పొట్టి శ్రీరాములు, సురవరం ప్రతాపరెడ్డి: తెలంగాణలో కులం రంగు పులుముకుంటున్న వర్సిటీల పేర్ల మార్పు, ఏమిటీ వివాదం...

ఫొటో సోర్స్, SURAVARAM/ MALLESWARBSN/TWITTER
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం తెలంగాణలో సురవరం ప్రతాప రెడ్డి వర్సెస్ పొట్టి శ్రీరాములు పేర్ల యుద్ధం నడుస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్థల పేర్లు మార్చే క్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదనపై బీజేపీ తీవ్ర అభ్యంతరం చెప్పింది.
ఇప్పుడీ చర్చ ప్రాంతంతో పాటు కులం చుట్టూ కూడా తిరుగుతోంది.

ఎవరీ సురవరం ప్రతాప రెడ్డి?
సురవరం ప్రతాప రెడ్డి సాహితీవేత్త, సాహితీ విమర్శకుడు, ఉద్యమకారుడు. ఇంకా వివరంగా చెప్పుకుంటే పత్రికా సంపాదకుడు, సాహితీ పరిశోధకుడు, రచయిత, ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే.
తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రతో సహా తెలుగు వారి సాంఘిక చరిత్ర చెప్పాలంటే ముందు గుర్తొచ్చే పేరు సురవరందే. చరిత్రంటే రాజులు, యుద్ధాలు కాకుండా ప్రజలు, వారి జీవన శైలి, ఆహారం, దుస్తులు, ఆటల గురించి రాసిన వ్యక్తి.
ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం ఇప్పటికీ ప్రామాణిక చరిత్ర పుస్తకాల్లో ఒకటి.
తెలుగుతో పాటూ, సంస్కృతం, హిందీ, ఉర్దూ, పార్సీ, ఇంగ్లిష్ భాషల్లో పండితుడాయన. గోల్కొండ పత్రిక, భారతి అనే సాహిత్య పత్రికను నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం పుస్తకాలు రాశారు.
నిజాం ప్రాంతంలో కవులే లేరని ముడుంబై రాఘవాచార్యులు ఆంధ్రప్రాంతానికి చెందిన పండితుడు విమర్శ చేయగా, దానిని సవాల్ చేస్తూ తెలంగాణకు చెందిన 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక అనే పుస్తకాన్ని ప్రచురించారు సురవరం.
1952 తొలి ఎన్నికల్లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఇప్పటి గద్వాల జిల్లాలోని ఇటిక్యాలపాడు ఆయన సొంతూరు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా పనిచేశారు. ట్యాంక్ బండ్‌పైన ఈయన విగ్రహం కూడా ఉంది.

ఫొటో సోర్స్, MALLESWARBSN/TWITTER
పొట్టి శ్రీరాములుకు తెలంగాణకు సంబంధం లేదా?
బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన రాష్ట్రాల ప్రకారం, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం అప్పటి మద్రాస్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వారు విడిపోవాలని కోరుకున్నట్టుగానే, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వారు విడిపోవాలని కోరుకున్నారు.
అది దశాబ్దాల పాటూ సాగిన పోరాటం. అయితే పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి మరణించడం ఆ పోరాట తీవ్రతను బాగా పెంచింది. అలా 1953లో మద్రాస్ నుంచి వేరుపడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకుడయ్యారు పొట్టి శ్రీరాములు. అదీ కాకుండా స్వతంత్ర పోరాటంలోనూ, దళితుల దేవాలయ ప్రవేశ ఉద్యమంలో కూడా ఆయన భాగమయ్యారు.
మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు పోరాటం చేశారు తప్ప, తెలంగాణతో ఎక్కడా ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన మరణించిన సుమారు నాలుగేళ్ల తరువాత ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్ర పరిధిలోని తెలంగాణ ప్రాంతమూ కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి, 2014 వరకూ కొనసాగింది.

