కోక్ తాగి, ఫ్రైస్ తింటే మైగ్రేన్ తగ్గుతుందా? ఏమిటీ ‘మైగ్రేన్ మీల్’? ఇది ఎంతవరకు పనిచేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రూత్ క్లెగ్
- హోదా, హెల్త్ అండ్ వెల్‌బీయింగ్ రిపోర్టర్
బ్రిటన్‌లో కోటి మందికి పైగా ప్రజలు పార్శ్వ నొప్పి (మైగ్రేన్)తో బాధపడుతున్నారు. ఈ నొప్పి భవిష్యత్తును తారుమారుచేయగలదు, కెరీర్‌ను అంతం చేయగలదు, మన ప్రపంచం కుచించుకుపోయేలా చేయగలదు.
అందుకే ఏదైనా చిట్కా మైగ్రేన్‌ని నయం చేస్తుందని కానీ నివారిస్తుందని కానీ ఎవరైనా చెబితే చాలామంది ఆ చిట్కాను ట్రై చేసి చూద్దాం అనుకుంటారు.
మైగ్రేన్ నొప్పికి చికిత్సలు ఉన్నప్పటికీ నివారణ మాత్రం లేదు. డాక్టర్లు సూచించిన మందులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు పనిచేయవు. ఈ నొప్పితో బాధపడేవారికి సులభమైన పరిష్కారమేదీ లేదు.
ఈ నొప్పినుంచి ఉపశమనం పొందడానికి కొందరు సొంత మార్గాలు వెతుక్కుంటారు. ఐస్ ప్యాక్ వేసుకోవడం, స్మూతీ తాగుతూ వేడి నీటిలో కూర్చోవడం, ముఖంపై వేడి గాలి తగిలేలా చేయడం వంటివి ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇప్పుడొక కొత్త చిట్కా వైరల్ అయింది. అదే ‘మెక్‌మైగ్రేన్ మీల్’.
ఫుల్ ఫ్యాట్ కోక్, సాల్ట్ ఫ్రైస్‌ను కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం ఉంటుందంటూ చాలామంది టిక్‌టాక్‌లో పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఫుల్ ఫ్యాట్ కోక్, సాల్ట్ ఫ్రైస్ వీరంతా మైగ్రేన్ మీల్‌గా పేర్కొంటున్నారు.
ఈ చిట్కాల వెనుక ఏదైనా సైన్స్ ఉందా? ఈ ఆహారం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది?
ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన నిక్ కుక్.. మైగ్రేన్ వచ్చినప్పుడు చిన్న బ్యాగ్ నిండా ఔషధాలు తీసుకెళ్తారు.
"నొప్పి తగ్గడానికి నేను ఏదైనా చేస్తాను" అని ఆయన చెప్పారు.
"మైగ్రేన్‌తో బాధపడుతూ వారానికి ఐదురోజులు పనిచేయాల్సి వస్తే.. ఆ నొప్పి తగ్గడానికి మీరు ఏదైనా చేస్తారు" అని ఆయన అన్నారు.
నిక్ కంటి చుట్టూ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, ఆయన కనుగుడ్డు నలిగిపోతున్నట్లు అనిపిస్తుంది. "ఆ సమయంలో కోక్‌లోని కెఫీన్, చక్కెర సహాయపడతాయి" అని ఆయన చెప్పారు.
"మైగ్రేన్ వస్తుందని నేను ముందే గ్రహిస్తాను, నా చూపు గజిబిజిగా అనిపిస్తే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉందని అర్థం, అలాంటప్పుడు ఈ చిట్కా పనిచేస్తుంది" అని ఆయన అన్నారు.
మైగ్రేన్ నొప్పిని నివారించడానికి రోజూ ఆయన తీసుకునే అమిట్రిప్టిలైన్ మాత్రలు వేసుకోకుండా కేవలం కోక్ తాగడం వల్ల నొప్పి తగ్గదని ఆయన చెప్పారు.
రోజూ తాను తీసుకునే మందులు నొప్పిని కొంతవరకు కంట్రోల్‌లో ఉంచుతాయని అన్నారు.


ఫొటో సోర్స్, Kayleigh Watson
చిప్స్‌పై ఉండే ఉప్పుతో మైగ్రేన్ తగ్గుతుందా?
కొన్నేళ్లుగా దీర్ఘకాలిక మైగ్రేన్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల కేలీ వెబ్‌స్టర్ చిప్స్‌పై ఉండే ఉప్పు వల్ల తనకు ఆ నొప్పి తగ్గుతుందని చెప్పారు.
"ఇది నొప్పిని తగ్గిస్తుంది కానీ, శాశ్వత నివారణ కాదు" అని ఆమె అన్నారు.
