కిలో బియ్యం పండాలంటే ఎన్ని నీళ్లు కావాలో తెలుసా, ఇకపై వరి అన్నం తినడం తగ్గించాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫుడ్ చైన్ షో
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
వరి కేవలం ఆహారం మాత్రమే కాదు.
ప్రపంచంలో సగం మంది జనాభాకు కేవలం వరి భోజనంలో భాగం మాత్రమే కాదు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్థిక జీవికకు కూడా ప్రతీక.
"మా వంటలకు గుండెచప్పుడు బియ్యమే’’ అంటారు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో బీబీసీ వరల్డ్ సర్వీస్ శ్రోత అడ్రియెన్ బియాంకా విల్లానువా.
‘‘ఇది ప్రధాన భోజనకంటే ఎక్కువ ప్రాముఖ్యమున్నది. మా సంస్కృతికి పునాది’’ అంటారు.
"చాలా మంది ఫిలిప్పీన్స్ ప్రజలుఅల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇలా రోజుకు మూడుపూటలా వరి అన్నమే ఆహారంగా తీసుకుంటారు. డెజర్ట్‌లలో కూడా బియ్యంతో చేసినవి ఉంటాయి. నాకు కాస్త స్టికీ రైస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది దాదాపు ప్రతి సంప్రదాయ డెజర్ట్‌లో ఉంటుంది" అని ఆమె చెప్పారు.
కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది.
దీనితో మనం వరి అన్నం తినడం తగ్గించాలా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.


ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం 50,000 కంటే ఎక్కువ ఆహార పంటలున్నా, ప్రపంచంలోని 90 శాతం ఆహార అవసరాలను కేవలం 15 పంటలు మాత్రమే తీరుస్తున్నాయి. వాటిలో వరి, గోధుమ, మొక్కజొన్న అత్యంత ముఖ్యమైనవి అని పేర్కొంది.
"ప్రపంచ మొత్తం జనాభాలో 50 నుంచి 56 శాతం మంది తమ ప్రధాన ఆహారానికి వరిపైనే ఆధారపడుతున్నారు’’ అని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఇవాన్ పింటో అంటున్నారు.
దీని అర్థం దాదాపు నాలుగు వందలకోట్లమంది ప్రతిరోజూ తమ ప్రధాన ఆహారంగా వరి అన్నమే తింటారు.
దక్షిణ, ఆగ్నేయాసియాలో వరిని పెద్ద ఎత్తున పండిస్తారు. ఆఫ్రికాలో కూడా దీని డిమాండ్ పెరుగుతోంది. కొన్ని వరి రకాలు యూరప్, దక్షిణ అమెరికాలో కూడా పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

"వరి పంటకు చాలా నీరు అవసరం" అని స్పానిష్ బహుళజాతి సంస్థ ఎబ్రో ఫుడ్స్ యాజమాన్యంలోని బ్రిటన్ కేంద్రంగా నడిచే బియ్యం కంపెనీ టిల్డా మేనేజింగ్ డైరెక్టర్ జీన్-ఫిలిప్ లాబోర్డే వివరించారు.
"ఒక కిలో వరి ధాన్యం పండించడానికి దాదాపు 3,000 నుంచి 5,000 లీటర్ల నీరు అవసరం. ఇది చాలా ఎక్కువ" అన్నారు ఆయన.
చాలా వరి పంటలను వరదలు సంభవించే ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో పండిస్తారు. ఈ పద్ధతి వరి సాగుకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు కానీ ఇది ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనిని వాయురహిత పరిస్థితులు అని పిలుస్తారు.
"పొలాలు ముంపునకు గురైనప్పుడు, అక్కడ ఉండే సూక్ష్మజీవులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి." అని డాక్టర్ ఇవాన్ పింటో చెప్పారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం.. మీథేన్ ఒక శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు. ఇది మొత్తం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలలో 30 శాతం కారణమవుతుంది.
ఐఆర్ఆర్ఐ (ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) అంచనా ప్రకారం, ప్రపంచ వ్యవసాయ రంగం నుంచి వెలువడే మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో బియ్యం ఉత్పత్తి దాదాపు 10 శాతం వాటా కలిగి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

