రోహింజ్యా క్యాంప్: ప్రపంచంలో అతి పెద్ద శరణార్థి శిబిరంపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఎలా ఉందంటే...

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, కాక్సస్ బజార్ శరణార్థుల శిబిరంలో నివసిస్తున్న దాదాపు లక్షమందిలో ఇస్మత్ అరా ఒకరు.
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఆ రోజు, మా ఊరి మీద విపరీతంగా బాంబులు వేశారు. బాంబు శకలం ఒకటి నా మూడేళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయాము. గాయాలను ఆకులతో కప్పి, చుట్టూ బట్ట చుట్టాము. ఆ తర్వాత సరిహద్దుల్ని దాటి బంగ్లాదేశ్‌లోకి వచ్చాం. ఇక్కడే వైద్యం అందింది"

మాటలలో నిస్సహాయత, ఆవేదనను వ్యక్త పరుస్తూ, తన కుమారుడికి ప్రాణాంతకంగా మారిన బాంబు శకలం ఫోటోను బీబీసీకి చూపించారు ఇస్మత్ అరా.

ఆమెతో పాటు లక్షల మంది శరణార్థులు బంగ్లాదేశ్‌లోని కాక్సస్ బజార్‌లో వెదురు బొంగులు, టార్పాలిన్ పట్టాలతో వేసిన తాత్కాలిక టెంట్లలో జీవిస్తున్నారు.

ఏడు నెలల కిందట, మియన్మార్‌లోని మౌంగ్డా ప్రాంతంలో ఉన్న సొంత ఇంటిని వదిలేసి ఇస్మత్ అరా తన కుటుంబంతో సహా బంగ్లాదేశ్‌కు పారిపోవాల్సి వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని కాక్సస్ బజార్ ప్రపంచంలో అతి పెద్ద రోహింజ్యా శరణార్థి శిబిరంగా మారింది.

మియన్మార్‌లో బౌద్ధులు ఎక్కువ

ప్రపంచంలో ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతున్న రోహింజ్యా కమ్యూనిటీకి చెందినవారు ఇస్మత్ అరా. ఈ కమ్యూనిటీలో ఎక్కువమంది ముస్లింలు.

ఆమె ప్రస్తుతం కాక్సస్ బజారులో ఏర్పాటు చేసిన 34 క్యాంపుల్లోని ఓ క్యాంపులో ఉంటున్నారు.

బంగ్లాదేశ్‌లోని ఈ ప్రాంతం పది లక్షల మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరమని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

2021లో సైన్యం మియన్మార్‌లో అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. వాస్తవానికి రఖైన్ రాష్ట్రంలోని రోహింజ్యాలు కొన్ని దశాబ్దాలుగా అణచివేత, హింసను ఎదుర్కొంటున్నారు.

2016 అక్టోబర్‌లో ‘అరాకన్ రోహింజ్యా సాల్వేషన్ ఆర్మీ’ పేరుతో ఏర్పాటైన ఒక టెర్రరిస్టు గ్రూపు, ఈ ప్రాంతంలోని కొన్ని పోలీస్ కేంద్రాల మీద దాడి చేసింది. 9 మంది అధికారులను చంపేసింది.

దీనికి స్పందించిన సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఈ సమయంలో మియన్మార్ సైన్యం హత్యలు, అత్యాచారాలు, చిత్రహింసలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. తాము తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను కాదని సైన్యం వివరణ ఇచ్చింది.

దీని ఫలితంగా 2017 ఆగస్టులో మియన్మార్‌లో దాదాపు 700 మంది రోహింజ్యా ముస్లింలు తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. దీనిని భరించలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఆ వలస ఇప్పటికీ కొనసాగుతోంది.

సరిహద్దుల్లో ఉన్న మియన్మార్ రాష్ట్రం రఖైన్ నుంచి ఇప్పటికీ వేలమంది బోర్డర్ దాటి బంగ్లాదేశ్‌లోకి వస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న నఫ్ నది, కొన్నిసార్లు సముద్ర మార్గాల్లో చిన్న పడవల మీద ప్రయాణిస్తూ, మరి కొందరు అడవుల్లో ప్రమాదకరమైన మార్గాల గుండా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్ చేరుకుంటున్నారు.

రోహింజ్యాల మీద దాడి ‘జాతి హననం’ అని ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.

ఈ సంఘటనలపై విచారణ తర్వాత, మియన్మార్ సైనిక జనరల్, అప్పటి అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లెయింగ్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయ స్థానం ప్రాసిక్యూషన్ కోరింది. రోహింజ్యాల మీద జరిగిన దాడులకు ఆయనే బాధ్యుడని విచారణలో తేలింది.

