భార్య నగలమ్మి 'కదిలే మంచం కారు' తయారు చేసి చిక్కుల్లోకి...

బెడ్ కార్

ఫొటో సోర్స్, Rakibul Islam

ఫొటో క్యాప్షన్, నవాబ్ షేక్ బెడ్ కారును తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసులు.
    • రచయిత, అమితాబ్ భట్టాసాలి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఒక వ్యక్తి మంచం మీద కూర్చుని కనిపించారు. అందులో ఫన్నీ విషయం ఏంటంటే, ఆ మంచం రోడ్డు మీద వెళుతోంది.

నిజానికి, అది ఒక మొబైల్ బెడ్ లేదా బెడ్-కార్ అని కూడా అనొచ్చు.

సాధారణంగా ఇళ్లలో మంచాలపై ఉన్నట్లుగానే దానిపై పరుపు, దుప్పట్లు, దిండ్లు పెట్టారు.

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నివాసి నవాబ్ షేక్ సుమారు ఏడాదిన్నరపాటు కష్టపడి ఈ మొబైల్ బెడ్‌ను తయారు చేశారు.

తాను తయారు చేసిన ఈ ప్రత్యేకమైన కారును రంజాన్ (ఈద్) రోజున రోడ్డు మీదకు తీసుకెళ్లి పరీక్షించారు.

ఆయన బెడ్-కార్‌పై ప్రయాణించడాన్ని కొంతమంది వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కానీ, ఈ కారు నడపడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు దాన్ని పట్టుకెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నవాబ్ షేక్

ఫొటో సోర్స్, Rakibul Islam

ఫొటో క్యాప్షన్, బెడ్ కార్ తయారు చేసిన నవాబ్ షేక్

'కలను నెరవేర్చుకోవడానికి బెడ్ కారు నిర్మించా'

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఎలాంటి ఐడియాలను బయటకు తీస్తున్నారో చెప్పడానికి నవాబ్ షేక్ తయారు చేసిన పల్లంగ్-కారు (బెడ్ కార్) ఒక ఉదాహరణ.

వైరల్ కావాలని మాత్రమే కాదు, ఈ మంచం మీద కూర్చొని టీ తాగే విలాసాన్ని అనుభవించాలని ఆయన కోరుకున్నారట.

"ఒకరోజు నేను ఈ మంచంమీద నుంచి లేవకుండా, దీనిపైనే పడుకుని టీ తాగగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో అని కల కన్నాను. ఈ కలను నిజం చేసుకోవడానికి, నా మంచానికి కారు ఆకారాన్ని ఇచ్చే పని మొదలుపెట్టా." అని నవాబ్ చెప్పారు.

‘‘ మొదట మంచానికి నాలుగు చక్రాలను బిగించా. అయితే నెట్టినప్పుడు మాత్రమే అది ముందుకు కదులుతుంది. ఆ తర్వాత, దానికి ఇంజిన్‌ను అమర్చి మొబైల్ బెడ్‌ తయారు చేశా. దానిని ఒకసారి పరీక్షిద్దామని ఈద్ రోజున రోడ్డుపైకి తీసుకెళ్లాను. నా స్నేహితులు కొందరు వీడియో తీశారు. నేను ఆ వీడియోలను నా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాను." అని ఆయన చెప్పారు.

బెడ్ కారు

ఫొటో సోర్స్, Rakibul Islam

ఫొటో క్యాప్షన్, రోడ్డు మీద వెళుతున్న ఈ బెడ్ కారును చూడటానికి జనం గుమిగూడారు.

మొబైల్ బెడ్ ఎలా తయారు చేశారు?

నవాబ్ షేక్ సోదరుడు ఆలంగీర్ షేక్ కూడా బెడ్ కారు తయారీలో ఆయనకి సహాయం చేశారు.

స్థానిక కార్ల మెకానిక్ షాప్ నుంచి, దాదాపు ఏడాదిన్నర కాలంలో ఇంజిన్, స్టీరింగ్, ఆయిల్ ట్యాంక్, కారు ఛాసిస్ (వాహనం చుట్టూ నిర్మించిన ఫ్రేమ్)ను కొనుగోలు చేశారు ఆలంగీర్. దీనికోసం ఆయన రూ.2.15 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

"నవాబ్ ఇంతకు ముందు నుంచీ యూట్యూబ్ కోసం కంటెంట్ క్రియేట్ చేసేవారు. మొబైల్ బెడ్ తయారు చేయాలనేది ఆయన ఆలోచన. బెడ్‌ను అప్పటికే చెక్కతో తయారు చేశాం. కాబట్టి దానిలో 800 సీసీ ఇంజిన్‌ను అమర్చాం. దీనికి మారుతి ఓమ్ని ఛాసిస్‌ని ఉపయోగించాం." అని ఆలంగీర్ బీబీసీతో చెప్పారు.

