మొలకెత్తిన, పచ్చగా మారిన బంగాళ దుంపలు తినకూడదా?

మొలకలు

ఫొటో సోర్స్, Getty Images

మీరు రాత్రి భోజనం కోసం బంగాళదుంప కూర తయారు చేద్దామని చూస్తే, అవి మొలకెత్తి కనిపించాయి. వాటిని వాడటమా, లేక పారేయడమా అనే సందేహం వచ్చే ఉంటుంది కదా?

ఉల్లిపాయలు, బంగాళదుంపలు లేదా వెల్లుల్లి మొలకెత్తిన తర్వాత తినాలా వద్దా అనే అంశంపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

మొలకెత్తిన బంగాళదుంపలతో ఏం చేయాలో? ఏం చేయకూడదో? తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉల్లిపాయలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొలకెత్తిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు

బంగాళదుంప మొలకెత్తుతోంది అంటే అదొక మొక్కగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని అర్థం. ఇలా దుంపనుంచి మొక్కగామారే ప్రక్రియలో.. బంగాళ దుంపల్లో విషపూరిత గ్లైకోఅల్కలాయిడ్స్ పెరగడం మొదలవుతుంది. శిలీంధ్రాలు, కీటకాల నుంచి గ్లైకోఅల్కలాయిడ్స్ మొక్కలను రక్షిస్తాయి.

ఈ సమ్మేళనాలలో ఒకటి సోలనిన్, ఇది బంగాళదుంపలతో పాటు, టమోటాలు, వంకాయలు, క్యాప్సికమ్ వంటి మొక్కలలో కూడా కనిపిస్తుంది.

బంగాళదుంపలను ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల కూడా సోలనిన్ పరిమాణం పెరుగుతుంది. అందుకే మొలకెత్తిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బంగాళదుంపలు మనుషులకే కాదు, జంతువుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

మొలకెత్తిన కూరగాయలు తినొచ్చా?

"మొలకెత్తిన బంగాళ దుంపల్లో ఉండే గ్లైకోఅల్కలాయిడ్స్ చాలా ప్రమాదం. వీటివల్ల బంగాళ దుంప చేదుగా మారిపోతుంది. దీన్ని తినడం వల్ల వాంతులు అవుతాయి" అని 'పొటాటోస్ పోస్ట్‌హార్వెస్ట్' రచయిత, లింకన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌హార్వెస్ట్ టెక్నాలజీలో రీడర్ డాక్టర్ క్రిస్ బిషప్ చెప్పారు.

బంగాళ దుంపల రంగును బట్టే అది తినొచ్చా, తినకూడదా అనేది గుర్తించవచ్చని ఆయన బీబీసీతో చెప్పారు. ఆకుపచ్చగా మారిన బంగాళ దుంపలను తినకూడదని ఆయన అన్నారు.

మొలకెత్తిన బంగాళ దుంపల్లో అధికమోతాదులో గ్లైకోఅల్కలాయిడ్ రసాయనాలుండే అవకాశం ఉందని క్రిస్ బిషప్ చెప్పారు. ఆలుగడ్డ ఆకుపచ్చగా మారితే దాన్ని తినకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఇక మొలకలు వచ్చిన బంగాళాదుంపలో మొలకొచ్చిన భాగాన్ని కట్ చేసి తినాలన్నారు.

కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని మొలకెత్తిన బంగాళ దుంపలను తినొచ్చని బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (ఎఫ్ఎస్ఏ) కూడా చెబుతోంది.

"మొలకలు వచ్చిన తర్వాత కూడా బంగాళాదుంప గట్టిగా ఉండి, కుళ్ళిన సంకేతాలు లేకుంటే, దానిని తినడం సురక్షితమే" అని ఎఫ్ఎస్ఏ తెలిపింది.

అయితే, బంగాళాదుంప ఆకుపచ్చగా కనిపిస్తే, దానిని పారేయడమే మంచిదని ఎఫ్ఎస్ఏ సలహా ఇచ్చింది. ఆకుపచ్చ రంగు విషపూరిత పదార్థాల ఉనికిని సూచిస్తుంది. చిన్నగా మొలకెత్తిన బంగాళదుంపలను తినవచ్చని ఎఫ్ఎస్ఏ చెబుతోంది.

అయితే, బంగాళాదుంప చాలా మెత్తగా లేదా పొడిగా ఉంటే, అందులో పోషకాలు ఉండవని, వండుకుంటే రుచిగానూ ఉండదని తెలిపింది.

విషపూరితం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను తినకూడదని నిపుణులు అంటున్నారు.

సోలనిన్ గురించి మరిన్ని విషయాలు..