గతేడాది కూడా 60వేల మంది రోహింజ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారని బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ క్యాంపుల్లో ప్రతీ ఏటా 30వేల మంది పుడుతున్నారని, కాక్సస్ బజారులో శరణార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, క్యాంపుల్లో నివసిస్తున్న రోహింజ్యాలు

ఉపాధి లేదు, ఆదాయంలేదు, అరకొరగా సాయం

రోహింజ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌లో పని లేదా ఉద్యోగం చేసేందుకు స్థానిక చట్టాలు అంగీకరించవు. అంతే కాకుండా వాళ్లు విద్య, వైద్యం కోసం క్యాంపుల్ని వదిలి వెళ్లడానికి అవకాశం లేదు.

ఆహారం, దుస్తులు, భవన నిర్మాణ సామగ్రి, వైద్య సేవలు, స్కూళ్లు ఇలా అన్నింటికీ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే విరాళాల మీదనే శరణార్థులు ఆధారపడాలి.

డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత యూఎస్ ఎయిడ్ ద్వారా ఇస్తున్న నిధులను నిలిపేశారు. దీంతో శరణార్థుల పరిస్థితి మరింత క్షీణించింది.

2017 నుంచి కాక్సస్ బజారులో పిల్లల్లో పోషకాహార లోపం చాలా తీవ్రంగా ఉందని ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ తెలిపింది.

తమకు నిధులు అందడం లేదని, అందుకే రోహింజ్యా క్యాంపులకు ఇస్తున్న ఆహార సరఫరాలను సగానికి తగ్గించామని, శరణార్థులకు ఆహారం అందించేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వెల్లడించింది.

శరణార్థుల కనీస అవసరాలకు సరిపడా వస్తువుల్ని సరఫరా చేస్తున్న అనేక సంస్థల కార్యక్రమాలు ఆగిపోవడాన్ని బీబీసీ గుర్తించింది.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, కుమారుడితో ఫాతిమా అక్తర్

మూత పడ్డ వైద్య కేంద్రాలు, దూరం వెళ్లాలంటే డబ్బుల్లేవు

కాక్సస్ బజారుకు దక్షిణంవైపు 80 కిలోమీటర్ల అవతల ఉన్న టెక్నాఫ్ ప్రాంతంలో 12 ఏళ్ల అన్వర్ సదేఖ్‌ను బీబీసీ కలిసింది.

ఆ బాలుడు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు. మాట్లాడలేడు. వినపడదు కూడా.

2017లో 9 మంది సభ్యులున్న ఆయన కుటుంబం మియన్మార్ నుంచి బంగ్లాదేశ్ వచ్చింది.

వాళ్లందరూ గుడారాల్లోనే నివసిస్తున్నారు. అందులో కేవలం బల్బులు మాత్రమే ఉన్నాయి. ఫ్యాన్లుగానీ, మరుగుదొడ్డి వసతిగానీ లేదు. అక్కడ నాలుగు కుటుంబాలు ఒకే మరుగుదొడ్డిని వాడుకుంటున్నాయి.

" ఇంతకు ముందు ఇక్కడ మా పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. మా అబ్బాయికి వైద్యం అందేది. కొన్ని రోజుల కిందట మా పిల్లాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు క్లినిక్ మూసేసి ఉంది. నెల రోజులైంది, ఇంకా తెరవలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు." అని అన్వర్ తల్లి ఫాతిమా అక్తర్ చెప్పారు.

హ్యాండీకాప్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న ఈ క్లినిక్‌కు తాళం వేసి ఉండటాన్ని బీబీసీ గుర్తించింది. అమెరికా ప్రభుత్వం నిధులు నిలిపివేయడం వల్ల తాము సర్వీసులను అందించలేకపోతున్నామని క్లినిక్ తలుపు మీద ఒక నోటీసు అంటించారు.

బీబీసీ మరో క్యాంపును సందర్శించినప్పుడు అక్కడున్న గర్భవతుల్ని కలిసింది.

"స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి ఒకరు క్యాంపులో ఉన్న నాలాంటి గర్భవతుల్ని తరచుగా వచ్చి చూసేవారు. మమ్మల్ని వైద్య కేంద్రానికి తీసుకెళ్లేవారు. అయితే నెల రోజుల నుంచి ఎవరూ రాలేదు. ఇప్పుడు వైద్యం కోసం మేము చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. మా దగ్గర డబ్బుల్లేవు. ఈ దేశం గురించి మాకు ఏమీ తెలియదు." అని సిన్వర్ అనే మహిళ చెప్పారు.

