ఇండియా మామిడి పండ్లను తిరస్కరించిన అమెరికా, వెనక్కు తేలేక అక్కడే పారబోసిన ఎగుమతిదారులు - అసలేం జరిగింది?

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మే 8న పంపిన మామిడి పండ్లను అమెరికా అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత వాటిని పారేయాల్సి వచ్చింది.
    • రచయిత, సందీప్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌ నుంచి ఎగుమతైన మామిడి పండ్లను తీరా అక్కడకు చేరాక వెనక్కి తీసుకెళ్లమంది అమెరికా. దీంతో మామిడి ఎగుమతిదారులు భారీ నష్టాలను చవిచూశారు.

‘ఈ మామిడి పండ్లను తీసుకెళ్లిపోండి లేదా పడేయండి’ అని తమకు అమెరికాలోని సంబంధిత అధికారులు తెలిపినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు.

అయితే, త్వరగా పాడైపోయే గుణం, రవాణా ఖర్చుల భారం కారణంగా, వాటిని తిరిగి తీసుకురావడం కన్నా, అక్కడే పారేయడం మేలని ఎగుమతిదారులు నిర్ణయించారు.

దీనిపై కొందరు ఎగుమతిదారులతో బీబీసీ మాట్లాడింది.

దీనివల్ల సుమారు 5 లక్షల డాలర్లు( సుమారు రూ. రూ. 4.2 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక ఎగుమతిదారు తెలిపారు.

అయితే, దీని తర్వాత కూడా మామిడి ఎగుమతులు కొనసాగుతాయని, నిరుడు కంటే మెరుగైన ఎగుమతులు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (వాఫా) తెలిపింది.

భారత్ మామిడి పండ్లను అమెరికా వద్దన్న తర్వాత కూడా రోజూ 10 నుంచి 12 వేల పెట్టెల మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయని వాఫాతో సంబంధం ఉన్న ఒక ఎగుమతిదారు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నష్టం

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

మే 8, 9 తేదీలలో ముంబయి నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో మామిడి పండ్లను ఎగుమతి చేశారు. అక్కడికి చేరుకున్న తర్వాత, అమెరికాలోని ఫుడ్ సేఫ్టీ వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికన్ అధికారులు ఆ సరకును తిరస్కరించారు.

15 నుంచి 17 టన్నుల సరకును తిరస్కరించినట్లు ఎగుమతిదారులు బీబీసీకి తెలిపారు.

దాన్ని తిరిగి ఇండియాకు పంపడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, అందుకే వాటిని పారబోశామని వారు తెలిపారు.

ఈ మామిడి పండ్లను అమెరికాలోని లాస్ ఏంజిలెస్, శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా విమానాశ్రయాలలో దించారు.

ముంబయి నుంచి మామిడి పండ్లను ఎగుమతి చేసే ముందు పండ్లకు పురుగు పట్టకుండా ఉండేందుకు, నిల్వ సామర్థ్యం మెరుగుపరిచేందుకు అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) అధికారి పర్యవేక్షణలో నవీ ముంబయిలోని ఒక కేంద్రంలో రేడియేషన్ ప్రక్రియ(ఇర్రేడియేషన్) నిర్వహిస్తారని ఒక ఎగుమతిదారుడు తెలిపారు.

దీని కోసం, ఎగుమతిదారులకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ తాజా వ్యవహారంలో మామిడి పండ్లు అమెరికా చేరాక ఈ పత్రాలు లేవంటూ సరకును తిరస్కరించినట్లు ఆయన చెప్పారు.

"ఈ షిప్‌మెంట్‌కు ఎలాంటి నష్టం వాటిల్లినా అమెరికా ప్రభుత్వం దానిని భరించదు" అని నోటీసులో పేర్కొన్నట్లు నష్టపోయిన ఎగుమతిదారులు తెలిపారు.

యూఎస్‌డీఏ అధికారి జారీ చేసిన సర్టిఫికేట్ తమ వద్ద ఉందని ఎగుమతిదారులు చెప్తున్నారు.

కానీ భారతదేశంలోని యూఎస్‌డీఏ అధికారులు మామిడి పండ్లను పరీక్ష చేసిన తీరుపై కొన్ని సందేహాలు ఉండడంతో ఆ సర్టిఫికేట్‌ను అమెరికాలో తిరస్కరించినట్లు అక్కడి అధికారులు చెప్పారు.