"మైగ్రేన్ అనేది ఒక సంక్లిష్టమైన నాడీ సంబంధిత పరిస్థితి. దీనిని ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే కొంచెం కెఫిన్, ఉప్పు, చక్కెరతో నయం చేయలేం" అని చెప్పారు.
కేలీ చాలా రకాల మందుల కాంబినేషన్‌ను వాడారు. ఆమె పాదాలను వేడి నీటిలో ఉంచడం, తల వెనుక భాగంలో మెత్తటి వస్త్రాన్ని పెట్టుకోవడం, ఆక్యూపంక్చర్, కప్పింగ్ థెరపీ వంటివి ప్రయత్నించారు. కానీ అవేవీ పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆమెకు ఉపశమనం కలిగించిన చికిత్సలలో ఒకటి మెడికల్ బొటాక్స్. ఆమె తల, ముఖం, మెడలో డజన్ల కొద్దీ ఇంజెక్షన్లు ఉన్నాయి. మైగ్రేన్‌కు బొటాక్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ ఇది నరాల నుంచి విడుదలయ్యే నొప్పి సంకేతాలను అడ్డుకుంటుందని నమ్ముతారు.
సాధారణ తలనొప్పి కొద్దిసేపే ఉంటుంది. పారాసిటమాల్ వంటి మాత్ర వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది.
కానీ రోజుల తరబడి ఉండే మైగ్రేన్ తలనొప్పి అలా కాదు. మెడ నొప్పి, తిమ్మిరి, గజిబిజిగా కనిపించడం, మాట తడబాటు, కండరాల కదలికలపై ప్రభావం వంటి లక్షణాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Kayleigh Webster
వేల ఏళ్ల కిందటే మైగ్రేన్
ప్రాచీన ఈజిప్షియన్లు కూడా మైగ్రేన్‌తో బాధపడేవారని క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటి పుర్రెలు సూచిస్తున్నాయి.
మైగ్రేన్ నొప్పికి వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ అది ఎందుకొస్తుందో కచ్చితమైన కారణం మాత్రం ఇప్పటికీ తెలియలేదు.
మెదడు చుట్టూ ఉన్న రక్త నాళాలు, నరాల కణజాలాలలో నొప్పి గ్రాహకాలు తప్పుగా పనిచేయడం వల్లే ఆ నొప్పి వస్తుందని భావిస్తున్నారు. ఏదో తప్పు జరిగిందని తప్పుడు సంకేతాలను మెదడుకు పంపుతాయి. కానీ కొంతమందికి అతి సున్నితమైన నాడీ వ్యవస్థ ఎందుకు ఉంటుందో మనకు తెలియదు. అది కొన్ని విషయాలకే ఎందుకు స్పందిస్తుంది, మిగతావాటికి ఎందుకు స్పందించదు అన్నది కూడా స్పష్టంగా తెలియదు.
ప్రతి ఏడుగురిలో ఒకరికి మాత్రమే ఈ నొప్పి ఎందుకు వస్తోంది. వీరికి కచ్చితంగా ఊరటనిచ్చే చికిత్స ఏది అన్న దానిపై తగినంత పరిశోధన జరగలేదని నిపుణులు అంటున్నారు.
మైగ్రేన్ చికిత్సల నిపుణుడైన జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ కే కెనిస్ మాట్లాడుతూ.. ‘మెక్‌మైగ్రెయిన్ మీల్’లో నొప్పి నివారించడానికి సహాయపడే అంశాలు ఉన్నప్పటికీ, "మెక్‌డొనాల్డ్స్" మైగ్రేన్ మందులు తయారుచేసే కంపెనీకాదు, అదొక రెస్టారెంట్ మాత్రమేనన్నారు.
"కోక్‌లోని కెఫిన్ నరాల కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఆ అంతరాయం కొందరికి ఇలా నొప్పి నివారణిగా సానుకూలంగా పనిచేస్తుంది" అని డాక్టర్ కెనిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కెఫిన్‌తోనూ మైగ్రేన్’
మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడానికి కోక్ వంటి కెఫిన్ కలిగిన శీతలపానీయాలను ఉపయోగించకూడదని డాక్టర్ కెనిస్ హెచ్చరించారు.
"ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో మరింత తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు" అని డాక్టర్ కెన్నిస్ చెప్పారు.
ఇక చిప్స్‌పై ఉండే ఉప్పు వంటి ఇతర పదార్థాలు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయని ఆమె వివరించారు. కానీ మైగ్రేన్‌పై సోడియం ప్రభావాలను ఇప్పటివరకూ పరీక్షించలేదని అన్నారు.
