విశాఖలో వివాహితకు ‘న్యూడ్ కాల్ చేయ్’ అంటూ అనంతపురం నుంచి జైలర్ మెసేజ్‌లు.. కేసు నమోదుతో పరారీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"బాత్రూమ్‌కి వెళ్లి నాకు కాల్ చేయ్... న్యూడ్ కాల్ చేయ్’’ అంటూ పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఒకాయన పదే పదే ఫోన్ చేసి వేధిస్తుండటంతో భరించలేక ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
ఇది విని తాను షాక్ అయ్యానని పోలీస్ కమిషనర్(సీపీ) శంఖబ్రత బీబీసీతో అన్నారు.
"మొత్తం డిజిటల్ ఆధారాలను సేకరించాం. కేసు నమోదు చేశాం. బాధితురాలు విశాఖపట్నానికి చెందిన వివాహిత. వేధింపులకు గురిచేసిన వ్యక్తి అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలు జైలర్ సీహెచ్ వీఎన్ సుబ్బారెడ్డి" అని సీపీ చెప్పారు.
కేసు నమోదు చేసి విచారణ చేయగా జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం బయటపడిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు తాము 2025 మార్చి 22న కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైం సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు.

జైలర్ పరారయ్యారా? ఏం జరిగింది?
సాధారణంగా జైలు నుంచి ఖైదీ పరారీ అనే వార్తలు వింటుంటాం. చూస్తుంటాం. కానీ, అనంతపురంలోని ఓపెన్ ఎయిర్ జైలులో మాత్రం జైలర్ పరారయ్యారు.
"అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలు జైలర్ సుబ్బారెడ్డి పరారయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ పొందారు" అని చెప్పిన సీపీ, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బీబీసీకి వెల్లడించారు.
ఆయన మాటల్లోనే ఈ కేసు వివరాలు...
''అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు జైలర్‌గా పని చేస్తున్న సీహెచ్ వీఎన్ సుబ్బారెడ్డిపై విశాఖ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే, బాధితులకు అండగా ఉండాల్సిన వ్యక్తి 'న్యూడ్ కాల్స్' చేయాలంటూ గృహిణితో వికృత చేష్టలకు దిగడం ఏ మాత్రం సహించరానిది’’ అన్నారాయన.
‘‘న్యూడ్ కాల్ చెయ్యి.. 20 వేలిస్తా.. 30 వేలిస్తా.. అంటూ విశాఖపట్నంలోని ఓ గృహిణికి సుబ్బారెడ్డి మెసేజులు పంపేవారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేం పూర్తిగా విచారించాం. ఆమె ఫిర్యాదులో విషయాలన్నీ నిజమేనని తేలింది. ఆయన్ని ప్రశ్నించేందుకు అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్‌కు మా బృందాన్ని పంపించాం. కానీ, సుబ్బారెడ్డి జైలులో లేరు. ఎటువంటి సమాచారం లేదు. ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో, ఆయన పరారయ్యారని మేం నిర్ధరించుకున్నాం.
సుబ్బారెడ్డి ఆచూకీ తెలుపాలంటూ జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశాం. వైజాగ్‌లో కేసు నమోదైనట్టు తెలియగానే సుబ్బారెడ్డి పరారైనట్లుగా భావిస్తున్నాం. విచారణకు సుబ్బారెడ్డి హాజరయ్యే విధంగా ఆయన ఆచూకీ తెలుపాలంటూ లేఖలో పేర్కొన్నాం. కేసు వివరాలన్నీ వివరంగా పేర్కొన్నాం.
ఆ తర్వాత ఆయన కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 9న ఆయనకు బెయిల్ లభించడంతో, విశాఖకు రప్పించి విచారించేందుకు సిద్ధమవుతున్నాం'' అని సీపీ తెలిపారు.
'నాన్ స్టాప్‌గా ఫ్రెండ్‌షిప్ రిక్వెస్టులు'
‘‘సుబ్బారెడ్డికి బాధితరాలితో గతంలో ముఖ పరిచయం ఉంది. సుబ్బారెడ్డి 2019-21 మధ్యలో విశాఖలో పని చేశారు. అప్పటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఫేస్‌బుక్‌లో వేధింపులకు పాల్పడ్డారు.
డబ్బులు పంపిస్తా మీ ఖాతా నంబరు చెప్పాలంటూ బలవంతం చేయడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. సుబ్బారెడ్డితో మాట్లాడించారు.
అయినా సుబ్బారెడ్డి వేధింపులు ఆగలేదు. పైగా కొన్ని న్యూడ్ ఫొటోలు పంపి అలాంటివే షేర్ చేయమని కోరేవారు.
సుబ్బారెడ్డి ఆమెకు పంపించిన మేసేజులు, ఫేస్‌బుక్ మెసేంజర్ డేటాను బాధితురాలు పోలీసులకు ఇచ్చారు. వీటితో సైబర్ క్రైమ్ టీమ్ విచారణ చేసింది. వేధింపులు నిజమేనని తేలడంతో మార్చి 22న కేసు నమోదు చేశారు’’ అని సీపీ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
'విచారణకు హాజరవ్వాలని కోరాం. కానీ...'
విచారణకు హాజరవ్వాలని సుబ్బారెడ్డిని పలుమార్లు కోరినా రాకపోవడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని అనంతపురం పంపారు. అప్పటికే అక్కడి నుంచి పరారైనట్లు తేలింది.
ఆయన ఫిబ్రవరి నుంచి అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది.
అధికారులు ఆయన కోసం ఆరా తీయగా... మార్చి 23 నుంచి ఆయన విధులకు హాజరుకావడం లేదని తెలిసింది. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదంటూ మెయిల్ ద్వారా సందేశం పంపారని సీపీ చెప్పారు.
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో, క్వార్టర్స్ వద్దకు వెళ్లి చూడగా ఆసుపత్రిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి పరారీ వెనుకున్న విషయాలను సీపీ శంఖబ్రాత బాగ్చీ వివరించారు.
ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేరని తెలిపారు.
సుబ్బారెడ్డి వేరే మహిళలతో కూడా ఇలాగే ప్రవర్తించారా అనే విషయంపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే సుబ్బారెడ్డిపై ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని, జైళ్ల శాఖయినా, పోలీసు శాఖయినా చట్టం అందరికి ఒక్కటేనని, ఖచ్చితంగా ఆయనకు శిక్షపడేలా చేస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
సుబ్బారెడ్డి ఎవరు?
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి జైళ్ల శాఖలో 2010 డిప్యూటీ జైలర్‌గా ఉద్యోగంలో చేరారు.
2019లో జైలర్‌గా ప్రమోషన్ పొందారు. 2019-21 మధ్య విశాఖలో పని చేశారు. ఆ సమయంలోనే బాధిత మహిళతో ముఖ పరిచయం ఏర్పడినట్లు గుర్తించామని విశాఖ పోలీసులు తెలిపారు.
అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలులో ఈ ఏడాది ఫిబ్రవరి 1న విధుల్లో చేరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














