నీలం-జీలం: ఈ ప్రాజెక్టును ధ్వంసం చేసిందన్న పాక్ ఆరోపణలపై భారత్ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టును భారత్ ధ్వంసం చేస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపించింది.
'భారత సాయుధ దళాలు నీలం-జీలం జల ప్రాజెక్టుపై దాడి చేశాయి' అని పాకిస్తాన్ మిలటరీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి బుధవారం(మే 7) ఆరోపించారు.
"జల విద్యుత్ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రమాదకరం" అని ఆయన అన్నారు.
భారత్ చేసిన ఈ దాడిలో, హైడ్రాలిక్ వ్యవస్థ గేట్లు, రక్షణ యూనిట్ దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.
నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్నారన్న పాకిస్తాన్ ఆరోపణలను భారత్ గురువారం(మే 8) తోసిపుచ్చింది.
ఈ ఆరోపణలు ‘పూర్తిగా కల్పితం’ అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం అభివర్ణించారు.
"ఇది పూర్తిగా కల్పితం, పచ్చి అబద్ధం. అలాంటి ఆరోపణలు భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టార్గెట్ చేసుకోవడానికి ఒక సాకు అయితే, తరువాత జరిగే పరిణామాలకు నిస్సందేహంగా పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత వహించాలి" అని ఆయన అన్నారు.
"భారతదేశం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ఆ స్థావరాల వివరాలను, దాని ఖచ్చితమైన స్థానాలను బుధవారం(మే 7) తెలియజేశాం'' అని మిస్రీ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
60 మీటర్ల ఎత్తులో ఉండే నౌసారీ డ్యామ్
నీలం-జీలం హైడ్రో ప్రాజెక్ట్ నీలం నదిపై ఉంది. ఇది పాకిస్తాన్ పాలిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌కు ఈశాన్యంగా 41 కిలోమీటర్ల దూరంలో ఉంది .
ఈ నదిని భారతదేశంలో కిషన్‌గంగా అని పిలుస్తారు.
నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టుపై నిర్మించిన నౌసారీ ఆనకట్ట 60 మీటర్ల ఎత్తు, 160 మీటర్ల పొడవు ఉంటుంది. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 969 మెగావాట్లు.
ప్రపంచంలోని విద్యుత్ ప్లాంట్లను ట్రాక్ చేసే గ్లోబల్ డేటా పవర్ ఇంటెలిజెన్స్ సెంటర్ ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణం 2008లో ప్రారంభమైంది. ఇది 2018లో ఉత్పత్తిని ప్రారంభించింది.
ఇది దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం ప్రాంతానికీ విద్యుత్తు సరఫరా చేయగల సామర్థ్యం దీనికి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా 50 వేల కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టు ఒక నది ప్రవాహంతో నడిచే ప్రాజెక్టు. దీనికి ఎక్కువ నీటి నిల్వ అవసరం లేదు. నది చాలా వేగంగా ప్రవహించే చోట ఈ సాంకేతికత ఉపయోగిస్తారు.
దీని రిజర్వాయర్ సామర్థ్యం 10 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఈ ఆనకట్ట సెకనుకు 280 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆనకట్ట 90 శాతం భూగర్భంలో ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ.50 వేల కోట్లని పాకిస్తాన్ వార్తాపత్రిక ‘ది డాన్’ తెలిపింది.
నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. దీని ద్వారా జీలం నది నుంచి వచ్చే వరదలను కూడా నియంత్రిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
'సానుభూతి పొందేందుకు పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది'
ప్రపంచవ్యాప్తంగా సానుభూతి పొందడానికి నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టుకు నష్టం కలిగించారనే ఆరోపణను ఒక సాధనంగా పాకిస్తాన్ భావిస్తోందని కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ వ్యాఖ్యానించారు.
"ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా, ప్రధాన సమస్య నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. బాలాకోట్ లాగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక కారణాన్ని వెతుకుతోంది. దీనిద్వారా సొంత దేశంలో తనను తాను శక్తివంతమైనదిగా పాకిస్తాన్ చూపించుకోగలదు" అని ఆయన అన్నారు.
"ఆనకట్ట విషయం చూసుకుంటే, ఒకటి లేదా రెండు పౌండ్ల బాంబు పడటం వల్ల ఒక చిన్న గొయ్యి ఏర్పడుతుంది. ఆనకట్టకు పెద్ద నష్టం జరగదు" అని ఆయన అన్నారు.
ఇది పాకిస్తాన్ పెద్ద ప్రాజెక్ట్ అని, చైనా కూడా ఈ ప్రాజెక్టులో చాలా డబ్బు పెట్టుబడి పెట్టిందని ఏకే బజాజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 7న ముజఫరాబాద్‌లో రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న భారత్
నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి ముజఫరాబాద్ దాదాపు 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. మే 7న భారత్ ముజఫరాబాద్‌లోని రెండు ప్రదేశాలపై దాడి చేసింది.
‘పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ప్రాంతాలను సైన్యం లక్ష్యంగా చేసుకుంది’’ అని భారత రక్షణ శాఖ బుధవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది.
''షావాయి నాలా ఉగ్రవాద శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. ఇది నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది" అని భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు.
"ఇది లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం. 2025 ఏప్రిల్ 22న పహల్గాంపై, 2024 అక్టోబర్ 24న గుల్మార్గ్‌పై, 2024 అక్టోబర్ 20న సోన్‌మార్గ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఇక్కడి నుంచే శిక్షణ పొందారు" అని ఆమె చెప్పారు.
"సైద్నా బిలాల్ క్యాంప్ జైషేమొహమ్మద్‌కు పట్టున్న ప్రాంతం. ఇది ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అటవీప్రాంతంలో మనుగడసాగించగలగడం వంటివాటి శిక్షణకు కూడా కేంద్రంగా ఉండేది" అని ఆమె తెలిపారు.
'షావాయి నాలాలో ఉన్న బిలాల్ అనే మసీదును లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మసీదుపై ఏడు దాడులు జరిగాయి'' అని పాకిస్తాన్ ప్రతినిధి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














