ఐయాం సింగిల్ అండ్ హ్యాపీ: మహిళలు ఒంటరిగా ఉంటే సమాజం ఎలా చూస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
"ఐయాం సింగిల్ అండ్ హ్యాపీ" (నేను సింగిల్, సంతోషంగా ఉన్నాను) అనేది జెన్ జీ తరానికి ఓ మంత్రంగా మారింది.
వాళ్ల ఆలోచనలను గౌరవించాల్సిందే. ప్రతి ఒక్కరికీ వాళ్ల వాళ్ల స్పేస్ అనేది చాలా ముఖ్యం. కానీ, ఇక్కడ వాళ్ల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారా అనేది ప్రశ్న.
ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా సింగిల్‌గా ఉండే వ్యక్తులు ఎక్కువయ్యారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 7 కోట్ల మందికి పైగా సింగిల్ మహిళలున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య కూడా పెరిగే ఉంటుంది.
2011-19 మధ్యలో 15-29 ఏళ్ల మధ్య వయసున్న అవివాహితుల సంఖ్య 17.2% నుంచి 23%కి పెరిగింది. ఇందులో మహిళల సంఖ్య 13.5% నుంచి 19.9%కి పెరిగితే పురుషుల సంఖ్య 20.8% నుంచి 26.1%కి పెరిగినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ మిషన్ 2022లో నిర్వహించిన యూత్ ఇన్ ఇండియా సర్వే తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
నేటి యువత తమ ఇష్టానికి వ్యతిరేకంగా జీవితాన్ని నిర్మించుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ తమ ఉనికిని, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా జీవితాన్ని నిర్మించుకుంటున్నారా?
భారతీయ సమాజంలో జీవితం చాలా వరకు పెళ్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి.. ఆమె పెళ్లి కోసం డబ్బులు సంపాదించాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. సినిమాలు కూడా ప్రేమ, పెళ్లి అనే ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.
ఈ ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది.
అమ్మాయిల చదువుకు చాలా మంది తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అమ్మాయి అంటే ఓ భారం అన్న భావన ఎక్కడో లోపల నాటుకుపోయింది.
ఇలాంటి సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న సమాజంలో అమ్మాయిలు సింగిల్‌గా ఉండటం అంత సులభమైన విషయం కాదు. అమ్మాయి సింగిల్‌గా ఉండటాన్ని సమాజం ఆమోదిస్తోందా? లేదా వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారా? ఇది తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.
విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల రిషిత నాతో మాట్లాడుతూ… "పెళ్లి పట్ల ద్వేషం లేదు. కానీ మాతో మేం గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి వద్దు అని నిర్ణయించుకున్నాను. పెళ్లైతే మా జీవితం అవతలి వ్యక్తుల నియంత్రణలోకి వెళ్లిపోతుందనే భయం ఉంది. మా వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టాలకు గౌరవం ఇచ్చే వ్యక్తులు దొరకడం కష్టం" అని చెప్పారు.
పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటమే సంతోషంగా ఉందని 81% మంది భారతీయ మహిళలు చెప్పినట్లు బంబుల్ నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించినట్టుగా 2023లో వోగ్ ఇండియాలో ప్రచురితమైన ఒక వ్యాసం పేర్కొంది.
మరో 83% మంది తమ ఇష్టాలకు తగిన భాగస్వామి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటామని కచ్చితంగా చెబుతున్నారు.
బంబుల్ ఒక డేటింగ్ యాప్. జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా 2000 మంది సింగిల్ అడల్ట్స్ తో 2022 ఆగస్టులో బంబుల్ ఓ సర్వే నిర్వహించింది.

ఫొటో సోర్స్, Getty Images
చదువు, కెరీర్, వ్యక్తిగత ఆసక్తులు కూడా పెళ్లి వాయిదా వేసేందుకు కారణాలు అవుతున్నాయి.
అమ్మాయికి 20 ఏళ్లు దాటినప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.
"సింగిల్‌గా ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైందేనని చుట్టూ ఉన్న సమాజాన్ని ఒప్పించడం కష్టమైన పనే. కానీ, మన నిర్ణయాలపై మనకు నమ్మకం ఉంటే ఎవరికీ భయపడాల్సిన పని లేదు" అని బెంగళూరుకు చెందిన డాక్టర్ ప్రియాంక సర్కార్ అంటారు. ఈమె అవివాహిత.
కుటుంబం పట్ల తనకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సింగిల్‌గా ఉండాలనే తన నిర్ణయం తనకు చాలా సంతృప్తిని ఇస్తోందని ఆమె అంటారు.
"నా పూర్తి శక్తి సామర్థ్యాలను నా కెరీర్‌పైనే పెడుతున్నాను. నాపై ఎవరి ఆంక్షలూ లేవు. నేను ఎవరి కోసం ఏమీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నా జీవితాన్ని నాకిష్టమైనట్లు బతకడం నాకు చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు.
