'పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై ఫ్యామిలీలో ఎలాంటి అనుమానాలు లేవు'

ఫొటో సోర్స్, Bishop pratap Sinha
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మార్చి 24 రాత్రి 11.42కు మరే ఇతర వాహనం ఢీకొట్టలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.
ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతోనే ప్రవీణ్ కుమార్ మరణించినట్లు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరి, రాజమహేంద్రవరం వస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని... ఆ సమయంలో పారామెడికల్ సిబ్బంది అందిస్తామన్న చికిత్సను కూడా నిరాకరించి మరీ ప్రయాణం సాగించారని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.
హెడ్‌లైట్ దెబ్బతిన్న వాహనంపై బ్లింకర్స్ సహాయంతో ప్రయాణిస్తూ కొంతమూరుకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న కంకర రాళ్లపై స్కిడ్ అవడంతో ప్రవీణ్ కుమార్ ద్విచక్రవాహనం 7 అడుగుల దిగువున ఉన్న ఎండిపోయిన డ్రైయిన్‌లోకి పడిపోయిందని తెలిపారు.
ఆయనపై వాహనం పడటంతోనే మరణించినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో తేలిందని ఐజీ చెప్పారు.


500 సీసీ టీవీ ఫుటేజ్‌లు విశ్లేషించి, 98 మంది సాక్షులను విచారించి..
పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వచ్చే వరకు దారి పొడవునా దాదాపు 500 సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించినట్లు ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.
''వాటన్నింటినీ హైదరాబాద్ ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపి రిపోర్ట్స్ తెప్పించుకుని...టెక్నాలజీ సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేశాం. ఇంత స్థాయిలో ఇటీవల కాలంలో టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు చేసిన కేసు ఇదే'' అని తెలిపారు. ఈ కేసుపై ఎన్నో రకాలుగా విచారణ జరిపామన్నారు.
'' దారి పొడవునా ప్రవీణ్‌ను గమనించిన వారిని, ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశాం. కుటుంబ సభ్యులను కూడా విచారించాం. ప్రవీణ్ ప్రయాణించిన బైక్‌తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్‌లను కూడా ఎగ్జామిన్ చేశాం. ఆయన ఫోన్ కాల్స్, పేమెంట్స్, ఎక్కడెక్కడ ఆగింది, ఎవరితో మాట్లాడింది...ఇలా ప్రతీ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని విచారించాం'' అని తెలిపారు ఐజీ అశోక్ కుమార్.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం.. ఎక్కడెక్కడ ఏం జరిగింది?
2025 మార్చి 24న పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆరుగురితో ఫోన్లో మాట్లాడారు.
క్రిస్టియన్ సభల నిర్వహణకు సంబంధించిన పనులు ఏప్రిల్ నెలంతా రాజమహేంద్రవరంలోనే ఉండటంతో వాహనం అవసరం ఉంటుందని హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై బయలు దేరి, బుల్లెట్‌ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆయన అనుకున్నారని తమ విచారణలో తేలినట్లు ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.
''ప్రయాణం మధ్యలో కొన్ని చోట్ల మద్యం కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద లారీని ఓవర్‌టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద కూడా రోడ్డు పక్కన పడిపోయారు. అక్కడే ఆయన వాహన హెడ్‌లైట్ పగిలిపోయింది. సాయంత్రం 4.51కు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పైకి 5 గంటలకు వచ్చిన పాస్టర్ ప్రవీణ్ కుమార్, సాయంత్రం 5.15కు రామవరప్పాడు వచ్చి కింద పడిపోయారు'' అని ఐజీ చెప్పారు.
''అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్‌తో మాట్లాడారు. కానీ, ఎస్ఐకి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆయనేనని తెలియదు. ఎందుకంటే హెల్మెట్, మాస్క్, కళ్లద్దాలు ధరించి ఉన్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, కాలపర్రు టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్‌తోనే ప్రయాణించారు. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి''
'' కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11:31 గంటలకు వచ్చారు. బుల్లెట్‌పై 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. ప్రమాదానికి గురైన సమయంలో ఆయన వాహనం ఫోర్త్ గేర్‌లో ఉన్నట్లు రవాణా శాఖ నిర్ధరించింది. రాత్రి 11.42 గంటలకు నయారా పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న ఎండిపోయిన డ్రెయిన్‌లో పడిపోయారు. రోడ్డు నుంచి ఈ డ్రెయిన్ సుమారు 7 అడుగుల లోతు ఉంటుంది'' అని ఐజీ అశోక్ కుమార్ మీడియాకు వివరించారు.

ఫొటో సోర్స్, UGC
''పాస్టర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని ఎవరు ఢీకొట్టలేదు. అలా జరిగితే వాహనానికి ఉన్న పెయింట్ మరో వాహనానికి అంటుకుంటుంది. అలాంటి ఆధారాలేమి లభించలేదు. ఒక ఎర్రని కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టిందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఆ కారు ప్రవీణ్ కుమార్ వాహనానికి ప్రమాదం జరిగే సమయానికి దూరంలో ఉంది.'' అని ఐజీ తెలిపారు.
పోస్టుమార్టమ్ రిపోర్టులో మద్యం తాగి వాహనం నడిపినట్లు తేలిందని.. ప్రవీణ్ కుమార్ శరీరంపై కనిపించిన గాయాలు కంకర రాళ్లపై నుంచి బండి స్కిడ్ అవడం వలన తగిలినవని వైద్యులు నిర్ధరించారని ఐజీ చెప్పారు.
ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులు ఆయన మరణం విషయంలో ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. విచారణలో భాగంగా 98 మందిని ప్రశ్నించినట్లు వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














