అమెరికా-చైనా ట్రేడ్ వార్: ముందుగా చర్చలు మొదలుపెట్టేది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గవిన్ బట్లర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాతో టారిఫ్‌పై చర్చలు జరిపే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
చైనా అమెరికాకు జరిపే ఎగుమతులపై అత్యధికంగా 245 శాతం వరకు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల పోరు , ఆర్థికమాంద్యానికి దారితీస్తుందనే భయంతో ఉన్న ప్రపంచానికి ఇది ఆసక్తికరమైన వార్తే.
''సుంకాల విషయంలో చైనాతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధికారులు పదేపదే తమ ఆసక్తిని వ్యక్తపరుస్తున్నారు.'' అని రిపోర్టర్లతో చైనా అధికార ప్రతినిధి చెప్పారు.
'' చైనా స్థిరమైన స్థానంలో ఉంది. మేం పోరాటం చేస్తే చివరి వరకు దానిని కొనసాగిస్తాం. ఒకవేళ చర్చించాలనుకుంటే, తలుపులు తెరిచే ఉంటాయి. అమెరికా సుంకాలపై మాట్లాడాలనుకుంటే.. చిత్తశుద్ధితో వ్యవహరించాలి. తప్పుడు విధానాలను సరిదిద్దుకోవడానికి సిద్ధమవ్వాలి. ఏకపక్ష సుంకాలను రద్దు చేయాలి.'' అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

చర్చలు ప్రారంభించాలని అమెరికా కోరుతోందని చైనా ప్రభుత్వ మీడియాతో అనుసంధానమున్న వీబో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ పేర్కొన్న ఒక్కరోజు తర్వాత, అలాగే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్న వారం రోజుల తరువాత ఈ ప్రకటన వచ్చింది. అయితే ట్రంప్ ప్రకటనను బీజింగ్ తోసిపుచ్చింది.
'' చైనా అమెరికాతో మాట్లాడాల్సిన అవసరం లేదు.'' అని చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ)తో అనుసంధానమైన వీబో సామాజిక మాధ్యమంలోని యుయహంటాన్ ఖాతాలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. చర్చల విషయంలో ప్రస్తుతం అమెరికా చాలా ఆతృతగా ఉందన్నారు. మరోవైపు చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బీజింగ్ కొట్టివేసింది.
చర్చలు ప్రారంభించే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకునేందుకు అమెరికా, చైనా తిరస్కరిస్తున్నప్పుడు ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
అయితే, ఈ చర్చలు జరుగుతాయా,లేదా అనేది కాకుండా.. ఎప్పుడు, ఏ పరిస్థితుల మధ్యలో, ఎవరి ప్రోద్బలంతో జరుగుతాయన్నదే ప్రస్తుత ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
కోడిపందేలాట
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ మధ్యలో కోడిపందేలాట నడుస్తోందని నిపుణులు అంటున్నారు. వాణిజ్య యుద్ధాన్ని తగ్గించే నెపంతో ఈ ఇద్దరు పరస్పర ప్రయోజనాల కోసం తాపత్రయపడుతూ తమని తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
''ఒకదాని తర్వాత మరొకటి మనం వింటున్నాం. ఎందుకంటే, ఓటమిని ఒప్పుకోవడానికి అటు వాషింగ్టన్ కానీ, ఇటు బీజింగ్ కానీ సిద్ధంగా లేవు.'' అని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జా ఇయాన్ చాంగ్ చెప్పారు. కానీ, వాణిజ్య యుద్ధం సద్దుమణిగితే ఇరు దేశాల వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
'' రెండు రేసు కార్లలా ఇద్దరూ ప్రయాణిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరైతే ముందుగా పక్కకు తప్పుకుంటారో వారు బలహీనంగా కనిపిస్తారు. అందుకే ఎవరూ కూడా మెత్తగా కనిపించాలనుకోవడం లేదు.'' అని ఆస్ట్రేలియన్ సెంటర్ ఆన్ చైనా ఇన్ ది వరల్డ్‌లో విద్యావేత్త వెన్-టి సాంగ్ అన్నారు.
మొదటగా టారిఫ్ చర్చలను ప్రారంభించేది తామేనని ఒప్పుకునే నాయకుడు తమ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లే.
''రెండు వర్గాల వారికి ఒకేరకమైన ఫలితం కావాలి. కానీ, దీన్ని ప్రారంభించాలని ఇద్దరూ కోరుకోవడం లేదు. ఈ విచిత్రమైన ప్రతిష్ఠంభన నిర్మాణాత్మక అస్పష్టతకు దారితీస్తోంది.'' అని సాంగ్ అంటున్నారు.
