ఇనుప యుగం తమిళనాడులో మొదలైందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంత ప్రాచీన చరిత్రకు ఆధారాలను వెలికితీసేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
అక్షరాస్యత కాలక్రమాలను తిరగరాసే ప్రాచీన లిపిలు, ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించిన సముద్ర వాణిజ్య మార్గాలు, అధునాత పట్టణ ఆవాసాలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి.
దీంతో, ప్రాచీన నాగరికత, ప్రపంచ వాణిజ్యంలో ఆ రాష్ట్ర పాత్రను ఇవి మరింత బలపరుస్తున్నాయి.
ప్రస్తుతం వారు మరింత పురాతన ఆనవాళ్లను గుర్తించారు. ఇనుము వినియోగం, ఇనుముతో వస్తువుల తయారీకి సంబంధించిన ఆధారాలను అక్కడ సేకరించారు.
క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం వరకు పెద్దఎత్తున ఇనుప లోహాన్ని వెలికితీసి, వినియోగించిన పురాతన ప్రాంతాల్లో తుర్కియే ఒకటి.
ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు తమిళనాడులోని ఆరు ప్రాంతాల్లో ప్రాచీన ఇనుప వస్తువులను గుర్తించారు.
అవి క్రీస్తు పూర్వం 2,953 – 3,345 ఏళ్ల క్రితం, లేదా 5,000 నుంచి 5,400 ఏళ్ల నాటివి అని కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి తేల్చారు.
పరికరాలను, ఆయుధాలను, ఇతర వస్తువులను భారత ఉపఖండంలో అభివృద్ధి చేసేందుకు ఇనుమును వెలికి తీసి.. కరిగించి, దానికో రూపం తీసుకొచ్చి ఉండొచ్చని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి.
'' వీటి ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునేందుకు మరింత కొంత సమయం పడుతుంది. ఈ ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దక్షిణాసియా పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ చక్రవర్తి చెప్పారు.


ఫొటో సోర్స్, Department of Archaeology/Tamil Nadu
ఆదిచ్చనల్లూరు, శివగళై, మయిలాడుంపారై, కిల్నమండి, మంగాడు, తెలుంగనూర్ ప్రాంతాల్లో దొరికిన వస్తువులు, తమిళనాడులో ఇనుప యుగం మొదలైందా? అనే అంశాన్ని స్థానిక వార్తల్లో ప్రధానాంశంగా నిలిపాయి.
అయితే, దీనిపై ఒక స్పష్టమైన ముగింపు ఇవ్వడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఎస్ఎస్ఈఆర్)కు చెందిన పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్ పార్థ్ ఆర్ చౌహాన్ అన్నారు.
పలు ప్రాంతాల్లో ఇనుప సాంకేతికత స్వతంత్రంగా ఉద్భవించి ఉండొచ్చని ఆయన నమ్ముతున్నారు.
మునపటి ఆనవాళ్లు కూడా అస్థిరంగా ఉన్నాయని, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో సరైన పరిశోధన లేదా పురావస్తు ఆధారాలను సేకరించలేదని తెలిపారు.
ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఇనుప ఉత్పత్తి అభివృద్ధిని ఇవి తెలియజేయనున్నాయని ఐఎస్ఎస్ఈఆర్ ఆర్కియాలజిస్ట్ ఒయిసీ రాయ్ అన్నారు.
ఇనుము గుర్తించిన తమిళనాడులోని చాలా ప్రాంతాలు పురాతన ఆవాసా ప్రాంతాలుగా ప్రస్తుత గ్రామాలకు దగ్గరగా ఉన్నాయి.
ఇప్పటి వరకు గుర్తించిన 3 వేలకు పైగా ఇనుప యుగ సమాధుల్లో రాతి శవపేటికలు, ఇనుప కళాఖండాల సంపదను కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కే రాజన్, ఆర్ శివానందం తెలిపారు.
వీటిలో ఇనుముతో తయారు చేసిన కత్తులు, గొడ్డళ్లు, ఉలి, బాణాలు, ఈటెలను గుర్తించారు.
