‘మత్స్యకారులెవరూ ఆ నౌక సమీపంలోకి వెళ్లొద్దు, ఒడ్డుకు కొట్టుకొచ్చే కంటైనర్లు, చమురును తాకొద్దు’ - భారత్ తీరానికి సమీపంలో మునిగిపోయిన ఓడ

కొచ్చి తీరానికి సమీపంలో మునిగిపోతున్న నౌక

ఫొటో సోర్స్, Indian Coast Guard

    • రచయిత, చెరిలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చమురుతోపాటు ప్రమాదకర రసాయనాలతో వెళ్తున్న నౌక ఒకటి కేరళ తీరానికి సమీపంలో, అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కేరళలోని కొచ్చి నగరానికి సమీపంలో మునిగిపోయిన లైబీరియన్ జెండా ఉన్న ఆ ఓడ నుంచి చమురు లీకవుతోంది.

కొచ్చి తీరప్రాంతం జీవ వైవిధ్యానికి నెలవు కావడంతో పాటు ప్రముఖ పర్యటక కేంద్రం కూడా.

నౌకలోని 24 మంది సిబ్బందిని రక్షించారు, కానీ ఓడలోని 640 కంటైనర్లలో కొన్ని తీరం వైపు కొట్టుకొస్తున్నాయని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సి రావొచ్చని చెప్తున్నారు.

ఓడ నుంచి లీకవుతున్న ఇంధనం, అందులో రవాణా చేస్తున్న చమురు, ప్రమాదకర రసాయనాలు స్థానికులకు, సముద్ర జీవరాశికి హాని కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

''కేరళ తీరం వెంబడి చాలాదూరం ఆ చమురు తెట్టు (పొర) ఏర్పడే అవకాశం ఉన్నందున తీరప్రాంతమంతటా హెచ్చరికలు జారీ అయ్యాయి'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సముద్ర తీరప్రాంత వాసులు ఒడ్డుకు కొట్టుకొచ్చే ఎలాంటి కంటైనర్లను కానీ, ఆ చమురుని కానీ తాకొద్దని, మత్స్యకారులెవరూ ఆ మునిగిపోయిన ఓడ సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, అరేబియా సముద్రం, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ

ఫొటో సోర్స్, Indian Coast Guard/Twitter

అధికారులు సోమవారం మాట్లాడుతూ.. ఓడ నుంచి లీకేజీని అరికట్టేందుకు కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు.

కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలతో ఒక ఓడను ఇండియన్ కోస్ట్ గార్డ్ సంఘటనా స్థలానికి పంపింది.

చమురు ఎంతమేర వ్యాపించగలదో అంచనా వేసే 'ఆయిల్ స్పిల్ డిటెక్షన్ సిస్టమ్' ఉన్న ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా ఆ ప్రాంతాన్ని సర్వే చేసేందుకు మోహరించింది.

విజింజం పోర్టు నుంచి కొచ్చికి బయలుదేరిన MSC ELSA 3 నౌక.. కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలోకి వచ్చేసరికి కొద్దికొద్దిగా మునిగిపోవడం మొదలైంది.

ఒక కంపార్ట్‌మెంట్‌లోకి నీరు చేరడంతో ఆదివారం తెల్లవారుజామున ఆ ఓడ అరేబియా సముద్రంలో మునిగిపోయింది.

ఆ ఓడలోని 13 కంటైనర్లలో ప్రమాదకర వస్తువులు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉన్నాయని ఇండియన్ కోస్ట్‌ గార్డ్ తెలిపింది.

కాల్షియం కార్బైడ్‌‌‌కు సముద్రపు ఉప్పునీటితో రసాయన చర్య జరిపి మండే గ్యాస్‌ను విడుదల చేసే లక్షణం ఉంటుంది.

''వాటితో పాటు ఆ నౌకలోని ట్యాంకుల్లో 84.44 టన్నుల డీజిల్, 367.1 టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నాయి'' అని కోస్ట్ గార్డ్ పేర్కొంది.

కాగా కొద్దిగంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో, ఆ నౌకలోని సిబ్బందిని ఇండియన్ నేవీ సిబ్బంది రక్షించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)