ట్రంప్ మినహాయింపులు: ‘స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లకు టారిఫ్‌లు వర్తించవు’

ట్రంప్, సుంకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై పరస్పర సుంకాలను ట్రంప్ తొలగించారు.
    • రచయిత, మేడలీన్ హాల్పెర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను రెసిప్రోకల్ టారిఫ్‌ల నుంచి మినహాయించారు. చైనా నుంచి వచ్చే ఈ వస్తువులపైనా 125% పన్ను ఉండదు.

ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌ల నుంచి ఈ వస్తువులకు మినహాయింపు లభిస్తుందని అమెరికా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

చైనాపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు సంబంధించి కాస్త ఊరట లభించడం ఇదే తొలిసారి. ఇది గొప్ప మార్పుగా వాణిజ్య రంగ నిపుణులు ఒకరు వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టెక్ కంపెనీలకు ఊరట

ఈ మినహాయింపుల గురించి వారం ప్రారంభంలో మరిన్ని వివరాలు చెబుతానని శనివారం(ఏప్రిల్ 12) రాత్రి మయామి వెళ్తూ ట్రంప్ చెప్పారు.

''మేం చాలా స్పష్టతతో ఉంటాం'' అని ట్రంప్ విలేకరులతో అన్నారు.

చైనాలో తయారయ్యే గాడ్జెట్ల ధరలు భారీగా పెరిగిపోతాయని అమెరికా టెక్ కంపెనీలు ఆందోళన చెందిన తర్వాత ట్రంప్ ఈ మినహాయింపు నిర్ణయం ప్రకటించారు.

మినహాయింపుల్లో సెమీకండక్టర్లు, సోలార్ సెల్స్, మెమరీ కార్డుల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి భాగాలు కూడా ఉన్నాయి.

"టెక్ పెట్టుబడిదారులకు ఇది కలలాంటిది" అని వెడ్‌బుష్ సెక్యూరిటీస్‌లో టెక్నాలజీ రీసెర్చ్ హెడ్ డాన్ ఇవ్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

" చైనాపై సుంకాల విషయంలో స్మార్ట్‌ఫోన్‌లు, చిప్స్‌ను మినహాయించడం గొప్ప మార్పు'' అని తెలిపారు.

యాపిల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు, మొత్తం టెక్ ఇండస్ట్రీ ఈ వారాంతంలో ఊపిరి పీల్చుకోవచ్చని ఆయన అన్నారు.

ట్రంప్, సుంకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టారిఫ్‌ల అమలుకు ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించారు.

ఉత్పత్తుల కేంద్రాలను అమెరికాకు మార్చేలా...

కంపెనీలు తమ ఉత్పత్తిని అమెరికాకు మార్చడానికి ఎక్కువ గడువు ఉండేలా ఈ మినహాయింపులు ఇచ్చామని వైట్ హౌస్ తెలిపింది.

"సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్స్, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివి తయారుచేసేందుకు చైనాపై అమెరికా ఆధారపడకూడదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటనలో చెప్పారు.

ఫ్లోరిడాలోని తన ఇంట్లో వారాంతం గడుపుతున్న ట్రంప్, శుక్రవారం(ఏప్రిల్ 11) చైనాపై అధిక సుంకాలు తనకు బాగానే ఉన్నాయని చెప్పారు.

ట్రంప్, సుంకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐఫోన్‌లకు అమెరికా పెద్ద మార్కెట్.

అమెరికాలో అమ్ముడయ్యే ఐ ఫోన్లలో 80 శాతం చైనాలో తయారైనవే..

తొలుత పెంచిన సుంకాలు అమలైతే ఐఫోన్ ధరలు అమెరికాలో మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.

ఐఫోన్‌లకు అమెరికా పెద్ద మార్కెట్. గత ఏడాది యాపిల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో సగం కంటే ఎక్కువ వాటా అమెరికాలోనే ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ చెబుతోంది.

అమెరికాలో అమ్ముడుపోయే యాపిల్ ఐఫోన్లలో దాదాపు 80శాతం చైనాలో తయారయ్యేవే. మిగిలిన 20శాతం భారత్‌లో తయారవుతాయి.

శామ్‌సంగ్ వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల్లాగే యాపిల్ కూడా ఇప్పుడు చైనాపై ఎక్కువ ఆధారపడకుండా సప్లయ్ చైన్స్‌ విస్తరించడానికి ప్రయత్నిస్తోంది.

యాపిల్ అదనపు తయారీ హబ్స్‌ కోసం భారత్, వియత్నాం ముందువరుసలో ఉన్నాయి.

సుంకాలు అమలులోకి వచ్చే సమయానికి యాపిల్ భారత్‌లో తన ఉత్పత్తిని వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ట్రంప్, సుంకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మినహాయింపుల్లో సెమీకండక్టర్లు, మెమరీ కార్డుల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

ఇతర దేశాలతో మెరుగైన వాణిజ్యం కోసం...

ట్రంప్ భారీ సుంకాలను ఈ వారం నుంచి అమలు చేయాలని భావించారు.

అయితే ఎక్కువ సుంకాలు విధించిన దేశాల్లో చైనా మినహా మిగిలిన వాటిపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల పాటు విరామం ఇస్తామని తర్వాత ట్రంప్ ప్రకటించారు – చైనాపై సుంకాలను 145శాతానికి పెంచారు.

అమెరికా వస్తువులపై చైనా విధిస్తున్న 84శాతం సుంకాలకు బదులు తీర్చుకోడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ చెప్పారు.

కానీ తర్వాత ట్రంప్ విధానంలో మార్పు వచ్చింది. అమెరికా సుంకాలపై ప్రతీకారం తీసుకోని దేశాలన్నీ జులై వరకు 10శాతం సాధారణ సుంకంతో ఉపశమనం పొందుతాయని ట్రంప్ ప్రకటించారు.

ఇతర దేశాలు మెరుగైన వాణిజ్య నిబంధనలను విధించేందుకు ఈ చర్య ఒక వ్యూహమని వైట్‌హౌస్ చెప్పింది.

అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో అన్యాయాన్ని సరిచేయడానికి, అమెరికాకు ఉద్యోగాలు, ఫ్యాక్టరీలను తిరిగి తీసుకొచ్చేందుకు తన సుంకాలు ఉపయోగపడతాయని ట్రంప్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)