"ఇక్కడ రేడియేషన్ తనిఖీ పూర్తయింది. కానీ అమెరికన్ అధికారులు భారతదేశంలో ఉన్న యూఎస్‌డీఏ అధికారులు తనిఖీ చేసిన తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు" అని ఒక ఎగుమతిదారుడు బీబీసీతో చెప్పారు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారతీయ అధికారులు ఏం చెప్పారు?

అగ్రికల్చర్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) అధికారి పీబీ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, ఈ ఇర్రేడియేషన్ ప్రక్రియ ముంబయిలోని మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెంటింగ్ బోర్డ్ (ఎమ్ఎస్ఏఎమ్‌బీ), యూఎస్‌డీఏకు చెందిన యానిమల్స్, ప్లాంట్స్ హెల్త్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ (ఏపీహెచ్ఐఎస్) పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు.

మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేసే ముందు వాటి తనిఖీ సమయంలో యూఎస్‌డీఏ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వారే ఎగుమతిదారునికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. మామిడి సీజనంతా అంటే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

"సంబంధిత ఏజెన్సీలకు ఈ సమస్య గురించి ముందుగానే తెలియజేయకుండా, వారు (ఇన్‌స్పెక్టర్లు) అమెరికాలోని తమ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత సరకును వద్దన్నారు" అని ఎమ్ఎస్ఏఎమ్‌బీ ఒక ప్రకటన విడుదల చేసింది .

భారతదేశంలో రేడియేషన్ తనిఖీ సౌకర్యాలు వాషి (నవీ ముంబయి), నాసిక్, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ఉన్నాయి.

"ఈ మొత్తం ప్రక్రియలో ఏం జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఎమ్ఎస్ఏఎమ్‌బీ అధికారులు పరిశీలిస్తున్నారు" అని ఏపీఈడీఏ అధికారి చెప్పారు.

ఈ విషయంపై వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. వారి స్పందన అందిన తర్వాత కథనంలో అప్‌డేట్ చేస్తాం.

విమాన ఛార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

ఎగుమతిలో సమస్యలేంటి?

ఈ మామిడి పండ్లను తిరస్కరించడం వల్ల ‘తనకు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని’ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఎగుమతిదారు చెప్పారు.

"మామిడి పళ్లన్నింటినీ అక్కడే బయో-సెక్యూరిటీ వేస్ట్ ఫెసిలిటీ దగ్గర పారబోయాల్సివచ్చింది" అని ఆయన అన్నారు.

అయితే, "ఈ సంఘటన వాణిజ్య యుద్ధానికి సంబంధించింది కాదు. ఇది పాడైపోయే వాటితో సహా అన్ని ప్రోడక్ట్‌లకు వర్తించే ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం" అని ఆయన చెప్పారు.

"ఎగుమతిదారులకు వివిధ స్థాయిలలో సహాయం చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైంది" అని ఎగుమతిదారులంటున్నారు.

"మామిడి వంటి త్వరగా పాడైపోయే ఉత్పత్తుల వల్ల ఎగుమతిదారులు నష్టపోతున్నారు. వాటి రక్షణకు ఎటువంటి చర్యలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2016 నుంచి 2020 మధ్య ఎగుమతిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా క్రమంగా ఆపేశారు" అని ఆయన అన్నారు.

"రైతులకు పంట బీమా సౌకర్యం ఉన్నట్లుగా, ఎగుమతిదారులకు ఎలాంటి సౌకర్యం లేదు. లాజిస్టిక్స్ సౌకర్యం కూడా తక్కువే" అని ఆయన అన్నారు.

ఎగుమతిదారులకు విమాన చార్జీలలో రాయితీలు ఉండవని, విమానయాన సంస్థలు సీజన్‌లో చార్జీలను పెంచుతాయని, సకాలంలో షిప్‌మెంట్ రాకపోయినా పూర్తి చార్జీలను వసూలు చేస్తాయని ఆ ఎగుమతిదారు బీబీసీతో అన్నారు.

"సాధారణంగా దేశంలోని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ విధిస్తారు. ఇతర దేశాలకు పంపే మామిడి పండ్లపై కూడా జీఎస్‌టీ విధిస్తున్నారు. దీని కారణంగా, ఎగుమతిదారుల డబ్బు చాలా వరకు జీఎస్‌టీ రూపంలో పోతోంది" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)