ఏపీ, తెలంగాణల్లో రోహింజ్యాలకు ఆధార్, రేషన్ సహా గుర్తింపు కార్డులు ఎలా వస్తున్నాయి, దీనిపై విమర్శలేంటి?

రోహింజ్యా ముస్లింలు, మియన్మార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తప్పుడు పత్రాలతో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన రోహింజ్యాలను పోలీసులు అరెస్టు చేశారు.
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో రోహింజ్యాల సమస్య మరోసారి చర్చనీయాంశం అవుతోంది. కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో రోహింజ్యాల అరెస్టులు జరగడం ఒక కారణమైతే, ఏపీ నుంచి పవన్ కల్యాణ్, తెలంగాణ నుంచి బండి సంజయ్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలతో తీవ్రతపెరిగింది.

మియన్మార్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా 2012 తరువాత రోహింజ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో భారత్, బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు.

వారిలో చాలామందికి శరణార్థి గుర్తింపు కార్డులు ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. వారి దగ్గర ఆ కార్డులు మాత్రమే ఉంటాయి.

వారంతా ఐరాస ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు.

వాళ్ల పిల్లలకు ఇక్కడ బడుల్లో అడ్మిషన్లు దొరకవు. ఉద్యోగాలు కూడా రావు.

దీంతో శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారి పిల్లలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తూ చదువు చెప్పిస్తున్నాయి.

అదే సమయంలో, ఉపాధి నిమిత్తం కొందరు రోహింజ్యాలు, అక్రమ మార్గాల్లో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందడం, వారిని పోలీసులు పట్టుకోవడం సాధారణం అయిపోయింది.

పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై చర్చ నడుస్తోన్నవేళ, రోహింజ్యాలు అరెస్ట్ కావడం, దానిపై బీజేపీ-జనసేన స్పందించడంతో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోహింజ్యా ముస్లింలు, మియన్మార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆధార్ కార్డు సాయంతో మిగతా పత్రాలను రోహింజ్యాలు సులభంగా పొందుతున్నారు.

భారత ప్రభుత్వం జారీ చేసే జాతీయ గుర్తింపు కార్డులను అక్రమంగా పొందిన నేరానికి ఇటీవలే నలుగురు పిల్లలు సహా మొత్తం ఎనిమిది మంది రోహింజ్యాలను హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ గుర్తింపు కార్డులు పొందడం కోసం వారు నకిలీ ఆధారాలు, నకిలీ పత్రాలను ఉపయోగించారని రాచకొండ పోలీసులు చెప్పారు.

వీరిపై ఫోర్జరీ, చీటింగ్, దేశ సమగ్రతకు భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు.

వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలలో ఆధార్ కార్డుల నుంచి బర్త్ సర్టిఫికెట్ల వరకు, ఓటర్ కార్డు నుంచి బ్యాంకు పాస్‌బుక్ వరకు వివిధ రకాల సర్టిఫికెట్లు, అధికారిక పత్రాలు ఉన్నాయి.

రోహింజ్యా ముస్లింలు, మియన్మార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్రమంగా వలస వచ్చి క్యాంపుల్లో ఉంటున్న రోహింజ్యాలకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు కార్డులు ఇచ్చింది

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, 2011లో మహమ్మద్ అర్మాన్ అలియాస్ సయద్ ఉల్ అమీన్, మహమ్మద్ రుమానా అక్తర్ అలియాస్ ముస్తకిమా, మహమ్మద్ నయీమ్ అలియాస్ హైరుల్ అమీన్‌లు మియన్మార్ సరిహద్దు దాటి అక్రమంగా భారతలోకి ప్రవేశించారు.

తరువాత 2014లో మహమ్మద్ అర్మాన్ అలియాస్ సయద్ ఉల్ అమీన్ తప్పుడు డిక్లరేషన్ పత్రాలు సమర్పించి, మంచాలలోని ఈ-సేవ సెంటర్లో ఆధార్ కార్డు తీసుకున్నారు.

దీనికి మహమ్మద్ హారిస్ అలియాస్ మహమ్మద్ రిజ్వాన్ సహకరించారు.

ఆయన ఆధార్ కార్డు, వివాహ రిజిస్ట్రేషన్ పత్రం ఆధారాలుగా చూపించి మహమ్మద్ రుమానా అక్తర్ అలియాస్ ముస్తకిమా కూడా ఆధార్ కాార్డు తీసుకున్నారు.

తరువాత షోయబ్ మాలిక్ అనే వ్యక్తితో సయద్ ఉల్ అమీన్ సోదరుడైన మహమ్మద్ నయీమ్ అలియాస్ హైరుల్ అమీన్ పరిచయం పెంచుకున్నారు.

షోయబ్ మాలిక్ కూడా మియన్మార్ నుంచి 2016లో అక్రమంగా భారత్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

మహమ్మద్ నయీమ్ తప్పుడు పత్రాలు, తప్పుడు డిక్లరేషన్‌తో ఆధార్ కార్డు తీసుకోవడంలో ఈ షోయబ్ మాలిక్ సహకరించారు.

