డంకరామి: ఈ బందిపోటును, 100 మంది అనుచరులను కాల్చిచంపిన సైన్యం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, థామస్ నాడి
- హోదా, బీబీసీ న్యూస్
వెస్ట్ నైజీరియాలో జరిగిన ఉమ్మడి సైనిక ఆపరేషన్‌లో... పేరుమోసిన బందిపోటు గ్వాస్కా డంకరామి తోపాటు ఆయన అనుచరులుగా భావిస్తున్న 100 మంది మరణించారని నైజీరియా అధికారులు తెలిపారు.
తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో సెకండ్-ఇన్-కమాండ్‌గా పనిచేసిన గ్వాస్కా డంకరామి లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగిందని అధికారులు తెలిపారు.
డంకరామి ఒక అడవిలో దాక్కున్నట్లు తెలిసిన తర్వాత ఆయనపై ఆపరేషన్ జరిగింది. శుక్రవారంనాడు దేశవ్యాప్తంగా అనేకమంది ఇతర నేరగాళ్లకు చెందిన రహస్య స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో ఉత్తర కాట్సినా రాష్ట్రంలోని మైగోరా అనే గ్రామంపై జరిగిన దాడిలో డంకరామికి గ్రూపుకు చెందిన బందిపోట్లు 43 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసి, మరో నలుగురిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్‌లో బందిపోటు నాయకుడిని చంపేసింది సైన్యం.

2022లోనే డంకరామి చనిపోయినట్లు వార్తలు...
కిడ్నాపర్లను పట్టుకోవడానికి భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, డంకరామి చనిపోయినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు.
2022లో, నైజీరియా వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్‌లో ఆయన్ను చంపినట్లు వార్తలు వచ్చాయి.
బందిపోట్లను ఏరివేయడమే లక్ష్యంగా సాగుతున్న పోరాటంలో ఈ హత్య కీలకమైందని కట్సినా రాష్ట్ర అంతర్గత భద్రత, హోం వ్యవహారాల కమిషనర్ నాసిర్ మువాజు అన్నారు.
"ఈ విజయవంతమైన మిషన్ కారణంగా ఈ ప్రాంతంలో చాలా కాలంగా కమ్యూనిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న క్రిమినల్ నెట్‌వర్క్‌లను దెబ్బతీసినట్లయింది’’ అని మువాజు అన్నారు.
రెండు మెషిన్ గన్‌లను, స్థానికంగా తయారు చేసిన షాట్‌గన్‌లను కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు భద్రతా దళాలు తెలిపాయి.
గురువారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో, భద్రతా దళాలు తమ కమాండర్‌తో సహా ఆరుగురు బందిపోట్లను హతమార్చగా, అనేక మంది బందిపోట్లు బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నారు.
నిఘా వర్గాల నేతృత్వంలో జరిగిన ఆపరేషన్‌లో ఏడు మోటార్‌సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నైజీరియా మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ స్వస్థలమైన కాట్సినాలో, బందిపోట్లు, కిడ్నాపర్ల దాడులలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
నేరస్థులను పట్టుకోవడానికి, స్థానికులను రక్షించడానికి ప్రతి అడవిని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం సంకల్పించినట్లు రాష్ట్ర గవర్నర్ మాలం డిక్కో ఉమారు రడ్డా చెప్పారు.
వాయువ్య నైజీరియాలో పదే పదే బందిపోట్ల దాడులు జరుగుతున్నాయి.
దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో భాగంగా ఈ ఆపరేషన్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