షేక్ తన ఇంటి దగ్గర నివసించే కార్పెంటర్‌లు, కార్ మెకానిక్‌ల సాయంతో ఈ కారును తయారుచేశారు.

జీవనోపాధి కోసం డ్రైవర్‌గా పనిచేసే నవాబ్.. నెలకు రూ. 9 వేల వరకు సంపాదిస్తారు.

ఈ కారు తయారు చేయడానికి డబ్బుకోసం, తన భార్య నగలు కొన్ని అమ్మాల్సి వచ్చిందని ఆయన స్థానిక పాత్రికేయులతో చెప్పారు.

పోలీస్

ఫొటో సోర్స్, Rakibul Islam

ఫొటో క్యాప్షన్, వైరల్ అయిన బెడ్ కారు ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉంది.

నవాబ్ ఫేస్‌బుక్ పేజీ ఎందుకు క్లోజ్ చేశారు?

"ఈద్ రోజున కారును టెస్ట్ చేద్దామని బయటకు తీసుకెళ్లా. ఆ సమయంలో, నా స్నేహితులు దానిని వీడియో తీశారు. దానిని నా ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన వెంటనే వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే దాదాపు 2.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.’’ అని నవాబ్ చెప్పారు.

"కొంత కాలం తర్వాత, బంగ్లాదేశ్‌కు చెందిన RTV అనే చానల్ దానిని డౌన్‌లోడ్ చేసుకుని, వారి సొంత వీడియోగా ప్లే చేసింది. ఆ చానల్ ఈ కారును బంగ్లాదేశ్‌కు చెందిన ఎవరో తయారు చేశారని చెప్పింది" అని నవాబ్ షేక్, ఆలంగీర్ షేక్ ఆరోపించారు.

కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ బంగ్లాదేశ్ చానల్ తమపై ఫేస్‌బుక్‌కు కంప్లయింట్ చేశారని నవాబ్ షేక్ చెప్పారు.

"ఆ ఫిర్యాదు తర్వాత, ఫేస్‌బుక్ నా పేజీని క్లోజ్ చేసింది. దాని గురించి ఫిర్యాదు చేయడానికి నేను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ పోలీసు అధికారులు నా బెడ్ కార్ చట్టవిరుద్ధమని చెప్పారు" అని షేక్ తెలిపారు.

మొబైల్ బెడ్ చూడటానికి వీధుల్లో భారీ జనసమూహం గుమిగూడడాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు షేక్‌ను రోడ్డుపై నడపవద్దని కోరారు. ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ పోలీస్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అప్పటి నుంచి కారు షెడ్‌లోనే ఉంది.

మోటారు వాహనాల చట్టం అలాంటి కారును రోడ్లపై నడపడానికి అనుమతించనందున, పోలీసులు కొన్ని రోజుల తర్వాత ఆ బెడ్ కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

స్థానిక జర్నలిస్టులు తీసిన వీడియోలో, నవాబ్ షేక్ కారు స్టీరింగ్ పట్టుకుని కూర్చుని ఉన్నట్లు, ఒక సివిల్ పోలీస్ వలంటీర్ కదులుతున్న కారుపైకి దూకినట్లు కనిపిస్తోంది.

కారు ప్రయాణంలో, వలంటీర్ కూడా మంచం మీద హాయిగా కూర్చున్నారు. ఈ ప్రత్యేకమైన కారు రోడ్డుపై వెళుతూవుంటే ప్రజలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కానీ నవాబ్ షేక్ మాత్రం చాలా విచారంగా ఉన్నారు. ఎందుకంటే ఫేస్‌బుక్ ఐడీని క్లోజ్ చేశారు. దీని కారణంగా వైరల్ అయిన వీడియోకి రావాల్సిన డబ్బులు అందలేదు.

ఇప్పుడు మరో సమస్య ఏంటంటే, తన భార్య నగలను అమ్మి తన కలను నెరవేర్చుకోవడానికి ఆయన నిర్మించిన బెడ్ కారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)