అన్నమా, రోటీనా? రాత్రివేళ ఏది తింటే మంచిది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్వారె
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాత్రివేళ అన్నం తినడం మంచిదా? రోటీ తినడం మంచిదా? ఈ చర్చ ప్రజల మధ్య చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది.
చాలామంది రాత్రి భోజనంలో అన్నం, రోటీ రెండూ తింటారు.

బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రజల ప్రధాన ఆహారం అన్నం. పంజాబ్, మధ్యప్రదేశ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు రోటీ ఇష్టపడతారు.
కానీ, నిపుణులు ఈ చర్చను అన్నం, రోటీ ఆధారంగా మాత్రమే చూడరు.
మీ డిన్నర్ ప్లేట్‌లో రోటీ ఉండాలా లేక అన్నం ఉండాలా అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మీరు తినే బియ్యం లేదా రోటీ రకాన్ని బట్టి కూడా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మీరు ఎలా తింటున్నారన్నది చాలా ముఖ్యం
మన ప్లేట్‌లో ఉండే అన్నంలోనైనా రోటీలోనైనా రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే అన్నం కంటే రోటీలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఆరోగ్య దృక్పథం రీత్యా రోటీ మంచిది.
ముంబయికి చెందిన డైటీషియన్ నజ్నీన్ హుస్సేన్ ఈ విషయమై స్పందిస్తూ, ''మీరు ముతక పిండి లేదా ఎక్కువ పీచుపదార్థం (ఫైబర్)తో తయారుచేసిన రోటీని తింటే పర్వాలేదు. కానీ మీరు పూర్తిగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) పిండితో తయారుచేసిన రోటీని తింటుంటే, అది అన్నం లాంటిదే. దాన్ని తిన్న తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది'' అని చెప్పారు.
ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం కంటే పాలిష్ చేయని సన్న బియ్యం మంచిదని ఆయన చెబుతున్నారు.
ఫైబర్‌ను దృష్టిలో ఉంచుకొనే, తరచుగా బ్రౌన్ రైస్ లేదా పాలిష్ చేయని బియ్యం తినమని ప్రజలకు వైద్యులు, డైటీషియన్లు సలహా ఇస్తుంటారు.
అన్నంతో పాటు పప్పు, పెరుగు, లేదా కాయగూరలను తినండనే మరో సిఫారసు కూడా చేస్తున్నారు. బియ్యం గంజి లేదా పులావ్ తినడం కూడా మంచిదని చెబుతున్నారు.
''ప్రస్తుతం మనం తింటున్న పిండి రకం ఎలాంటిందంటే చక్కెర, రిఫైన్డ్ ఫ్లోర్, ఉప్పులానే తెల్లని విషం (వైట్ పాయిజన్)గా మారుతుంది'' అని దిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం. వలీ చెప్పారు.
''మన ఆహార అలవాట్లలో చేస్తున్న తప్పు ఏమిటంటే, ఎక్కువగా రోటీలు, తక్కువగా కూరగాయలు తినడం. ఒకవేళ, మీరు అన్నంతో పాటు కాయగూరలు ఎక్కువగా తింటే, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ మెరుగవుతుంది. అంటే దాని నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర శరీరంలో నెమ్మదిగా కరిగిపోతుంది. ఈ విధంగా ఇది రోటీ కంటే మెరుగ్గా మారుతుంది'' అని డాక్టర్ వలీ చెప్పారు.
కేవలం పిండితో మాత్రమే రోటీని చేస్తుంటే, దానికి ఆకుకూరలు లేదా కూరగాయలను కలపడం ద్వారా మరింత మెరుగ్గా తయారుచేయవచ్చని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నం, రోటీ మధ్య తేడా ఏమిటంటే...
ఎక్కువ శక్తి అవసరమయ్యేవారికి, ఉదాహరణకు తీవ్రమైన శారీరక శ్రమ చేసేవారికి అన్నం మంచిది. కానీ మీరు అతిగా తినడం మానుకోవాలన్నా, తరచుగా తినకూడదనుకున్నా రోటీ మీకు మంచి ఎంపిక. ఎందుకంటే, దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది.
దీనివల్ల చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
‘‘ప్రోటీన్ ఉన్న రోటీ తీసుకుంటే మంచిది. రోటీతో తినడానికి మాంసాహారులకు అనేక ఆప్షన్లు ఉన్నా, శాకాహారులకు మాత్రం రోటీతో కాయగూరలు లేదా పప్పు తీసుకోవచ్చు'' అని దిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో డైటీషియన్ మాలా మన్రాల్ చెప్పారు.
''మీరేం తినాలనేది మీరు చేస్తున్న పని, మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కూర్చొని ఉద్యోగం చేస్తే మీకు తక్కువ కేలరీలు అవసరం. అలాంటివారిని రోటీ తినమని సలహా ఇస్తున్నాం. ఎందుకంటే వారు అన్నం ఎక్కువగా తింటే, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది'' అని మన్రాల్ వివరించారు.
ఒక వ్యక్తి అన్నం తినాలా లేక రోటీ తినాలా అనేది చాలావరకూ తన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, డయాబెటిక్ పేషెంట్లకు అన్నం తినకుండా, పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తుంటారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన అన్నం ఫైబర్ పరంగా మంచిదని పరిగణిస్తారు.
''అన్నం ఫ్రిజ్‌లో ఉంచితే, దానిలో పిండి పదార్థం ఫైబర్‌గా మారుతుంది. అంటే, దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరగదు'' అని డైటీషియన్ నజ్నీన్ హుస్సేన్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు
ప్రజల ఆహార అలవాటు కూడా ఏదైనా ప్రాంతాన్ని బట్టి నిర్ణయమవుతుందా?
మనం చిన్నప్పటి నుంచి ఏది తిన్నామో అదే తేలికగా జీర్ణమవుతుందని, అదేసంతృప్తి ఇస్తుందని నమ్ముతారు.
''ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేదే ఆ ప్రాంతంలోని ప్రజల ప్రధాన ఆహారంగా మారుతుంది. సాధారణంగా ప్రజలు అలాంటి ఆహారాన్ని తినాలి'' అని నజ్నీన్ హుస్సేన్ చెప్పారు.
ఉదాహరణకు, కశ్మీర్ ప్రజలకు వరి ప్రధాన ఆహారం, వారికి అన్నం కన్నా రోటీ మంచిదని చెప్పలేం.
''చాలా ప్రాంతాల్లో ప్రజలకు రోటీ ఎలా తయారుచేయాలో కూడా తెలియకపోవడం నేను చూస్తున్నాను. భారతదేశంలో చాలామంది అన్నం తింటారు. దక్షిణ భారతదేశంలో డయాబెటిక్ రోగులు కూడా అన్నం తింటారు. కానీ ఆ అన్నం జీర్ణించుకోవడానికి క్లోమంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలని దానికి అనేక పదార్థాలు జోడించి వండుతారు'' అని డాక్టర్ వలీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














