అబార్షన్ వరకూ వెళ్లకుండా గర్భనిరోధానికి ఉన్న ఆప్షన్లు ఏంటి, మీకు ఏది తగినదో తెలుసుకోవడం ఎలా?

మహిళల ఆరోగ్యం, మహిళలు, గర్భస్రావం, అబార్షన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ దేశం పీఆర్
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌లో ఏటా 11 లక్షల నుంచి 12 లక్షల అబార్షన్లు జరుగుతున్నాయని అధికారిక నివేదికలు చెబుతుంటే.. అసలు సంఖ్యలో ఇది కేవలం 10 శాతం మాత్రమేనని, 90 శాతం అబార్షన్లు గుట్టుగా జరుగుతున్నాయని అనధికారిక నివేదికలు చెబుతున్నాయి.

లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, భారత్‌లో 2015లో కోటిన్నర అబార్షన్లు జరిగాయి. ఈ 10 ఏళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది.

ఈ అబార్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ఆసుపత్రులలో లేదా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని ఓ అంచనా.

అబార్షన్ అనేది చట్టరీత్యా నేరం అనే అపోహతో మిగిలిన 75 నుంచి 80 శాతం అబార్షన్లు అసురక్షితమైన వాతావరణంలో జరుగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గర్భ నిరోధక మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

అవగాహన లేకపోవడం

గర్భం రాకుండా నివారించగలిగే అనేక ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి గురించి అవగాహన లేక, చాలామంది అబార్షన్ చేయించుకుంటున్నారు. గర్భస్రావం సమయంలో మహిళ చాలా రక్తం కోల్పోతుంది.

కేవలం అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్‌ను నెలకి రెండు, మూడుసార్లు వాడటం వల్ల కూడా రకరకాల దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నారు.

లైంగిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, లైంగిక జీవితం గురించి మాట్లాడటంపై విముఖత, దాని గురించి నలుగురిలో చర్చించే అవకాశం లేకపోవడం వంటివి రకరకాల అనర్థాలకు దారితీస్తాయి.

ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక యువత, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

అసలు గర్భాన్ని నివారించడానికి ఎలాంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుంటే, గర్భస్రావం వరకు వెళ్లకుండా నివారించవచ్చు.

మహిళలు తమ శరీరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, వారికి ఏ గర్భ నిరోధక పద్ధతులు అనువుగా ఉంటాయో నిపుణుల ద్వారా తెలుసుకొని, వాటిపై అవగాహన పెంచుకోవాలి.

కండోమ్స్

ఫొటో సోర్స్, Getty Images

కండోమ్..

ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నవారు కండోమ్ వాడటం ఉత్తమం. ఎందుకంటే, అందుబాటులోని గర్భనిరోధక ఆప్షన్లలో ఇవి మాత్రమే హెచ్ఐవీ, హెపటైటిస్ బీతో సహా ఇతర లైంగిక వ్యాధులను నివారిస్తాయి. ఇవి వాడటం వల్ల ఒకరి స్రావాలు ఇంకొకరి స్రావాలతో కలవకుండా ఉంటాయి.

పురుషులు వాడే కండోమ్, మహిళలు వాడే కండోమ్ వేరుగా ఉంటాయి. చాలామందికి పురుషులు వాడే కండోమ్‌ల గురించే తెలిసి ఉంటుంది. వీటితో మహిళలకు ఇబ్బంది అనిపిస్తే మార్కెట్లో కే-వై జెల్లీ అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగిస్తే సంభోగ సమయంలో అధిక రాపిడి లేకుండా ఉంటుంది.

కానీ, కండోమ్‌తో సమస్య ఏంటంటే వాడటం సరిగ్గా తెలియకపోతే చిరిగిపోవచ్చు. అప్పుడు గర్భం దాల్చే అవకాశం, ఒకరి నుంచి ఒకరికి లైంగిక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే అది వాడే ముందు దాని గురించి తెలుసుకోవాలి. అంతేకాదు, స్పెర్మిసిడిల్ జెల్లీ వాడితే కూడా గర్భం రాకుండా నివారించవచ్చు.

 అబార్షన్‌లు

ఫొటో సోర్స్, Getty Images

గర్భనిరోధక మాత్రలు

పిల్లలు ఇప్పుడే వద్దు అనుకునే మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడొచ్చు. అవి వాడుతున్నంత కాలం కచ్చితంగా పిల్లలు కలగరు. ఎందుకంటే, ఇవి మహిళల్లో అండం విడుదల కాకుండా ఆపుతాయి. ఈ మాత్రల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రిరాన్ అనే రెండు రకాల హార్మోన్లు ఉంటాయి.

రుతుక్రమం సరిగ్గా లేనివారు, రక్తహీనత ఉన్నవారు, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యే మహిళలు, ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (నెలసరికి ముందు హార్మోన్ల ప్రభావం వల్ల బాగా చిరాకుగా ఉండి, ప్రతి చిన్న విషయానికి బాధపడే లక్షణం) ఉన్నవారు… ఇలా రెండు హార్మోన్లూ కలిపి ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడితే ఈ సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద.. ప్రభుత్వం గ్రామాల్లో మాలా ఎన్, మాలా డి అనే మాత్రలు ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకే పంపిణీ చేస్తుంది. ఇవి కాకుండా ఎన్నో ఇతర ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మందుల దుకాణంలో కొనుక్కోవచ్చు.