ఆహార సరఫరాతో పాటు ఇతర సేవల్లోనూ కోత పడిందని క్యాంప్ నాయకుడు మొహమ్మద్ నూర్ అన్నారు.

"ప్రతి శీతాకాలంలో మాకు వేడినిచ్చే దుస్తులు అందేవి. రంజాన్ పండక్కి ఆహారం వచ్చేది. ఈసారి ఏమీ రాలేదు. అంతకు ముందు కూడా ఆహారం పరిమితంగానే అందేది. అదిప్పుడు ఇంకా తగ్గింది. మాకు మాస్కులు, శానిటైజర్లు, మందులు వచ్చేవి. క్యాంపుల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ ఏడాది మాకు ఏమీ రాలేదు" అని ఆయన చెప్పారు.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, రోహింజ్యాల మీద దాడి 'జాతి హననం' అని ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.

దీనికి పరిష్కారం ఉందా?

ఈ విషయం తెలుసుకునేందుకు, బీబీసీ డేవిడ్ బుగ్డెన్‌ను కలిసింది. ఆయన కాక్సస్ బజార్‌లోని క్యాంపులు, వందకు పైగా ఎన్జీవో ప్రోగ్రామ్‌లకు సమన్వయకర్త. రోహింజ్యా రెఫ్యూజీ రెస్పాన్స్ బంగ్లాదేశ్ అనే సంస్థను నడుపుతున్నారు.

ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని ఆయన అంగీకరించారు.

"నిధులు తగ్గిపోవడం, అనేక సేవలపై ప్రభావం చూపించింది. వచ్చే ఏడాది మాకు వచ్చే నిధులు ఇంకా తగ్గిపోతాయి. ఇదిలాగే కొనసాగితే శరణార్థుల అవసరాలు, అందుకు అవసరమైన నిధుల మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది" అని ఆయన చెప్పారు.

దీని ఫలితం ఎలా ఉంటుంది?

"ప్రజల్లో అసహనం పెరిగితే వారు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లు ఇక్కడ నుంచి మరెక్కడికైనా వలస వెళ్లవచ్చు. భద్రత, నేరాలకు సంబంధించిన పరిస్థితులు అదుపు తప్పవచ్చు" అని డేవిడ్ చెప్పారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ కొన్ని రోజుల కిందట కాక్సస్ బజారును సందర్శించారు. ఆహార సరఫరాల్లో కోతపై స్పందిస్తూ ఇది ఎంత మాత్రం ఆమోదనీయం కాదన్నారు.

"ఈ ఏడాది శరణార్థులకు సాయం అందించాలంటే 93 కోట్ల అమెరికన్ డాలర్ల( సుమారు రూ. 8 వేలకోట్ల) సాయం అవసరం. ఆ నిధుల కోసం మేము త్వరలో ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తాం. మేము అడిగితే 60 నుంచి 70శాతం నిధులు వస్తాయి. అయితే ఈ ఏడాది మాకు అంతగా నిధులు అందకపోవచ్చు." అని డేవిడ్ బుగ్డెన్ చెప్పారు.

2023లో డేవిడ్‌కు సంబంధించిన సంస్థ 91 కోట్ల అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 7800 కోట్లు) నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఆ సంస్థకు 57 కోట్ల అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 4900) సాయం అందింది. అంతకు ముందు ఏడాది 56 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4800 కోట్లు) అందాయి.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, డేవిడ్ బుగ్డెన్‌ రోహింజ్యా రెఫ్యూజీ రెస్పాన్స్ బంగ్లాదేశ్ అనే సంస్థను నడుపుతున్నారు.

భారీగా నిధులు ఇచ్చిన అమెరికా

2017 నుంచి బంగ్లాదేశ్‌లో రోహింజ్యా శరణార్థులకు అమెరికా పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది.

అమెరికా ప్రభుత్వ సంస్థ యూఎస్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) అందిస్తున్న సాయంతో కాక్సస్ బజారులో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్‌లకు అందిస్తున్న నిధులను

నిలిపేశారు.

2024లో రోహింజ్యా శరణార్థులకు అందిన ఆర్థిక సాయం 54.5 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4650 కోట్లు)లో 30 కోట్ల డాలర్లు( సుమారు రూ. 2580 కోట్లు ) అమెరికా నుంచే వచ్చాయి.

2023లో అమెరికా 24 కోట్ల డాలర్ల( సుమారు 2000 కోట్లు) సాయం అందించింది. అయితే ప్రస్తుతం అమెరికా సాయం అందుతుందా, ఒకవేళ అందితే అది ఎంత వరకు అనే దానిపై సందిగ్ధత ఏర్పడింది.

