‘గుర్రంతో సెక్స్ చేయడం’పై కేసు, అసలేం జరిగింది?

గుర్రం, జంతుసంరక్షణ, వన్యప్రాణులు, జంతువులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

నాగ్‌పుర్ నగరంలోని ఒక గుర్రపు స్వారీ అకాడమీలోని గుర్రంతో సెక్స్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిపై, నాగ్‌పుర్‌లోని గిట్టీఖదాన్ పోలీస్ స్టేషన్‌లో మే 18న కేసు నమోదైంది.

ఆడ గుర్రంతో 30 ఏళ్ల వ్యక్తి సెక్స్ చేసినట్లు ఫిర్యాదు అందిందని, నిందితుడి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

నాగ్‌పుర్‌కు చెందిన ప్రమోద్ సంపత్ లాడ్వే(31) ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నగరంలోని టీవీ టవర్ బాలాజీ ఆలయం సమీపంలో ఆయన గుర్రపు స్వారీ అకాడమీ నిర్వహిస్తున్నారు.

ఈ అకాడమీలో మొత్తం 17 గుర్రాలు ఉండగా, వాటిలో 9 మగ గుర్రాలు, 8 ఆడ గుర్రాలు.

తన అకాడమీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రుస్తుం మే 17 రాత్రి 11.30 గంటలకు తనకు ఫోన్ చేసినట్లు సంపత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. అకాడమీ నిర్వాహకుడు సంపత్‌కు అక్కడి సెక్యూరిటీ గార్డ్ రుస్తుం ఫోన్ చేసి 30 ఏళ్ల ఓ వ్యక్తి అకాడమీలో చోరీ చేసి పరారైనట్లు చెప్పారు.

దీంతో సంపత్.. అకాడమీలో ఏమేం చోరీ అయ్యాయో తెలుసుకోవడానికి మరుసటి రోజు, మే 18న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

అకాడమీలో రూ.2 వేల విలువైన నాలుగు ఇనుప వస్తువులను చోరీ చేసి పారిపోయినట్లు సంపత్ గుర్తించారు.

జంతువులు, జంతు సంరక్షణ, వన్యప్రాణులు

ఫొటో సోర్స్, Getty Images

ఆడగుర్రంపై లైంగిక దాడి

అయితే, ఆ నిందితుడిపై దొంగతనంతో పాటు మరో తీవ్రమైన ఆరోపణ చేశారు ఫిర్యాదుదారు సంపత్ లాడ్వే.

‘అకాడమీలోని ఐరా అనే గుర్రంతో నిందితుడు బలవంతంగా సెక్స్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది’ అని సంపత్ ఫిర్యాదు చేశారు.

సంపత్ ఫిర్యాదు మేరకు.. నిందితుడు గుర్రాన్ని శారీరకంగా హింసించినట్లు, దానిపై క్రూరంగా ప్రవర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

బీఎన్ఎస్ సెక్షన్ 303(2), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960లోని 11(1)A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయమై ఫిర్యాదుదారు సంపత్ లాడ్వేని బీబీసీ సంప్రదించింది.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''మానౌతా నగర్‌కు చెందిన ఆ నిందితుడు గుర్రంతో సెక్స్ చేసినట్లు సీసీటీవీలో కనిపిస్తోంది'' అన్నారు.

''అతను ఇక్కడ పనిచేసే వ్యక్తి కాదు, కానీ ఇక్కడ పనిచేసేవాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. దీని కారణంగా, అనవసరంగా మా అకాడమీ పరువు తీస్తున్నారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే, ఆయన్ను ఇంకా అరెస్టు చేయలేదు'' అన్నారు.

పోలీసులు ఏం చెప్పారు?

గుర్రంపై లైంగిక దాడి కేసుకి సంబంధించి గిట్టీఖదాన్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి చేతన్ బోర్ఖెడేతో బీబీసీ మాట్లాడింది.

'' ఈ కేసులో నిందితుడిపై 11A కింద కేసు నమోదు చేశాం. మే 18న కేసు నమోదైంది. అయితే, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు'' అని చేతన్ చెప్పారు.

''నిందితుడి కోసం గాలిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

గతంలో, 2022 ప్రారంభంలో పెంపుడు కుక్కపై లైంగిక దాడి ఘటనలో పుణెలో ఓ కేసు నమోదైంది.

జంతువులు, జంతు సంరక్షణ, వన్యప్రాణులు

ఫొటో సోర్స్, Getty Images

జంతు సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి?

దేశంలో మొదట్లో, వన్యప్రాణులు, జంతుసంరక్షణ చట్టం 1912 కింద చర్యలు తీసుకునేవారు. పెంపుడు జంతువులు, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960లో వచ్చింది. ఆ తర్వాత 1972లో ఇండియన్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం) తీసుకొచ్చారు.

అయితే, జంతువులపై క్రూరత్వానికి సంబంధించి చట్టంలో కఠిన నిబంధనలు లేవని జంతువుల హక్కుల యాక్టివిస్టులు అంటున్నారు.

జంతువులను వేటాడడం, వాటిపై క్రూరంగా వ్యవహరించడంపై అధ్యయనంతో పాటు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న న్యాయవాది బసవరాజ్ హొసగౌడర్ మాట్లాడుతూ, ''మానవులపై క్రూరత్వానికి వెంటనే స్పందిస్తారు. కానీ, జంతువులపై హింస విషయంలో పోలీసులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు, అదే పెద్ద సమస్య. ముందు, ఆ హింసను గుర్తించేలా చేయడానికి పోరాడాల్సి ఉంటుంది'' అని అన్నారు.

జంతువులు, జంతు సంరక్షణ, వన్యప్రాణులు

ఫొటో సోర్స్, Getty Images

పెంపుడు జంతువులకు సంబంధించిన చట్టాల్లో నామమాత్రపు శిక్షలు, కొద్దిమాత్రం జరిమానాలు ఉన్నాయి. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 ప్రకారం, పెంపుడు జంతువులను చంపినా, లేదా హింసించినా 3 నెలల జైలు శిక్ష, రూ.50 మాత్రమే జరిమానా విధించే అవకాశముంది.

వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం.. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల జైలు, రూ.25 వేల వరకూ జరిమానా విధించే అవకాశముంది. కొన్నేళ్లుగా ఇందులో ఎలాంటి మార్పూ లేదు.

న్యాయవాది బసవరాజ్ మాట్లాడుతూ, ''శిక్ష, జరిమానాలను పెంచడంతో పాటు కొన్నేళ్లుగా జరుగుతున్న జంతుహింస ఘటనల దృష్ట్యా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు.

''వీటి కోసం దేశవ్యాప్తంగా ఎన్జీవోలు కృషి చేస్తున్నాయి. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతోంది.''

వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 14 ఏళ్లకు పెంచడంతో పాటు జరిమానాను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హొసగౌడర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)