ఒక ప్రాంతాల్లో వెలికి తీసిన సమాధుల్లో 85కి పైగా ఇనుప వస్తువులు గుర్తించారు. ఇవి సమాధుల లోపల, వెలుపల ఉన్నాయి.
20కి పైగా కీలకమైన శాంపుళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు ల్యాబ్‌లలో విస్తృతంగా తనిఖీ చేయించారు. ఆ తర్వాతనే వాటి ప్రాచీనతను ధ్రువీకరించారు.
సమాధి ప్రాంతం వద్ద నుంచి వెలికి తీసిన ఇనుప కత్తిని క్రీస్తు పూర్వం 13వ -15వ శతాబ్దానికి చెందిన అత్యంత అధునాతన కార్బన్ స్టీల్‌తో తయారు చేసినట్లు ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన చరిత్రకారుడు ఆస్మండ్ బోపెరాచ్చి చెప్పారు.

ఫొటో సోర్స్, Department of Archaeology/Tamil Nadu
''నిజమైన ఉక్కు ఉత్పత్తి క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో ప్రస్తుత తుర్కియే ప్రాంతాల్లో గుర్తించినట్లు మనకు తెలుసు. తమిళనాడు శాంపుళ్లు అంతకంటే పురాతనమైనవని రేడియోమెట్రిక్ డేట్స్ నిర్ధరిస్తున్నాయి.'' అని చెప్పారు.
తమిళనాడులోని ప్రాచీన ఉక్కు ఆనవాళ్లు ఇక్కడి ప్రజలు ఇనుప వినియోగదారులే కాదు, తయారీదారులని సూచిస్తున్నాయని రాయ్ అన్నారు. కాలక్రమేణా సమాజం సాంకేతికంగా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.
ఇనుప లోహాలను వెలికితీసిన మొదటి ప్రాంతం భారత్‌లో తమిళనాడు మాత్రమే కాదు. 8 రాష్ట్రాల్లోని సుమారు 27 ప్రాంతాల్లో ఇనుప వాడకాన్ని చేపట్టినట్లు అంతకుముందు కనుగొన్నారు. అవి 4,200 ఏళ్ల క్రితమని గుర్తించారు.
అయితే, తాజాగా తమిళనాడులో జరిపిన తవ్వకాల్లో కనుగొన్నవి భారత ఇనుప లోహానికి చెందిన ప్రాచీనతను మరో 400 సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్లినట్లు ఆర్కియాలజిస్ట్ రాజన్ చెప్పారు.
ఇనుప యుగం అనేది ఒక సాంకేతిక మార్పుగా ఉంది. పలు ప్రాంతాల్లో స్వతంత్రంగా ఇది అభివృద్ధి చెందిందని రాయ్ తెలిపారు.
తమిళనాడులో వెలికితీసినవి ఎంతో ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నాయని, ఇనుప యుగం, భారత ఉపఖండంలోని ఇనుక ఖనిజానికి చెందిన మన అవగాహనలను తిరిగి మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా తాజా డేటాలను సేకరించేందుకు అవసరమైన తవ్వకాల కొరత ఇంకా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమిళనాడు వెలుపల భారత పురావస్తు శాఖ ఏం పట్టించుకోనట్లే ఉందని ఒక నిపుణులు అన్నారు.
ఇది కేవలం ఒక ప్రారంభ పాయింట్ అని ప్రముఖ భారత పురావస్తు శాస్త్రవేత్త కాట్రగడ్డ పద్దయ్య చెప్పారు.
ఇనుప సాంకేతికత ప్రారంభాన్ని మరింత శోధించాల్సి ఉందని, ఇవి కేవలం ప్రారంభం మాత్రమేనని, ముగింపులు కాదని అన్నారు. వీటిని వాడుతూ నిజంగా ఇనుప ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైందో ఆ ప్రాంతాలను గుర్తించడం కీలకమని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