"ఈ అంశంలో అమెరికా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాను. జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నాం. వాళ్లు తాము అందిస్తున్న సాయాన్ని పెంచుతామని చెప్పారు" అని బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాఫికుల్ ఆలమ్ బీబీసీతో చెప్పారు.

రోహింజ్యాలకు అధికంగా సాయం అందిస్తున్న దేశాల జాబితాలో భారత్ లేదు. 2017లో ఆపరేషన్ ఇన్సానియత్ కింద భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌లోని శరణార్థుల కోసం కొంత సహాయ సామగ్రి పంపించింది.

2019లో మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో 250 గృహాలను నిర్మించింది. రోహింజ్యా శరణార్థులను బంగ్లాదేశ్ నుంచి మియన్మార్ పంపించాలని భారత్ పదే పదే చెబుతోంది.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, 2024లో రోహింజ్యా శరణార్థులకు అందిన ఆర్థిక సాయంలో సగానికిపైగా అమెరికా నుంచే వచ్చాయి.

శరణార్థులు మియన్మార్‌కు తిరిగి వెళ్లగలరా?

అనేక మంది శరణార్థులను బీబీసీ ఇదే విషయమై ప్రశ్నించింది. అందరూ తాము వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం చూస్తే మియన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలసలు ప్రారంభమైన 2017 నుంచి ఒక్క శరణార్థి కూడా వెనక్కి వెళ్లలేదు.

"కొన్నేళ్లుగా, మేము అన్ని పరిశీలించిన తర్వాత 8 లక్షల మంది శరణార్థులకు సంబంధించిన సమాచారం మియన్మార్ ప్రభుత్వానికి అందించాం. మియన్మార్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇక్కడకు వచ్చి పరిశీలించారు. రోహింజ్యాల నాయకులు కూడా అక్కడకు వెళ్లి వచ్చారు. అయితే ఇంత వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు" అని బంగ్లాదేశ్ రెఫ్యూజీ రిలీఫ్ అండ్ రిఫార్షియేషన్ కమిషన్ అదనపు కమిషనర్ మొహమ్మద్ షంసుద్ డోజా చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.

"శరణార్థులు స్వచ్చందంగా మియన్మార్ వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం రఖైన్ రాష్ట్రంలో హింస, అంతర్యుద్ధం కొనసాగుతున్నాయి. అందుకే వాళ్లను ఇప్పుడు వెనక్కి పంపించడం సరికాదని భావిస్తున్నాం" అని షఫికుల్ ఆలం బీబీసీకి చెప్పారు.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, ఎలాంటి సాయం అందకపోవడంతో ఎన్జీవో ఆఫీసుకు తాళం వేశారు.

రోహింజ్యాల చరిత్ర

రోహింజ్యాలు మియన్మార్‌లో నివసించే ఒక ముస్లిం తెగకు చెందిన ప్రజలు. మియన్మార్‌లోని ముస్లింలలో అత్యధిక జనాభా వీరిదే. 2017 ప్రారంభంలో ఆ దేశంలో వీరి సంఖ్య 10 లక్షలు ఉండేది. వీరిలో అత్యధికులు రఖైన్ రాష్ట్రంలో నివసించేవారు.

వీరికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉంది. వీరిని అరబ్ వ్యాపారుల వారసులుగా చెబుతుంటారు.

కానీ, బౌద్ధుల ఆధిపత్యం ఉన్న మియన్మార్ ప్రభుత్వం రోహింజ్యాలను ఆ దేశ పౌరులుగా గుర్తించడం లేదు. 2014 జనాభా లెక్కల సమయంలో వీరిని పరిగణనలోకి తీసుకోలేదు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారిగా ఆ దేశం చెబుతోంది.

రోహింజ్యాలు, కాక్సస్ బజార్, మియన్మార్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, మియన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలసలు ప్రారంభమైన 2017 నుంచి ఒక్క శరణార్థి కూడా వెనక్కి వెళ్లలేదు.

అధికారిక లెక్కల కంటే ఎక్కువ సంఖ్య అని అంచనా

1970ల నుంచి రోహింజ్యాలు ఆసియాలోని వివిధ దేశాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించారు. అధికారిక లెక్కల కంటే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువేనన్నది ఒక అంచనా.

తాజా సంక్షోభానికి ముందునుంచే గత కొన్నేళ్లుగా వీరు మియన్మార్‌లో చెలరేగుతున్న మత హింస, భద్రతా దళాల దాడుల నుంచి తప్పించుకోవడానికి గాను ఆ దేశాన్ని వీడడం మొదలుపెట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)