ఇవి నెలసరి వచ్చిన రోజు మొదలు పెట్టి 21 రోజుల పాటు వేసుకోవాలి. మిగిలిన 7 రోజులు వేసుకోవడానికి ఎరుపు రంగులో ఉండే ఐరన్ టాబ్లెట్లు ఉంటాయి. ఆ సమయంలో నెలసరి వస్తుంది. మళ్లీ నెల మళ్లీ మొదలు పెట్టాలి.

బాలింతల కోసం..

ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ కలిసి ఉన్న మాత్రలను రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్నవారు, 35 ఏళ్ల పైబడిన వారు, పొగ, ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారు, మైగ్రేన్ సమస్య, కేన్సర్, అధిక బరువు ఉండేవారు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పిల్లలకు పాలిచ్చే మహిళలు వేసుకోకూడదు.

తక్కువ మోతాదులో హార్మోన్లు ఉండే రకరకాల గర్భ నిరోధక మాత్రలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ప్రొజెస్టిరాన్ మాత్రమే ఉండే 'మినీ పిల్' కూడా అందుబాటులో ఉంది. ఇవి బాలింత మహిళలు వేసుకోవచ్చు.

ఈ మధ్య ప్రభుత్వం అసలు ఏ హార్మోనూ లేని ఒక గర్భనిరోధక మాత్రను అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. దాని పేరు 'సహేలి' లేదా ఛాయా. ఇది అన్ని వయసుల మహిళలూ వేసుకోవచ్చు.

మొదటి మూడు నెలలు వారానికి రెండుసార్లు వేసుకోవాలి. ఆ తర్వాత నుంచి వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య సమస్యలుంటే జాగ్రత్త..

ఏవైనా లైంగిక వ్యాధులు ఉన్నవారు, పీసీవోఎస్ సమస్య ఉన్నవారు, టీబీ ఉన్నవారు నిపుణుల సలహా తీసుకుని మాత్రమే గర్భనిరోధక మాత్రలు వాడాలి.

మందులు నోటి ద్వారా వేసుకోవడం ఇష్టం లేని వారి కోసం చర్మం పైన వేసుకునే పాచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి పొట్ట లేదా భుజం లేదా వీపు పైన అతికించుకోవచ్చు. నెలలో ఒక వారం పాటు అతికించుకుంటే సరిపోతుంది.

గర్భం దాల్చకుండా ఉండటానికి ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతరా అనే ఇంజెక్షన్‌లో డీఎంపీఏ అనే హార్మోన్ ఉంటుంది. ఇది వాడాలనుకుంటే, ప్రతి మూడు నెలలకోసారి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

అన్ని వయసుల మహిళలు ఇది వేసుకోవచ్చు. దీంతో నెలసరి సమయంలో రక్తస్రావం కూడా తగ్గుతుంది. కేన్సర్, లివర్, కిడ్నీ సమస్యలుంటే ఈ ఇంజెక్షన్ వేసుకోకూడదు. ఇది ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందవచ్చు.

ఇంప్లాంట్..

సబ్ డెర్మల్ ఇంప్లాంట్స్ అంటే చిన్న కర్రలా ఉండి హార్మోన్ విడుదల చేసే ఇంప్లాంట్‌ను మోచేతి చర్మం కింద పెడతారు. ఇవి మూడు నుంచి ఐదేళ్ల పాటు గర్భం రాకుండా నివారిస్తాయి. తర్వాత తీయించేసుకోవాలి.

ఇంట్రా యుటరిన్ డివైస్

తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం మూడేళ్లు గ్యాప్ ఉండాలి. ఆ సమయంలో గర్భ సంచిలో 'కాపర్ టీ' పెట్టించుకోవడం ఉత్తమం. అది మూడు నుంచి ఐదేళ్లు పని చేస్తుంది.

మెరీనా అనే డివైజ్ ఉపయోగిస్తే పదేళ్ల వరకు పిల్లలు కలగరు.

పిల్లలు చాలు అనుకున్నపుడు వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ వంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం ఉత్తమం. మగవారు వ్యాసెక్టమీ చేయించుకుంటే చాలా తక్కువ సమయంలో గాయం మానిపోతుంది.

ఇంప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

అత్యవసర పరిస్థితుల్లో..

గర్భం రాకూడదంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ కూడా వేసుకోవచ్చు.

శారీరకంగా కలిసినపుడు ఏ గర్భ నియంత్రణ పద్ధతీ పాటించకుండా 72 గంటలలోపు పిల్ వేసుకోవాలి. కానీ, ఇది అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన పిల్.

తరచుగా వేసుకుంటే అనేక నెలసరి, గర్భసంచి సమస్యలు, రక్తహీనత వంటివి తలెత్తుతాయి.

కాబట్టి మహిళలు, వారి భాగస్వాములు కలిసి ఆలోచించుకొని వారికి తగిన గర్భ నియంత్రణ పద్ధతిని ఎంచుకోవాలి.

అయితే, ఇవన్నీ మనం మన సౌకర్యాల కోసం కనిపెట్టుకున్న పద్ధతులు.

సహజంగా పిల్లలు కలగకుండా ఉండాలంటే నెలసరి వచ్చే ముందు మూడు రోజులు, నెలసరి అయిపోయాక మూడు రోజులు మాత్రమే శారీరకంగా కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు కూడా కండోమ్ లాంటి బ్యారియర్ పద్ధతిని ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.

(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)