మోదీకి బహుమతిగా ఒంటికన్ను చిరుతపులి ఫొటో, శ్రీలంకలో దీని కోసం ఎందుకు వెతుకుతున్నారు?

శ్రీలంక, నరేంద్ర మోదీ, చిరుతపులి, వన్యప్రాణి

ఫొటో సోర్స్, SAJITH PREMADASA'S MEDIA UNIT

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత ప్రేమదాస ఒంటికన్ను ఆడ చిరుతపులి ఫొటోను బహూకరించారు.

ఒంటికన్ను ఆడ చిరుతపులి గురించి ప్రస్తుతం శ్రీలంకలో చాలా చర్చ జరుగుతోంది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శ్రీలంకలో పర్యటించారు. ఆ సమయంలో శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస మోదీతో సమావేశమై, చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మోదీకి ఒక జ్ఞాపికను బహూకరించారు.

వెళ్తూవెళ్తూ.. వెనక్కి తిరిగి చూస్తున్న ఆడ చిరుతపులి ఫొటోను ప్రేమదాస ప్రధాని మోదీకి అందజేశారు.

ఆ ఫొటోలో చిరుతపులి కుడి కన్ను నీలం రంగులో ఉంది. అంటే, ఆ కన్ను చూపు కోల్పోయినట్లు సూచిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒక కంటికి చూపు లేకపోయినా అడవిలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని మనుగడ సాగిస్తున్న ఈ చిరుతపులి 'శ్రీలంక సహజ వారసత్వానికి, సహజ అందాలకు చిహ్నం' అని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస అన్నారు.

గ్లకోమా (కంటి నరాలు దెబ్బతినడం), కంటిశుక్లాల కారణంగా చిరుతపులి చూపు కోల్పోయి ఉండొచ్చని, సవాళ్లను అధిగమిస్తూ మనుగడ కొనసాగించడానికి ఇది సంకేతమని సజిత్ ప్రేమదాస తన ‘ఎక్స్‌‌’ ఖాతాలో పోస్ట్ చేశారు.

ప్రధాని మోదీ, శ్రీలంక పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

ఈ చిరుతపులి ఎక్కడుంది?

విల్పట్టు జాతీయ అభయారణ్యం పరిధిలో ఉన్న ఈ చిరుతపులి గురించి అభయారణ్యం అధికారి పుబుదు సురంగ రత్నాయకేతో బీబీసీ తమిళ్ మాట్లాడింది.

''చిరుతపులికి రెండు కళ్లూ చాలా కీలకం. ఆహారాన్ని గుర్తించాలంటే రెండు కళ్లూ సరిగ్గా చూడగలగాలి. కానీ, ఈ చిరుతపులికి ఒక కన్ను కనిపించదు. ఏడాది నుంచి ఈ చిరుతపులి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు'' అని ఆయన చెప్పారు.

చిరుతపులి కళ్లు సహజంగానే అలా కనిపిస్తాయా? అని బీబీసీ ఆయన్ను అడిగింది.

''ఇది ప్రమాదం వల్ల జరిగిందేమీ కాదు. ఇలా ఏ జంతువుకైనా జరగొచ్చు. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా జరగొచ్చు. ప్రమాదం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం లేదు'' అన్నారాయన.

విల్పట్టు నేషనల్ పార్కులో దాదాపు 350 చిరుతపులులు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.

శ్రీలంకలో ఈ చిరుతపులి జాతిని 'శ్రీలంకన్ లెపార్డ్' లేదా పాంథెరా పార్డస్ కోటియా అని పిలుస్తారు.

ఈ చిరుతపులులను ప్రస్తుతం శ్రీలంకలో అంతరించిపోతున్న జాతిగా గుర్తించి, రక్షిత జాతుల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ జాతి చిరుతపులిని శ్రీలంకలో 1956లో మొదటిసారి గుర్తించారు.

శ్రీలంక, చిరుతపులి, వన్యప్రాణులు

ఫొటో సోర్స్, SAJITH PREMADASA'S MEDIA UNIT

ఫొటో క్యాప్షన్, 'వన్ ఐ' (ఒంటికన్ను) అని పిలిచే ఈ చిరుతపులి కోసం వెతుకుతున్నట్లు అభయారణ్యం అధికారి తెలిపారు.

'ఒంటికన్ను చిరుతపులి కోసం వెతుకుతున్నాం'

విల్పట్టు రక్షిత అటవీ ప్రాంతం అనురాధపుర, పుట్టాళం జిల్లాల్లో విస్తరించి ఉంది. అలాగే, మన్నార్, వావునియా జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటోంది.

చిరుతపులుల గణన కోసం, అలాగే దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలో భాగంగా 'వన్ ఐ' (ఒంటికన్ను) అని పిలిచే ఈ చిరుతపులి కోసం వెతుకుతున్నట్లు విల్పట్టు నేషనల్ పార్క్ ఆఫీసర్ పుబుదు సురంగ రత్నాయకే చెప్పారు.

''ప్రతిరోజూ దాదాపు 70 నుంచి 80 సఫారీ వాహనాలు అభయారణ్యంలోకి వెళ్తాయి. ఎవరికైనా ఈ చిరుతపులి తారసపడితే సమాచారం తెలియజేయాలని వారికి చెప్పాం. అలాగే, మా వాహనాలు కూడా అడవిలోకి వెళ్తాయి, ఈ చిరుతపులిని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

''ఇది ఆడ చిరుతపులి. కాబట్టి దీనికి ఎక్కువ దూరం నడిచే సామర్థ్యం ఉంటుంది. మగ జంతువు కంటే ఆడ జంతువు ఎక్కువ దూరం నడవగలదు'' అని రత్నాయకే చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)