ఫాస్ట్ ఫుడ్ తరచుగా అల్ట్రా-ప్రాసెస్ అయివుంటుంది. కాబట్టి ఆరోగ్యదాయకం కాదు. అంతేకాకుండా అందులో అధిక స్థాయిలో టైరమైన్ ఉంటుంది. ఇది చాలా ఆహారాలలో సాధారణంగా కనిపించే సహజ సమ్మేళనం. వాస్తవానికి ఇది తీవ్రమైన మైగ్రేన్‌కి కారణమవుతుందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Eloise Underwood
‘ఏ చిట్కా నాకు పనిచేయదు’
ఎలోయిస్ అండర్వుడ్‌కి సోషల్ మీడియాలో కనిపించే సత్వర ఉపశమనం కలిగించే చిట్కాలేవీ పనిచేయవు.
ఈమె దీర్ఘకాలిక మైగ్రేన్ బాధితురాలు. ఏడేళ్లుగా "మ్యాజిక్ కాక్‌టెయిల్(ఔషధాల సమ్మేళనం)" కోసం వెతుకుతున్నారు. వేడినీటిలో పాదాలను పెట్టమని సిఫార్సు చేయడాన్ని (నిపుణులు సిఫార్సు చేయలేదు,ప్రమాదకరమైనది కావచ్చు). వేడి కాఫీ తాగడం (కెఫిన్ వల్ల మైగ్రేన్ రావొచ్చు). వివిధ నొప్పి తగ్గించే వైబ్రేటింగ్ పరికరాలను ఉపయోగించడం చేశారు. కానీ ఇవేవీ అంతగా ప్రభావం చూపలేదు.
"మన నిరాశను క్యాష్ చేసుకునే వీడియోలు ఆన్‌లైన్‌లో చాలా ఉన్నాయి" అని ఎలోయిస్ వివరించారు.
ఆమె చాలా ఉద్యోగాలు మానేయాల్సి వచ్చింది.ఎందుకంటే ఆఫీస్ వాతావరణంలో వెలుతురు, శబ్దం కారణంగా మైగ్రేన్ వచ్చేది. ఇటీవల ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేయడం కూడా మానేశారామె. ఇప్పుడు పెళ్లికి ఉపయోగించిన పువ్వులను ఎండబెట్టి, ఫ్రేమ్ చేసే వ్యాపారాన్నితన ఇంటి నుంచే ప్రారంభించారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్(ఎన్‌ఐహెచ్ఆర్) కింగ్స్ క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీలో న్యూరాలజిస్ట్ అయిన ప్రొఫెసర్ పీటర్ గోడ్స్‌బై మాట్లాడుతూ... ఏళ్ల తరబడి నిధుల కొరత తర్వాత జరుగుతున్న పరిశోధనలో ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయని అన్నారు.
గెపాంట్స్ అనే మందులు మైగ్రేన్ రావడానికి ముందు నొప్పి గ్రాహకాలను నిరోధించి నొప్పి తీవ్రం కాకుండా తగ్గిస్తాయని ఆయన చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
జీవనశైలి మార్పులు కూడా మార్పును కలిగిస్తాయని ప్రొఫెసర్ గోడ్స్‌బై వివరించారు. ఇది బోరింగ్‌గా అనిపించవచ్చు, కానీ ముందు "మీ మెదడును జాగ్రత్తగా చూసుకోండి" అని ఆయన అన్నారు.
"మీ శరీరం చెప్పేది వినండి - టిక్‌టాక్ చెప్పేది కాదు, అదే నా సలహా" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిక్ సరిగ్గా అదే చేస్తున్నారు. ఆయన కొన్ని కోక్, సాల్టీ ఫ్రైస్ తింటున్నప్పటికీ, తనకు మైగ్రేన్ రాకుండా ఉండడానికి తన జీవనశైలిని మార్తుకున్నారు.
"నేను మద్యం తాగను, వాతావరణం చల్లగాఉన్నా కూడా నేను సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను, ఎక్కువగా ఆవేశపడను" అని ఆయన అన్నారు.
కుటుంబంతో బయటకు వెళ్లినప్పుడు మనం తీసుకేళ్లే సగం వస్తువులు మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆయన అన్నారు.
ఇటీవలి ఒక బ్యాచిలర్ పార్టీలో నిక్ తన, తన స్నేహితుల జీవితాల మధ్య తేడా గమనించారు.
"వారు రాత్రంతా మేల్కొని తెల్లవారుజాము వరకు తాగుతూ ఉన్నారు," అని నిక్ చెప్పారు.
"నేను నా సొంత దిండు, ఆపిల్స్, అరటిపండ్లు, వీటాబిక్స్, నాకు అవసరమైన ఏవైనా చిరుతిళ్లు తీసుకుని వచ్చాను. ఎందుకంటి బాగా ఆకలేసినా కూడా మైగ్రేన్ వస్తుంది.
"నేను అర్ధరాత్రిలోపే పడుకుంటాను. నా గురించి నా స్నేహితులకు తెలుసు. ఫరవాలేదు, ఎందుకంటే నేను నా జీవితాన్ని ఇలాగే గడపాలి." అని నిక్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