తక్కువ నీటితో వరిని పండించడానికి 'ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్' (ఏడబ్ల్యూడీ) అనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి టిల్డా ప్రయత్నిస్తోంది.
ఈ పద్ధతిలో, పొలం ఉపరితలం నుంచి 15 సెం.మీ దిగువన ఒక పైపు ఏర్పాటు చేస్తారు. పొలం అంతటా నిరంతరం నీటిని నింపడానికి బదులుగా, పైపు లోపల నీరు పూర్తిగా ఎండిపోయినప్పుడు రైతులు నీరు పోస్తారు.
"సాధారణంగా మొత్తం వరిపంట కాలంలో 25 సార్లు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏడబ్ల్యూడీ సాంకేతికతతో దీనిని 20కి తగ్గించవచ్చు" అని టిల్డా మేనేజింగ్ డైరెక్టర్ జీన్-ఫిలిప్ లాబోర్డే వివరించారు.
"ఐదుసార్లు సాగునీటి పారుదలను ఆదా చేయడం ద్వారా, నీరు ఆదా అవడమే కాకుండా, మీథేన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి." అని ఆయన చెప్పారు.
2024 సంవత్సరంలో, టిల్డా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే రైతుల సంఖ్యను 50 నుంచి 1,268కు పెంచింది. ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
"మేం నీటి వినియోగాన్ని 27శాతం, విద్యుత్తును 28 శాతం, ఎరువుల వినియోగాన్ని 25శాతం తగ్గించాం. అయినప్పటికీ, పంట ఉత్పత్తి 7 శాతం పెరిగింది" అని లాబోర్డే చెప్పారు.
"ఇది ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ సంపాదించడం గురించి మాత్రమే కాదు, తక్కువ పెట్టుబడి ద్వారా ఎక్కువ సంపాదించడం గురించి కూడా" అని ఆయన అన్నారు.
మీథేన్ ఉద్గారాలలో 45 శాతం తగ్గడం గమనించామని, సాగునీటి అవసరాన్ని మరింత తగ్గించగలిగితే, మీథేన్ ఉద్గారాలలో 70 శాతం తగ్గింపు సాధ్యమని లాబోర్డే నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యంగా హరిత విప్లవం సమయంలో అభివృద్ధి చేసిన ఐఆర్-8 వంటి అధిక ఉత్పాదక రకాల ద్వారా కోట్లమందికి ఆహారం అందించడంలో వరి ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, వాతావరణ మార్పు ఇప్పుడు దాని ఉత్పత్తికి పెద్ద ముప్పుగా మారుతోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం..ఈ రకాలను సాగు చేసే ప్రాంతాల్లో వేడి, ఎండలు, భారీ వర్షాలు, వరదల వంటి ఘటనలు నిరంతరం పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో, 2024 వరి సీజన్‌లో ఉష్ణోగ్రతలు 53 డిగ్రీల సెల్సియస్‌కి చేరాయి. బంగ్లాదేశ్‌లో తరచుగా, విస్తృతంగా సంభవించే వరదలు పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఈ సవాలును పరిష్కరించడానికి, ఐఆర్ఆర్ఐ (ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) తన జన్యు బ్యాంకులో భద్రపరిచిన 1,32,000 వరి రకాలను విశ్లేషించి పరిష్కారాలను కనుగొంటోంది.
ఒక కీలక పురోగతిలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక జన్యువును గుర్తించారు. ఇది నీటి అడుగున మొక్కను 21 రోజుల వరకు జీవించి ఉండేలా చేస్తుంది.
‘‘వరదల్లాంటి సమయంలో ఎక్కువకాలం నీటిలో నానే వరి చేలను ఈ జన్యువు రక్షిస్తుంది. దిగుబడిపై కూడా ప్రభావం పడదు" అని డాక్టర్ పింటో వివరిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటువంటి వరి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని దేశాలు వరి వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేశాయి.
సుమారు 15 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వం బంగాళాదుంపలను ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడానికి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది.
"నాకు బంగాళదుంపలు ఇష్టమే... కానీ అన్నానికి బదులుగా పూర్తిగా బంగాళదుంపలతోనే భోజనం చేయడాన్ని నేను ఊహించలేను," అని ఢాకాలో నివసించే షరీఫ్ షబీర్ చెప్పారు.
చైనా కూడా 2015లో బంగాళాదుంపలను పోషకాలతో కూడిన 'సూపర్‌ఫుడ్' అని ప్రచారం చేసింది. వాస్తవానికి 1990లలో చైనా ప్రపంచంలోనే అగ్రగామి బంగాళాదుంప ఉత్పత్తిదారుగా అవతరించింది. దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు బంగాళాదుంపలను ప్రధాన ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారం విజయవంతం కాలేదు.
"నైరుతి, వాయువ్య చైనాలో, బంగాళాదుంపలను అప్పుడప్పుడు ప్రధాన ఆహారంగా తింటారు" అని లండన్‌లోని ఎస్ఓఏఎస్ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్రవేత్త జాకబ్ క్లీన్ వివరించారు.
"చాలా ప్రాంతాల్లో బంగాళదుంపలను పేదరికానికి సంబంధించిన ఆహారంగా భావిస్తున్నారు." అని ఆయన అన్నారు.
"నైరుతి చైనాలో చాలా మంది ప్రజలు తమ బాల్యాన్ని బంగాళాదుంపలు తింటూ గడిపారని నాకు చెప్పారు. నిజానికి, బంగాళదుంపలు తినడాన్ని ఒక రకమైన సామాజిక అవమానంగా కూడా భావించే పరిస్థితి ఉంది" అని క్లీన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా బియ్యం సామాన్య ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. ఇవి రుచికరమైనవి. వండడం తేలిక. నిల్వ చేయడం, రవాణా చేయడం సులభం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 520 మిలియన్ టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు అంచనా.
"తాను వరి అన్న తినడం తగ్గించుకోగలనని, కానీ పూర్తిగా మానేయలేనని" ఫిలిప్పీన్స్‌కు చెందిన అడ్రియన్ బియాంకా విల్లానువా చెప్పారు.
"నేను అన్నం తినకూడదనుకున్నప్పటికీ, వేరొకరి ఇంటికి లేదా పార్టీకి వెళ్ళినప్పుడల్లా వారు వరితో చేసిన వంటకాలనే వడ్డిస్తారు" అని ఆమె చెప్పారు.
"నేను తక్కువ తింటాను కానీ పూర్తిగా అన్నం తినడం మానేయడం కష్టం. ఎందుకంటే ఇది మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం." అని అడ్రియన్ బియాంకా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














