ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌: మహానాడు వేదికగా చంద్రబాబు కొత్త నినాదం - వైసీపీ నేతలు ఏమంటున్నారు

మహానాడు

ఫొటో సోర్స్, FB/TDP

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు, గురువారం బహిరంగసభలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయమైంది.

కడపలో మూడు రోజుల పాటు మహానాడు జరిగింది.

మహానాడులో ఈసారి తమ విజయాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు వెల్లడించడం, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని విమర్శించడంతో పాటు చంద్రబాబు ఓ కొత్త నినాదం తెరపైకి తీసుకువచ్చారు.

అదే ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేయాలని పిలుపు

ఆపరేషన్‌ సిందూర్‌ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ క్లీన్‌ పాలిటిక్స్‌కి నాంది పలుకుదామని, ఇందులో భాగంగా ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేయాలని బాబు పిలుపునిచ్చారు. టెరర్రిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు సమాజానికి అంతకంటే ప్రమాదకరమని వారిని రాష్ట్రం నుంచి తరిమికొడదామన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్‌ వంటి స్కాంలతో రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు.

నాడు నమ్మి ఓటేస్తే జె బ్రాండ్స్‌తో, గంజాయి, డ్రగ్స్‌తో ప్రజల ఆరోగ్యాలు పాడుచేశారని ఆరోపించారు.

అడవులు ఆక్రమించి ఎస్టేట్‌లు నిర్మించుకున్నారని, కొండలు– చెరువులను నాశనం చేశారని విమర్శించారు.

ప్యాలస్‌ల నుంచి ఎస్టేట్‌ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు.

అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడించి టీడీపీ కూటమికి పట్టం కట్టారని బాబు వ్యాఖ్యానించారు.

మహానాడు

ఫొటో సోర్స్, FB/TDP

వైసీపీని అడ్రస్‌ లేకుండా..

భవిష్యత్‌లో వైసీపీని అడ్రస్‌ లేకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

''తెలుగుదేశం అధికారానికి దూరమైన ప్రతిసారి, రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. అందుకే చెబుతున్నా, మంచి పాలకులు కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాళి కాకూడదు. అప్పుడే అనుకున్న ఫలాలు ప్రజలకు అందుతాయి'' అని అన్నారు.

‘‘ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం’’

''మీ రాష్ట్రంలో భూతం ఉంది. రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారు. ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తామని భరోసా ఇచ్చాను. నూతనంగా తీసుకువచ్చిన 20కు పైగా పాలసీలతో ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికి రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం. ఏడాదిలో దేశీయ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో ఉన్నాం. వృద్ది రేటులో దేశంలో రెండో స్థానానికి వచ్చాం. అమరావతికి క్వాంటమ్‌ వ్యాలీ, విశాఖకు గూగుల్, టీసీఎస్‌... అలాగే రాష్ట్రంలో రిలయన్స్, ఆర్సెలార్‌ మిట్టల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తాం.

జూన్‌ 12 లోగా కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం. గాలేరు నగరి పనులు పూర్తి చేసి జలాలు కడపకు తీసుకురావడానికి అవసరమైన రూ. 1,000 కోట్లు ఇప్పుడే విడుదల చేస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్

ఫొటో సోర్స్, FB/TDP

‘‘6 శాసనాలతో అద్భుత ఫలితాలు’’

‘‘తెలుగుజాతి నెంబర్‌ వన్‌గా ఉండాలన్నదే మా అజెండా, యువతకు అవకాశాలు కల్పిస్తే దూసుకుపోతారు మహిళలను గౌరవించడం మన ఇంట్లోనే మొదలవ్వాలి, ప్రతి వర్గానికీ న్యాయం అదే మన నినాదం.

అన్నదాతకు అన్ని విధాల అండదండ, ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక ప్రణాళిక. మహానాడులో తీర్మానించుకున్న ఈ 6 శాసనాలతో నూతనత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని తెచ్చాం.

ఈ శాసనాలను తూచా తప్పకుండా అమలుచేసి తిరుగులేని ఫలితాలు సాధిద్దాం. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతీ ఏడాది ఏం చేశామో చెబుతాం. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యం'' అని మహానాడు బహిరంగసభలో చంద్రబాబు అన్నారు.

లక్ష్మీ పార్వతి

ఫొటో సోర్స్, FB/YSRCP

‘‘మహానాడు కాదు దగానాడు, పీడనాడు’’: వైసీపీ

''మొత్తం గత ప్రభుత్వాన్ని, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తిట్టిపోయడానికే అన్నట్లుగా కడపలో టీడీపీ నిర్వహించిన మహానాడు నిజానికి ఒక వెన్నుపోటు నాడు, పీడనాడు, దగానాడు'' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతూ, ఏడాది పాలనలో ఒక్క హామీ నెరవేర్చని సీఎం చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక, జగన్‌ను తిట్టడానికే మహానాడును వాడుకున్నారని అన్నారు.

''అవినీతితో సంపాదించిన నల్ల ధనాన్ని మహానాడులో విరాళాల పేరుతో మార్చుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు పెట్టి విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు. అలా బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకుంటున్నారు. డబ్బు సంపాదించడంలో చంద్రబాబుకి ఉన్న తెలివి ఎవరికీ ఉండదు. రెండెకరాలతో మొదలైన చంద్రబాబుకి ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అవినీతి చేయకుండానే దేశంలోనే రిచెస్ట్‌ సీఎంగా ఎలా ఎదిగాడు?'' అని లక్ష్మీపార్వతి అన్నారు.

‘‘అలా అయితే ముందుగా చంద్రబాబు తప్పుకోవాలి’’

‘‘క్లీన్‌ పాలిటిక్స్‌ అనే నినాదం మంచిదే. రాజకీయాల్లో నేరస్థులు ఎక్కువైనప్పుడు ఏరిపారేయడం మంచిదే కానీ రాజకీయాలు, పార్టీలకతీతంగా ఈ పని జరగాలి. కేవలం విపక్ష పార్టీలను టార్గెట్‌ చేయకుండా అధికార పార్టీతో సహా అన్ని పార్టీల్లోని నేరస్థులను టార్గెట్‌ చేస్తేనే చంద్రబాబు చెప్పిన క్లీన్‌ పాలిటిక్స్‌ అర్థం నెరవేరుతుంది'' అని రాజకీయ పరిశీలకులు సీనియర్‌ జర్నలిస్టు ధారా గోపీ అభిప్రాయపడ్డారు.

ఇక ఆర్థిక ఉగ్రవాది అని చంద్రబాబు వాడే పదం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎప్పుడూ అనే మాటేనని, ఇప్పుడు కొత్తగా అన్న మాటేం కాదన్నారు.

" క్లీన్ పాలిటిక్స్ అంటే ముందుగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. రెండు ఎకరాల పొలం నుంచి ఈ దేశంలోనే అత్యధిక ఆస్తులు, ఆదాయం కలిగిన సీఎంగా చంద్రబాబు ఎప్పుడో రికార్డులకు ఎక్కారు. ఏ వ్యాపారాలు చేసి బాబు అంత ఆర్థికంగా స్థిరపడ్డారు. కాబట్టి బాబు చెబుతున్న క్లీన్ పాలిటిక్స్, ఆర్థిక ఉగ్రవాదుల ఏరివేత ముందుగా తనతోనే మొదలు అవ్వాలి" అని బీబీసీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)