ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేసిన అమెరికా కోర్టు - చెల్లించిన సుంకాలను వడ్డీతో తిరిగి ఇస్తారా? ఇప్పుడేం జరగనుంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పీటర్ హాస్కిన్స్, యాంగ్ టియాన్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాలను అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ఇది ట్రంప్ ఆర్థిక విధానాలలో కీలకాంశానికి ఎదురుదెబ్బ.
వైట్‌హౌస్ అత్యవసరంగా అమలుచేసిన చట్టం దాదాపు ప్రతి దేశంపై సుంకాలు విధించడానికి అధ్యక్షుడికి ఏకపక్ష అధికారాన్ని ఇవ్వలేదని ‘ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్’ పేర్కొంది.
ఇతర దేశాలతో వాణిజ్య నియంత్రణకు అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాలు దఖలు పరిచిందని, అయితే ఆర్థిక వ్యవస్థ రక్షణకు అధ్యక్షుడికి ఉన్న అధికారం దీనిని అధిగమించలేదని ఈ కోర్టు పేర్కొంది.
ఈ తీర్పు వెలువడిన కొన్ని నిమిషాలలో ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది.
సుంకాలను నిలిపివేసేందుకు అధికార ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ తీర్పు వైట్‌హౌస్‌కు పది రోజుల సమయం ఇచ్చింది. అయితే వీటిలో చాలా సుంకాలు ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహం ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ ప్రభుత్వం చైనా, మెక్సికో, కెనడాలపై విధించిన ప్రత్యేక సుంకాలనూ కోర్టు నిలిపివేసింది.
జాతీయ అత్యయిక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో న్యాయమూర్తులు నిర్ణయించలేరని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అమెరికాను అన్నింటా ప్రథమస్థానంలో నిలబెడతామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, ఇందుకోసం కార్యనిర్వాహక అధికారాలన్నింటినీ ఉపయోగించి ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించి, అమెరికాను తిరిగి గొప్ప శక్తిగా నిలబెడతామని చెప్పారు.


ఫొటో సోర్స్, BBC / Bernd Debusmann Jr
‘లిబరేషన్ డే’కు తొలి సవాల్
ఇతర దేశాల నుంచి సరకును దిగుమతి చేసుకునే ఐదు చిన్నవ్యాపార సంస్థల తరఫున లిబర్టీ జస్టిస్ సెంటర్ ఈ కేసు దాఖలు చేసింది.
ట్రంప్ సుంకాల కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారాయి. ట్రంప్ 'లిబరేషన్ డే'గా పిలుచుకునే సుంకాల విధింపునకు ఈ కేసు తొలి సవాల్ విసిరింది.
ఈ దావాలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఒకటైన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
"చట్టం స్పష్టంగా ఉంది. ఏ అధ్యక్షుడికి తనకు నచ్చినప్పుడల్లా తనంతట తానుగా పన్నులు పెంచే అధికారం లేదు" అని లెటిటియా జేమ్స్ అన్నారు.
శ్రామిక కుటుంబాలు, అమెరికా వ్యాపారాలపై ఈ సుంకాలు అతిపెద్ద పన్నులని, ఈ పన్నులను కొనసాగడానికి అనుమతిస్తే ఇది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని, అన్నిరకాల వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పెంచుతుందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తలకిందులైన ప్రపంచ మార్కెట్లు
కార్లు, స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని నిర్దిష్ట వస్తువులపై విధించిన సుంకాల గురించి కోర్టును పిటిషనర్లు ప్రత్యేకంగా కోరలేదు.
సుంకాలను సమర్థించుకోవడానికి ట్రంప్ ఉదహరించిన 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టం (ఐఈఈపీఏ) భారీ సుంకాలను విధించే అధికారం ఇవ్వలేదని ముగ్గురు జడ్జిల ప్యానల్ తన తీర్పులో పేర్కొంది.
''ఐఈఈపీఏ ఇచ్చిన అధికారాలను అధ్యక్షుడి టారిఫ్ ఆర్డర్లు మించిపోయాయి. దిగుమతులను నియంత్రించడానికి ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి ఉన్న అధికారాలు పరిమితం. అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలు ట్రాఫికింగ్ టారిఫ్‌లకు వర్తించని కారణంగా అవి చెల్లవు’’ అని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 2న ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధం కొన్ని దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి సుంకాలను తగ్గించడం, లేదా మార్చడం వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పరిస్థితి రోలర్‌కోస్టర్ రైడ్‌లా మారింది.
జపాన్ కు చెందిన నిక్కీ 225 సూచీ 1.5 శాతం, షాంఘై కాంపోజిట్ 0.7 శాతం లాభపడటంతో ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం కోలుకున్నాయి. కోర్టు తీర్పు తర్వాత యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా పెరిగాయి. ఫ్యూచర్స్ అనేది భవిష్యత్తు తేదీలో ఆస్తిని కొనడానికి లేదా విక్రయించడానికి ఒప్పందాలు చేసుకోవడం.అలాగే అవి మార్కెట్లు తెరిచినప్పుడు ఎలా ట్రేడ్ అవుతాయో కూడా సూచిస్తాయి. జపాన్ యెన్, స్విస్ ఫ్రాంక్ వంటివాటితోనూ అమెరికా డాలర్ లాభపడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడేం జరగనుంది?
కోర్టు తీర్పు తక్షణ పరిణామాలు ఎలా ఉండనున్నాయనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.
వైట్ హౌస్ తన అప్పీల్‌లో విఫలమైతే, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (సీబీపీ) తన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుందని సీబీపీ మాజీ ఉన్నతాధికారి జాన్ లియోనార్డ్ బీబీసీతో చెప్పారు.
ఉన్నత న్యాయస్థానం ట్రంప్‌కు మరింత అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు. అయితే అన్ని కోర్టులు ఈ తీర్పును సమర్థిస్తే టారిఫ్‌ల పరిధిలోని వ్యాపారులు తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాలపై వడ్డీతో సహా రీఫండ్స్ పొందుతారు. వీటిలో పరస్పర సుంకాలు అనేవి కూడా ఉన్నాయి, ఇవి చాలా దేశాలకు 10 శాతం మేర తగ్గించారు. చైనా ఉత్పత్తులపై 145శాతానికి పెంచినా ప్రస్తుతానికి 30 శాతం వద్ద ఉన్నాయి.
ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండవని, సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని లియోనార్డ్ తెలిపారు. స్టీల్, అల్యూమినియం సుంకాలు బుధవారం తీర్పుతో ప్రభావితం కావని, ఎందుకంటే అవి ట్రంప్ తన గ్లోబల్ టారిఫ్ పాలనను సమర్థించడానికి ఉపయోగించిన అత్యవసర చర్యలకు భిన్నమైన చట్టం కిందకు వస్తాయని ఆయన అన్నారు.
మార్కెట్ ప్రతిస్పందనలు పాక్షికంగా, "వాణిజ్య యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్విగ్న పరిస్థితుల తరువాత పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు" అని ఎస్‌పీఐ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన స్టీఫెన్ ఇన్నెస్ ఒక కామెంట్రీలో రాశారు.
''ఓవల్ కార్యాలయం ట్రేడింగ్ డెస్క్ కాదని, రాజ్యాంగం ఖాళీ చెక్కు కాదని'' అమెరికా న్యాయమూర్తులు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ తీర్పు "కథలో నిర్మాణాత్మక ముందడుగు స్ట్రాంగ్ మ్యాన్ టారిఫ్ ల నుండి సంస్థాగత రక్షణ వరకు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