కొంతమంది నిపుణులు మొలకెత్తిన దుంపలను తినే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం మంచిదని అంటున్నారు. ఆకుపచ్చగా మారిన, మొలకెత్తిన బంగాళ దుంపలను అస్సలు తినకూడదని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ప్రొఫెసర్ కాథీ మార్టిన్ చెప్పారు.

బంగాళదుంపలను వెలుతురులో ఉంచడం, (ఇది అంకురోత్పత్తిని పెంచుతుంది) విషపూరితమైన సోలనిన్‌ను పెంచుతుందని ఆమె చెప్పారు. ఇది మానవులకు, జంతువులకు, ముఖ్యంగా పిల్లులు, కుక్కలకు ప్రాణాంతకం కావచ్చని అన్నారు.

‘‘పచ్చగా లేని బంగాళ దుంపలలో తక్కువ మోతాదులో సోలినిన్ ఉంటుంది. ఎవరూ పచ్చి బంగాళ దుంపలు తినకూడదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆకుపచ్చగా లేని బంగాళదుంపలలో కూడా సోలనిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకే పచ్చి బంగాళదుంపలను తినకూడదని ప్రొఫెసర్ మార్టిన్ అంటున్నారు.

"ఎందుకంటే సోలనిన్ విషంగామారే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. అరుదైనప్పటికీ, సోలనిన్‌కు సంబంధించిన కొన్ని కేసులు వెలుగుచూశాయి. 1970 చివరలో, బ్రిటన్‌లో 78 మంది పాఠశాల పిల్లలు ఆకుపచ్చని బంగాళ దుంపలు తిన్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారు" అని మార్టిన్ అన్నారు.

సోలనిన్ తక్కువమోతాదులో ఉన్న బంగాళదుంపలు తిన్నా వాంతులు, విరేచనాలు అవుతాయి. తీవ్రమైన కడుపునెప్పి కూడా వస్తుంది.

కానీ తీవ్రమైన కేసులలో తలతిరగడం, గందరగోళం, బలహీనత, కళ్లు మసకబారడం లాంటి సమస్యలకు దారితీయవచ్చు. మరికొన్ని సందర్భాల్లో, స్పృహ కోల్పోవడంతోపాటు మరణానికి కూడా దారితీస్తుంది.

ఈ లక్షణాలు విషపూరిత బంగాళ దుంపలు తిన్న నిమిషాల్లో లేదా రోజుల్లోనే కనిపిస్తాయి అని మార్టిన్ చెప్పారు.

బంగాళాదుంపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బంగాళ దుంపలు తినడం ప్రమాదకరం

ముఖ్యమైన విషయాలు

  • మొలక చిన్నగా ఉంటే, తినడానికి ముందు దానిని కట్ చేసేయండి.
  • మొలకలు అంగుళం కంటే ఎక్కువ పొడవు ఉన్నా లేదా బంగాళ దుంప మెత్తబడిపోయినా దానిని పారేయాలి.
  • బంగాళ దుంపలో ఆకుపచ్చగా ఉండే భాగాన్ని కత్తిరించాలి. ఎందుకంటే అది ఎక్కువ విషపూరితమైంది.
  • బంగాళ దుంపలో తెగులు లేదా బూజు కనిపిస్తే దాన్ని పారేయడం మంచిది.
  • మీరు మొలకెత్తిన బంగాళ దుంపలను నాటాలనుకుంటే, మొలకలను కట్ చేయకూడదు, వాటితో పాటే నాటాలి.
  • గర్భిణులు, చిన్న పిల్లలకు పాలిస్తున్న తల్లులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇలాంటి దుంపలను తినకపోవడమే మంచిది.
నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగాళాదుంపలు పాడైపోకుండా, ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే కొన్ని మార్గాలున్నాయి.

బంగాళ దుంపలను ఎలా నిల్వ చేయాలి?

బంగాళ దుంపలను పొడి, చీకటి ప్రదేశాలలో (3-10°సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత) నిల్వ చేయవచ్చు. వాటిని నిల్వ చేసే ముందు కడగకూడదు. కడిగితే త్వరగా కుళ్లిపోతాయి.

బంగాళ దుంపలను ఉల్లిపాయలకు దూరంగా ఉంచాలి. రెండింటి నుంచి వాయువు, తేమ విడుదలవుతాయి. దీనివల్ల త్వరగా మొలకెత్తుతాయి.

మొలకెత్తిన ఉల్లిపాయలు, వెల్లుల్లి మాటేమిటి?

ఉల్లిపాయలు, వెల్లుల్లి మొలకెత్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

ఉల్లిపాయలు, వెల్లుల్లి సాధారణంగా బంగాళ దుంపల కంటే సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారని ప్రొఫెసర్ మార్టిన్ చెప్పారు. ఎందుకంటే ఇవి మొలకెత్తినా బంగాళ దుంపలంత ప్రమాదకరంగా ఉండవు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)