ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 6 ముఖ్యమైన మార్పులు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఫైనాన్స్, బ్యాంకింగ్, పెన్షన్ వంటి ఇతర చాలా ఆర్థిక సంబంధమైన విషయాలకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఆర్థిక సంవత్సరం మొదలైన తొలి రోజు నుంచే ఎన్నో ముఖ్యమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శ్లాబులు మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల ఒక పరిమితి ఆదాయం ఉన్న వ్యక్తులు తక్కువగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మొబైల్ ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులకు సెక్యూరిటీ పెరుగుతుంది. పింఛను పథకాలలో కూడా మార్పులు వస్తున్నాయి.
ఈ మార్పులు లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు, సీనియర్ సిటిజన్లకు, బ్యాంకు కస్టమర్లకు, యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే వారికి వర్తిస్తాయి.
ఏప్రిల్ 1 నుంచి ఏయే నిబంధనలు మారనున్నాయో ఒకసారి చూద్దాం..


ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల అమలు
ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో, కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఈ శ్లాబుల కింద రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఇది మాత్రమే కాక, వేతన జీవులు రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనిప్రకారం, రూ.12.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వేతన జీవులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
పన్ను లేని ఆదాయపు పరిమితిని పెంచడమే కాకుండా, ట్యాక్స్ శ్లాబులలో కూడా మార్పులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకు అకౌంట్‌లో కనీసం ఈ మొత్తాన్ని ఉంచాల్సిందే..
బ్యాంకులలో ఉంచాల్సిన కనీస మొత్తాల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు వచ్చాయి.
ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా), పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటి పలు బ్యాంకులు ఈ మార్పు తీసుకురానున్నాయి.
ఖాతాలలో కనీస మొత్తాలను ఉంచని ఖాతాదారులు పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది.
ఖాతాదారునికి ఎక్కడైతే బ్యాంకు ఖాతా ఉందో అంటే అర్బన్, సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాలను బట్టి అకౌంట్‌లో ఉంచాల్సిన కనీస మొత్తాలు ఆధారపడి ఉంటాయి.
అది మాత్రమే కాక, ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కూడా మే 1 నుంచి ఖరీదైనదిగా మారబోతుంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులు పెంచుకునేందుకు బ్యాంకులకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది.
నెలకు ఏటీఎం నుంచి ఉచితంగా విత్‌డ్రా చేసుకునే సంఖ్య కూడా తగ్గింది. ఇది కస్టమర్లకు ఖర్చును పెంచనుంది. ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎం వాడే వారికి ఇది భారంగా మారనుంది.
ఇకపై మీరు నెలకు మూడుసార్లు మాత్రమే ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోగలరు. ఆ తర్వాత నుంచి, ప్రతి లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
జీఎస్టీ కొత్త నిబంధనలు
ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ పోర్టల్‌పై మల్టి ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) అందుబాటులో ఉంది.
ఇది పన్ను చెల్లింపుదారులకు సెక్యూరిటీని పెంచుతుంది. 180 రోజుల్లోపు తీసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లతోనే జీఎస్టీలో ఈ-వే బిల్లు జనరేట్ అవుతుంది.
టీడీఎస్ కోసం జీఎస్టీఆర్-7ను దాఖలు చేసే వారు, నెలలు ఎగ్గొట్టి ఒకేసారి వాటిని వరుసగా దాఖలు చేసుకోలేరు. అంతేకాక, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ప్రమోటర్లు, డైరెక్టర్లు జీఎస్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ నిబంధనల్లో మార్పులు
2024 ఆగస్టు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. కానీ, దీన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీనివల్ల, 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లాభం పొందనున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో కనీసం 25 ఏళ్ల సర్వీసును పూర్తి చేసిన వారు గత 12 నెలల యావరేజ్ బేసిక్ శాలరీలో 50 శాతానికి సమానంగా పెన్షన్ పొందుతారు. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతకు ఇది సాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరింత సురక్షితంగా యూపీఐ చెల్లింపులు..
భారత్‌లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) చెల్లింపులు చాలా పాపులర్. ప్రతి రోజూ కోట్ల రూపాయల కొద్దీ యూపీఐ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. చాలామంది తమ మొబైల్ నెంబర్‌ను యూపీఐకి అనుసంధానించిన తర్వాత అప్‌డేట్ చేయరు. దీనివల్ల, ఇది ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. ఇది పెద్ద భద్రతా సమస్యకు కారణమవుతుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చేసిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తున్నాయి.
ఒకవేళ మొబైల్ నెంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా లేదా ఎక్కువ కాలంగా వాడకపోయినా..ఆ నెంబర్ యూపీఐతో అనుసంధానమైతే, ఏప్రిల్ 1 లోపలే మీ బ్యాంకు వద్దకు వెళ్లి ఆ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. అలా చేయకపోతే, యూపీఐ చెల్లింపులకు యాక్సెస్ బ్లాక్ అవుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. వాడుకలో లేని మొబైల్ నెంబర్లను తొలగించడం కోసం బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి థర్డ్ పార్టీ ప్రొవైడర్లు కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరించాలి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ మార్గదర్శకాల ప్రకారం.. ఎక్కువ కాలం పాటు మొబైల్ నెంబర్‌ను వాడకపోతే, 90 రోజుల తర్వాత దాన్ని కొత్త యూజర్‌కు జారీ చేయొచ్చు.
ఒకవేళ అలాంటి నెంబర్ యూపీఐ చెల్లింపులకు కనుక అనుసంధానమై ఉంటే, దీనివల్ల సెక్యూరిటీ ప్రమాదాలు, ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
నిబంధనలు మార్చిన సెబీ
ఏప్రిల్ 1 నుంచి స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్)ను సెబీ లాంచ్ చేస్తోంది. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులకు (పీఎంఎస్) మధ్య వారధిలా పనిచేస్తుంది. దీనిలో కనీస పెట్టుబడిగా రూ.10 లక్షలు కావాలి.
అంతేకాక, పలు క్రెడిట్ కార్డు కంపెనీలు రివార్డు పాయింట్ విధానాల్లోనూ మార్పులు తీసుకువస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














