ్రతలు కనీసం 75 డిగ్రీల సెల్సియస్ ఉండాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తెలిపింది.
ఉడకబెట్టిన గుడ్డు, మాంసం తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గరే వైరస్ చనిపోతుందని, మనం వంద డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వండుతామని, దీనివల్ల ప్రమాదమేమీ లేదని పశ్చిమగోదావరి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కె. మురళీ కృష్ణ గతంలో బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