"ఇలా జీవించాలని అనుకోవడం సమాజపు విలువల్ని ధిక్కరించడం కాదు. ఇది తమను తాము తెలుసుకునే ప్రయత్నం" అని లీడ్స్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ సోషియాలజీ లెక్చరర్ డాక్టర్ స్టీఫెన్ వైట్ హెడ్ అన్నట్లు 2024 సెప్టెంబరులో బిజ్ బజ్‌లో వచ్చిన ఒక వ్యాసం పేర్కొంది.
భారతీయ సమాజంలో చాలా వరకు స్త్రీ ఉనికి భర్త సంపాదన, స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా పరిచయమైన వారి నుంచి కూడా "మీ భర్త ఏం చేస్తారు?" అనే ప్రశ్నను తప్పించుకోవడం చాలా కష్టం.
"మన హోదాను సమాజం కంటే ముందు మనం ఆమోదించగలిగినప్పుడే సమాజాన్ని ఎదుర్కోగలం" అని హైదరాబాద్‌కు చెందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తేజస్వి వనం అంటారు. ఈమె ఒక సింగిల్ మదర్.
కానీ ఇదంత సులభం కాదని, దీనికి చాలా మానసిక బలం కావాలని కూడా ఆమె అన్నారు.
"నా చదువు, ఉద్యోగం, కెరీర్ నాకు ముఖ్యం" అని స్పష్టంగా చెప్పే అమ్మాయిలకు తమ సొంత ఇంట్లో, బంధువులతో కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. సమాజం వారిని చూసే దృష్టి కోణం పూర్తిగా మారిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రియాంక… "సమాజం నా నిర్ణయాన్ని ఆమోదిస్తుంది. కానీ, చాలామంది నా అభిప్రాయంతో ఏకీభవించరు. నా స్నేహితులు కూడా నన్ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. కానీ, వాళ్ల అభిప్రాయాలకు నేను విలువ ఇవ్వను. నా ప్రయాణం తెలుసుకోకుండా మాట్లాడేవాళ్లకు నేనెందుకు ప్రాముఖ్యం ఇవ్వాలి? నా కుటుంబం నా నిర్ణయానికి మద్దతు ఇస్తుంది. నా కుటుంబం ఇచ్చే సహకారం నాకు చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు.
"ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారేమో అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తారు. లేదా తమ భర్తలను ఎక్కడ లోబరచుకుంటారో అనే భావనతో ఇంకొందరు చూస్తారు" అని 'బీయింగ్ సింగిల్ ఇన్ ఇండియా' పుస్తక రచయత సారా లాంబ్ రాశారు.
"సింగిల్‌గా ఉండటంపై తీసుకున్న నిర్ణయం పట్ల నేనే పూర్తిగా మానసికంగా స్థిరంగా లేను. మరొకరి జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాను? నా కెరీర్‌పై దృష్టి పెడతాను. నాకు నచ్చిన పనులు చేస్తాను. ట్రావెల్ చేస్తాను. జీవితంలో నాకు నచ్చిన వ్యక్తి తారసపడితే ఆలోచిస్తానేమో! ప్రస్తుతానికి మాత్రం నా జీవితం సింగిల్‌గానే గడపాలని నిర్ణయించుకున్నాను" అని రిషిత చెప్పారు.
విడాకులు తీసుకునో లేదా భర్త మరణించడంవల్లనో ఒంటరిగా ఉండే మహిళల పరిస్థితి వేరు. పిల్లల కోసమో, సమాజం పట్ల భయంతోనో ఒంటరిగా ఉందామని నిర్ణయించుకుంటారు.
ఇది పూర్తిగా సామాజిక, ఆర్థిక సంబంధమైన అంశం. కొన్ని తరాలుగా స్త్రీ జీవితం పెళ్లి, పిల్లలు, కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ మార్పును ఒక్కసారిగా ఆమోదించడానికి సమయం పడుతుంది.
కానీ, నువ్వింకా ఒంటరిగానే ఉన్నావెందుకు అనే ప్రశ్నను అబ్బాయిలు ఎక్కువగా ఎదుర్కోరు. మన సామాజిక పరిస్థితులు, పితృస్వామ్య భావాలు కొంతవరకు దీనికి కారణం కావచ్చు.
విడాకులు తీసుకోవడం కూడా ఒక టబూగానే మిగిలింది. 'ఇక భరించలేను' అనే పరిస్థితి వచ్చే వరకు చాలా మంది మహిళలు విడాకుల వరకు వెళ్లరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండటం కన్నా కూడా సమాజం ఏమంటుందో అనే భయంతోనే చాలామంది ఉంటారు. ఒంటరిగా ఉంటే సమాజంలో తమ గౌరవం పోతుందేమో అని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.

భారత్‌లో పెళ్లి చేసుకుంటేనే ఆర్థిక, సామాజిక భద్రత దొరుకుతుందనే అభిప్రాయం బలంగా ఉంది.
ఒక వివాహిత మహిళ.. సింగిల్ మహిళను చూసే దృక్కోణం ఎలా ఉంటుందని 57 సంవత్సరాల ఓ గృహిణిని అడిగాను.
"ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటోంది అనగానే అయ్యో అనిపిస్తుంది. ఆమెను ఎవరు చూసుకుంటారు? అనే జాలి కలుగుతుంది. సింగిల్ అనగానే ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందేమో, అందుకే పెళ్లి కాలేదేమో! అనే భావనతో చూస్తారు. ఒక అమ్మాయికి భద్రత పురుషుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనే అభిప్రాయం చాలా బలంగా నాటుకుపోయింది. ఇది తరతరాల కండీషనింగ్. మా అమ్మాయి పెళ్లి ఆలస్యం అయినప్పుడు నేను కూడా చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాను" అని ఆమె చెప్పారు.
"కానీ, పెళ్లి చేసుకోవాలా, ఒంటరిగా ఉండాలా అనేది ఒక అమ్మాయి సొంత నిర్ణయం" అని ఈమె అన్నారు.
మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడుతున్నప్పటికీ, సింగిల్ మహిళలకు ఇల్లు అద్దెకు దొరకడం కూడా కష్టంగానే ఉంటోంది.
చాలా మంది ఇళ్ల యజమానులు "ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్" అని బోర్డు పెడతారు.
"సింగిల్‌గా ఉండటం వల్ల ఇంటికి ఎవరు వచ్చి వెళ్తూ ఉంటారో మాకు తెలియదు. ఇదెందుకో ముప్పుతో కూడిన పని అని మాకనిపించి మా సొసైటీలో సింగిల్‌గా ఉండేవాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సంకోచిస్తాం" అని విశాఖపట్నానికి చెందిన చంద్రకళ చెప్పారు.
ఇలాంటి సామాజిక భయాల వల్లే చాలా మంది టాక్సిక్ సంబంధాల నుంచి బయటపడటానికి ఇష్టపడరు.
"పాశ్చాత్య దేశాల్లో ఒంటరిగా ఉండటానికి… చైనా, ఇరాన్, భారత్ లాంటి దేశాల్లో మహిళలు ఒంటరిగా ఉండటానికి చాలా తేడా ఉంది" అని సారా లాంబ్ తన పుస్తకంలో రాశారు.
"ఉన్నత వర్గాలు, మెట్రో నగరాల్లో మాత్రమే మహిళలు సింగిల్ హుడ్‌ని ఒక స్టేటస్‌గా చూడగలుగుతున్నారని అర్థమవుతోంది" అని ఇండియా టుడేలో 2019లో "బ్రేవ్ న్యూ విమెన్" అనే టైటిల్‌తో ప్రచురితమైన కవర్ స్టోరీ పేర్కొంది.
ఇక సామాజిక కార్యక్రమాల్లో ఒక వివాహితను చూసే విధానానికి, అవివాహితను చూసే విధానానికి తేడా ఉంటుంది. ఈ వివక్షను ఎదిరించేందుకు సిద్ధంగా ఉండాలి. ముందుగా కుటుంబం ఆమోదించాలి. అమ్మాయి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి.
ఒక మహిళ సింగిల్‌గా ఉండటం చెప్పినంత సులభం కాదు. ఇందులో చాలా అంశాలు లోతుగా నాటుకుపోయి ఉంటాయి.
భారత్‌లో వివాహ వ్యవస్థ పవిత్రమైనది, బలమైనది అంటారు, కానీ.. వివాహంలో విపరీతంగా మరొకరిపై ఆధారపడటం, అణచివేత దాగి ఉన్నాయని ఒక అధ్యయనం నిరూపించినట్లు సారా లాంబ్ రాశారు.
"భారత్‌లో పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో, పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా అంతే కష్టం. పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటాం అని మాత్రమే అనుకోకుండా సింగిల్‌గా ఉంటూ కూడా సంతోషంగా ఉంటాం అని అర్థం చేసుకోవాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు.
"హ్యాపిలీ అన్ మారీడ్" (పెళ్లి చేసుకోకుండా సంతోషంగా) ఉన్నాం అంటూ మజ్లిస్ లీగల్ సెంటర్ అనే సంస్థ సింగిల్ విమెన్ చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి ఆన్ లైన్ క్యాంపైన్‌లు కూడా నిర్వహిస్తోంది.
1925లో బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ "ది ఇండియన్ ఐడియల్ ఆఫ్ మ్యారేజ్" అనే వ్యాసంలో ఇలా రాశారు.
"ప్రతి దేశంలో మహిళను బంధించేందుకు పెళ్లి ఒక ఖైదు లాంటిదే. ఈ జైలుకు కాపలాదారులందరూ పెత్తనం చెలాయించే పురుషుని మాదిరిగా బ్యాడ్జ్ ధరించి ఉంటారు"
చాలామంది సాహచర్యాన్ని కోరుకుంటున్నప్పటికీ, తమ ఇష్టాలకు అనుగుణమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నారని అర్థమవుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