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA CMO
పేరు మార్పు ఎందుకు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణలకు విశ్వవిద్యాలయాలను పంచారు. ఏ భూభాగంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆ రాష్ట్రానికే చెందేలా చేశారు.
అయితే ప్రాంతాల వారీగా కాకుండా అంశాల వారీగా ఉన్న విశ్వవిద్యాలయాలు అంటే తెలుగు వర్సిటీ, హెల్త్ వర్సిటీ, అగ్రి వర్సిటీ వంటి వాటి విషయంలో విభజన కాస్త సంక్లిష్టంగా మారింది.
అంబేడ్కర్ వర్సిటీ, తెలుగు వర్సిటీలు ఇంకా ఆంధ్రలో పూర్తి స్థాయిలో ఏర్పడలేదు.
దీంతో పాటూ మరో సాంకేతిక సమస్య వచ్చింది. ఒకే వర్సిటీ రెండుచోట్లా ఒకే పేరుతో ఉండడంతో ప్రాక్టికల్ సమస్యలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ క్రమంలో పేరు మార్పును ఆయన సమర్థించుకున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణలో పలు యూనిర్సిటీల పేర్లు మారాయి.
తెలంగాణలో గతంలో పేర్లు మార్చిన సంస్థలు
- డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం విజయవాడ - కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వరంగల్
- శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ – పీవీ నరసింహా రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ
- వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ – శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ
- ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం – ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
2024 ఆగస్టులో జరిగిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో వర్సిటీ పేరు మార్పు గురించి ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు.
''తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించాం'' అని తెలిపారు.
సెప్టెంబరు నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్చారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు పెడుతూ కేబినెట్ తీర్మానం చేసింది.
ఆ ప్రకటనను బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది.
''సురవరం గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టే నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇది సముచితమైన నిర్ణయం. ఉద్యాన వర్శిటీకి ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. మహిళా వర్శిటీకి చాకలి ఐలమ్మ పేరును స్వాగతిస్తున్నాం'' అంటూ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన రెడ్డి ప్రకటించారు.
2024 డిసెంబరు నెలలో బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ కొత్త ప్రాంగణాన్ని కూడా సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అనే వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook
వ్యతిరేకిస్తున్న బీజేపీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆర్యవైశ్యగా పిలుచుకునే కోమటి కులంలో పుట్టారు.
ఆ క్రమంలోనే కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్య సంఘాల వారు ఈ పేరు మార్పును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిశారు.
''పేరు మార్పు స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బ తీసింది'' అని బండి సంజయ్‌కు విన్నవించారు.
వారితో ఏకీభవించిన బండి సంజయ్ పేరు మార్పు అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
''ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామలు పేరు తొలగించారు. మరి ఆ మూలాలున్న ఎన్టీయార్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి పేరిట అనేకం ఉన్నాయి. వారి పేర్లను కూడా తొలగిస్తారా? మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రను వేరు చేయాలని ఉద్యమించారే తప్ప ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదే. అలాంటి మహనీయుడి పేరును తొలగించి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం దుర్మార్గం. సురవరం పట్ల మాకు అభ్యంతరం లేదు. ఆర్యవైశ్య సమాజమంతా ఆగ్రహంతో ఉంది. హిందూ సమాజమంతా ఆలోచించాలి.'' అన్నారు బండి సంజయ్.
'పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలి'
మరోవైపు అసలు సురవరం ప్రతాప రెడ్డి పేరు, పొట్టి శ్రీరాములు పేరు కాకుండా, పాల్కురికి సోమనాథుని పేరు ఈ విశ్వవిద్యాలయానికి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరికొందరు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన సోమనాథ కళాపీఠం అనే సంస్థ ఈ డిమాండ్ చేస్తోంది.
''తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి అయిన పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలి. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరే పెట్టాలని బలంగా కోరుతున్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును పాలమూరు విశ్వవిద్యాలయానికి పెట్టవచ్చు.'' అని సూచించింది సోమనాథ కళాపీఠం.
ఈ చర్చలు జరుగుతోన్న వేళ మార్చి 15వ తేదీన శాసన సభలో పేరు మార్పు బిల్లు ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
''పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టుకున్నాం. ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నాం'' అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
గతంలో బీఆర్ఎస్ హయాంలో పేర్లు మార్చిన యూనివర్సిటీల జాబితాను ఆయన సభలో ప్రస్తావించారు. పొట్టి శ్రీరాములు పేరు కోసం బలంగా వాదిస్తోన్న బీజేపీకి కొత్త సవాల్ కూడా చేశారాయన.
''కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కులాన్ని ఆపాదిస్తున్నారు. కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి.'' అని అన్నారు రేవంత్.
ఒకడుగు ముందుకేసి బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు మాజీ సీఎం రోశయ్య గారి పేరు పెట్టుకుందామన్నారు రేవంత్ రెడ్డి.
‘‘రోశయ్య గారి సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం'' అంటూ ప్రకటించారు రేవంత్.
సభలో చర్చ సందర్భంగా కేటీఆర్ కూడా ఈ పేరును సమర్థించారు.
‘‘సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద తెలుగు విశ్వ విద్యాలయం పెట్టాలని మేం అనుకున్నాం. 10 ఏళ్లపాటు విభజన జరగకపోవటంతో చేయలేకపోయాం. మీరు చేయండి. మేం మద్దతు ఇస్తాం. సురవరం ప్రతాప రెడ్డి గారి మీద గౌరవంతో 394 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక కూడా తెచ్చాం. మీకు సహకరిస్తాం.'' అంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ ప్రకటించారు.
అయితే పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పును బీజేపీ అసెంబ్లీలో కూడా వ్యతిరేకించింది. దీంతో పొట్టి శ్రీరాములు పేరుపై మొదలైన చర్చలో సీఎం రేవంత్ అకస్మాత్తుగా రోశయ్య పేరు తెచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కూడా అయిన రోశయ్య కోమటి కులానికి చెందిన వ్యక్తే. దీంతో ఈ వివాదం ఇప్పుడు ప్రాంతాలు దాటి, కులం చుట్టూ తిరుగుతోంది.
బీజేపీ అభ్యంతరాలు పక్కన పెట్టిన తెలంగాణ ప్రభుత్వం బిల్లుపై ముందుకు వెళ్లింది. మార్చి 17న బిల్లు ఆమోదం పొందింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