ఒకసారి ఆధార్ తీసుకున్న తరువాత దాని ఆధారంగా పాన్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సు బ్యాంకు అకౌంట్లు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీళ్లందరినీ మే 20న అరెస్ట్ చేశారు.

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, RachakondaPolice

ఫొటో క్యాప్షన్, రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న రోహింజ్యాలు

ఇదే ఏడాది ఫిబ్రవరిలో మహబూబ్ నగర్‌లో ముగ్గురు రోహింజ్యాలను పోలీసులు అరెస్టు చేశారు.

వారు 2012లో అక్రమంగా బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి వచ్చారు.

వారిలో ఒకరి దగ్గర భారత పాస్‌పోర్టు కూడా ఉంది.

అందులో 2012లో వచ్చిన వ్యక్తి, బంగ్లాదేశ్‌కి చెందిన ఒక జంటను 2024లో భారత్‌కు తీసుకువచ్చారు.

ఇక్కడ పని చూపిస్తానని వారి దగ్గర డబ్బు కూడా తీసుకున్నట్టు పోలీసులు ఆరోపించారు. వారు మహబూబ్ నగర్‌లోని ఫామ్‌హౌసులో 8 నెలలుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇక ఆంధ్రలో కూడా తాజాగా రోహింజ్యాల అరెస్టులు జరిగాయి.

హైదరాబాద్‌లోని శరణార్థి శిబిరం నుంచి తప్పించుకున్న 12మంది రోహింజ్యాలను కృష్ణా జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి పెనమలూరు పోలీసులకు అప్పగించారు.

వారంతా బాలానగర్‌లో శరణార్థి శిబిరం నుంచి వచ్చి, పెనమలూరు పరిధిలోని తాడిగడప, గంగూరు వంటి చోట్ల పనులు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

వారి నుంచి ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మే 25న ఈ అరెస్టులు జరిగాయి.

వారితో పాటు ఉన్న హైదరాబాదీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సాధారణంగా ఐక్యరాజ్యసమితి ఇచ్చే యూఎన్ హెచ్‌సీఆర్ కార్డులు మాత్రమే ఉండాల్సిన రోహింజ్యాల దగ్గర అన్నిరకాల గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయని బీజేపీ-జనసేన ప్రశ్నిస్తున్నాయి.

రోహింజ్యా ముస్లింలు, మియన్మార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, FB/janasenaparty

ఫొటో క్యాప్షన్, రోహింజ్యాల వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా‌ణ్ అన్నారు.

రోహింజ్యాల అక్రమ వలసల కారణంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా వస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

మే 20న ఆయన మాట్లాడారు.

''గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింజ్యాలు వచ్చారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. రోహింజ్యాలు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు ఎలా వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి'' అని పవన్ కల్యాణ్ మీడియాతో అన్నారు.

ఇదే అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ మే 22న మాట్లాడారు.

''ఒకవైపు దేశం యుద్ధం చేస్తుంటే, ఇక్కడ ఉన్న విదేశీయుల విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? రోహింజ్యాలకు ఆధార్, రేషన్ కార్డులు, సబ్సిడీలు ఇస్తున్నది వాస్తవం కాదా? వాళ్లను దేశం నుంచి ఎప్పుడు పంపిస్తారు? ఒకవేళ మీరు చేయకపోతే, మేము వాళ్లను పంపబోము, వారికి రేషన్ కార్డులు ఇస్తాము అని కేంద్రానికి లేఖ రాయండి. వారిని వెనక్కు పంపే పని కేంద్రం చూసుకుంటుంది'' అన్నారు సంజయ్.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన రోహింజ్యాలపై పోలీసులు దృష్టి సారించారు.

దీనిపై ఐరాస శరణార్థుల విభాగాన్ని బీబీసీ సంప్రదించింది.

"రోహింజ్యా అరెస్టులు, వారిని డిపోర్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు, వారి కమ్యూనిటీ నుంచి మాకు సమాచారం అందుతోంది. మేం దాన్ని పరిశీలిస్తున్నాం. వారికి ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు వెనక్కు పంపడంపై యుఎన్ హెచ్ సీ ఆర్ ఈ విషయంగా అధికారులతో మాట్లాడుతోంది. అంతర్జాతీయ పద్ధతుల ప్రకారం, ప్రాణాపాయం ఉన్న వారిని వెనక్కు పంపకూడదు. ఏ దేశమూ లేని రోహింజ్యాలకు కనీస రక్షణ కల్పించాలి. వారిని అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం వెనక్కు పంపేలా చూడాలి, అంతే తప్ప బలవంతంగా వెనక్కు పంపవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

అదే సమయంలో శరణార్థిగా వచ్చిన ప్రతి ఒక్కరూ తాము ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశ చట్టాలను, నిబంధనలను పాటించాలి. ఈ విషయంగా ఐరాస శరణార్థి సంస్థగా మేము తరచుగా శరణార్థులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ, వారి బాధ్యతను గుర్తు చేస్తున్నాం.'' అని బీబీసీకి చెప్పారు యూఎన్ హెచ్ సీ ఆర్ అసిస్టెంట్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ ఆఫీసర్ రమా ద్వివేది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)