ట్రంప్ కొత్త నిర్ణయంతో భారత విద్యార్థులకు అమెరికా వీసా కష్టమేనా?

డోనల్డ్ ట్రంప్, అమెరికా, విద్య, విద్యార్థులు, వీసా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో చేదువార్త చెప్పింది.

విద్యార్థి వీసాలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది.

విశ్వవిద్యాలయాలను రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చకూడదని అంటోన్న ట్రంప్ ప్రభుత్వం, అమెరికా విలువలను వ్యతిరేకించే విద్యార్థుల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

విద్యార్థి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలించే ప్రణాళిక(ప్లాన్)పై పనిచేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.

విద్యార్థి వీసాల కోసం విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, అమెరికా విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.

సోషల్ మీడియాలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను విమర్శించే విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం ఉండదా?

అసలు సోషల్ మీడియాను ఎలా తనిఖీ చేస్తారు? విద్యార్థి వీసా ఇంటర్వ్యూలపై కొత్త ఆంక్షలు ఎలాంటి ప్రభావం చూపుతాయి. ఈ ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చూద్దాం.

భారతీయ విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

డోనల్డ్ ట్రంప్, అమెరికా, విద్య, విద్యార్థులు, వీసా

ఫొటో సోర్స్, Getty Images

ఏటా భారత్ నుంచి వేలాది మంది విద్యార్థులు, అమెరికాలో చదువుకోవడానికి వెళ్తుంటారు.

2023-24లో దాదాపు 3.30 లక్షల మంది భారతీయ విద్యార్థులు, అమెరికాలో చదువుతున్నట్లు ఓపెన్ డోర్-2024 నివేదిక పేర్కొంది.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొత్త సెషన్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. కొత్త సెషన్ కోసం వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపొచ్చు.

బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన మెమోను పరిశీలించింది.

మంగళవారం జారీ చేసిన ఈ మెమోలో, పెండింగ్‌లో ఉన్న అన్ని వీసా అపాయింట్‌మెంట్లను క్యాలెండర్ల నుంచి తీసేయాలని తమ ఎంబసీలను ఆదేశించింది.

అయితే, ఇప్పటికే వీసా అయింట్‌మెంట్ ఖరారైన విద్యార్థుల దరఖాస్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని నివేదికలు తెలుపుతున్నాయి.

సోషల్ మీడియా ఖాతాలతో వీసాపై పడే ప్రభావం ఏంటి?

డోనల్డ్ ట్రంప్, అమెరికా, విద్య, విద్యార్థులు, వీసా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే కోరికను సోషల్ మీడియా ఖాతాలు ప్రభావితం చేస్తాయి.

గత నెలలో అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసన తెలిపిన వందల మంది విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. వీరిలో ఎక్కువ మంది పాలస్తీనియన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

చదువుకోవడానికే విద్యార్థులకు వీసాలు ఇస్తున్నామని, ఆందోళనలు చేయడానికి కాదని అమెరికా అంటోంది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు కూడా ప్రభావితమయ్యారని హిందూస్థాన్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.

విద్యార్థి వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా స్క్రీనింగ్, దర్యాప్తును మరింత పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంబసీలకు తన సందేశంలో రూబియో తెలియజేశారు.

దర్యాప్తులో ఏయే అంశాలు ఉంటాయో ఈ సందేశంలో ఆయన పేర్కొనలేదు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా, విద్య, విద్యార్థులు, వీసా

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియా వెట్టింగ్, స్క్రీనింగ్ అంటే ఏంటి?

సోషల్ మీడియా వెట్టింగ్, స్క్రీనింగ్ చేయడం అంటే, అమెరికాలో చదువుకోవాలని అనుకుంటున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టులను, కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

ఈ తనిఖీ తర్వాతే, విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలలో చదువుకోవడానికి వీసా ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.

విద్యార్థులకు చెందిన ఫేస్‌బుక్, ఎక్స్, లింక్డిన్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తారు.

ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల సంగతేంటి?

ట్రంప్ ప్రభుత్వం తాజాగా విద్యార్థుల వీసా ప్రక్రియను కఠినం చేయడంతో పాటు, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చింది.

విదేశీ విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే, కాలేజీలో చేరిన కోర్సును మానేయాలనుకుంటే వారి వీసాలు రద్దు అవుతాయని హెచ్చరించింది.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసే పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎటువంటి పోస్టులు విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్లో ఉండకూడదని అమెరికా చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)