ప్రతి ఒక్కరూ కూడా తామే సరైన వాళ్లమనే వాదనను ప్రతిబింబించేలా చేసే వ్యాఖ్యలు అస్పష్టంగా ఉంటున్నాయి.
ఈ యుయహంటాన్ వీబో పోస్టు వివరణ కూడా ఇలాంటి వ్యాఖ్యలే అని సాంగ్ ఎత్తిచూపారు.
ట్రంప్, జిన్‌పింగ్ విషయంలో.. ఈ వాణిజ్య యుద్ధంలో ఎంతోకొంత విజయం సాధించామని ఇరువురు నేతలు చెప్పుకోవడం ద్వారా టారిఫ్ చర్చలు ప్రారంభం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట గెలవాలి
ప్రజాభిప్రాయం, పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
చాంగ్ చెప్పినట్లు వాణిజ్య యుద్ధ భయాలను తగ్గించడం ఒక అంశమైతే, ట్రంప్‌కు, జిన్‌పింగ్‌కు మరో ముఖ్యమైన విషయం దేశ ప్రజల కోసం వారు గెలవాల్సి ఉంటుంది.
''బీజింగ్‌ను తమ షరతులకు లొంగిపోయేలా చేశామని ట్రంప్ చూపించాలనుకుంటున్నారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రజల వైపు చూస్తే, ట్రంప్‌ను మరింత సహేతుకంగా, మితంగా, సర్దుబాటు చేయగలిగే నేతగా మార్చగలిగామని ప్రపంచానికి, తమ సొంత ప్రజలకు జిన్‌పింగ్ చూపించాలనుకుంటున్నారు.'' అని చాంగ్ అన్నారు.
నిజానికి దేశీయంగా ఈ ఇద్దరు నేతలు సుంకాల విషయంలో తీవ్ర భయాలను ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2022 నుంచి తొలిసారి మొదటి మూడు నెలల కాలంలో క్షీణించినట్లు తాజాగా డేటా విడుదలైంది. దీనివల్ల నెలకొన్న మాంద్యం భయాలను తగ్గించేందుకు ట్రంప్ ఈ వారం చాలా ప్రయత్నించారు.
సుంకాలకు ముందు నుంచే వినియోగ మందగమనాన్ని ఎదుర్కొంటోన్న జిన్‌పింగ్, రియల్ ఎస్టేట్ సంక్షోభం,నిరుద్యోగంతో పోరాడుతున్నారు. మహమ్మారి తర్వాత గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్న తమ ఆర్థిక వ్యవస్థను కాపాడతామని, వాణిజ్య యుద్ధాన్ని తట్టుకోగలమని చైనా ప్రజలకు జిన్‌పింగ్ భరోసా ఇస్తున్నారు.
'' ఈ వాణిజ్య యుద్ధం ఇరువైపుల వారికి ఎలాంటి గెలుపును ఇవ్వదని ట్రంప్, జిన్‌పింగ్ ఇద్దరూ గుర్తించారు.'' అని సాంగ్ అన్నారు.
''తాను కావాల్సిన దానిలో ఎట్టిపరిస్థితుల్లో 100 శాతం పొందలేనని ట్రంప్ గుర్తించారు. ముఖ్యంగా దేశీయ ప్రయోజనాల కోసం చైనా తనకు తగినంత గెలుపును ఇచ్చే అవకాశం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.'' అన్నారు.
అయితే, చైనా సుముఖంగా లేకపోయినా.. సరైన టారిఫ్ ఏమిటనే విషయంలో ఇరుక్కుపోయిందని చెప్పారు. జిన్‌పింగ్‌కు ఇది రెండు విషయాల్లో ఒక పద్మవ్యూహం లాంటిదని అన్నారు.
''అమెరికా-చైనా దౌత్య సంబంధాలను నిర్వహించాల్సినవసరం చైనాపై ఉంది. అలాగే, దేశీయంగా బీజింగ్ తన ప్రాబల్యాన్ని కాపాడుకోవాలి. అప్పుడైతేనే తూర్పు వెలుగుతోంది, పశ్చిమం క్షీణిస్తోందనే వాదనను చైనా నాయకత్వం బలంగా నిలపగలదు.'' అని సాంగ్ వివరించారు.
ఈ వార్త రాసే సమయంలో చర్చలకు ప్రయత్నాలు జరుపుతున్నారనే విషయంపై చైనా చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించలేదు. కానీ, ఇరువైపుల వారు ఈ ప్రకటనలు చేయడం కొంత ఒప్పందం జరిగిందని సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














