పాకిస్తాన్‌తో ఘర్షణలో భారత యుద్ధ విమానాలు కూలిపోయాయా అనే ప్రశ్నకు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఏం చెప్పారంటే

భారత్, పాకిస్తాన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానాలను కోల్పోవడానికి సంబంధించిన ప్రశ్నలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమాధానమిచ్చారు.

బ్లూమ్‌బర్గ్ టీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. 'విమానం కూలిపోయిందా లేదా అనేది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు, కానీ అది ఎందుకు జరిగిందనేదే ముఖ్యం' అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, ఆరు విమానాలను కూల్చేశామన్న పాకిస్తాన్ వాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు.

''జెట్‌లను కూల్చేశారా లేదా అనేది కాదు, వాటిని ఎందుకు కూల్చేశారనేదే ముఖ్యమని నేను భావిస్తా'' అని సీడీఎస్ అన్నారు.

అయితే, విమానాల సంఖ్య గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు.

‘షాంగ్రి-లా డైలాగ్ 2025’లో పాల్గొనడం కోసం సీడీఎస్ అనిల్ చౌహాన్ సింగపూర్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన బ్లూమ్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మే నెల ప్రారంభంలో, భారత త్రివిధ దళాల ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ ''మనం పోరాటంలో ఉన్నాం, నష్టాలు కూడా అందులో ఒక భాగం'' అని అన్నారు.

భారత్ - పాకిస్తాన్ ఘర్షణల సమయంలో ఒకటి కంటే ఎక్కువ భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పలుమార్లు చెప్పింది.

అయితే, భారత్ ఈ వాదనలను తిరస్కరించింది.

భారత సైన్యం, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సైనికులతో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

జనరల్ అనిల్ చౌహాన్ ఇంకా ఏమన్నారు?

ఈ నెలలో పాకిస్తాన్‌తో నాలుగు రోజులపాటు జరిగిన సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానం కూల్చివేతకు గురైందా అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌ను అడిగారు.

బ్లూమ్‌‌బర్గ్ టీవీ ఈ ఇంటర్వ్యూలోని ఒక నిమిషం ఐదు సెకన్ల భాగాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన ఒకటి కంటే ఎక్కువ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోంది, దీనిని ధ్రువీకరించగలరా అని బ్లూమ్‌బర్గ్ టీవీ జర్నలిస్ట్ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌ను ప్రశ్నించడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.

ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ''జెట్ కూలిపోయిందా లేదా అనేది ముఖ్యం కాదు, అసలు అది ఎందుకు జరిగిందనేది ముఖ్యం'' అన్నారు.

''కనీసం ఒక్కటైనా కూల్చేశారా, అదైనా నిజమా?'' అని ఆ జర్నలిస్ట్ మరోసారి అడిగారు.

దీనికి జనరల్ అనిల్ చౌహాన్ స్పందిస్తూ, ''ఇక్కడ మంచి విషయం ఏంటంటే, మా వ్యూహాత్మక తప్పులను మేం గుర్తించగలిగాం. వాటిని సరిదిద్దుకున్నాం. రెండు రోజుల తర్వాత వాటిని అమలు చేశాం. ఆ తర్వాత మా జెట్లన్నింటినీ మోహరించాం, సుదూర లక్ష్యాలను టార్గెట్ చేశాం'' అన్నారు.

''ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చెబుతోంది, అది నిజమేనా?'' అని ఆ జర్నలిస్ట్ మరోసారి అడిగారు.

ఈ ప్రశ్నకు జనరల్ అనిల్ ప్రతిస్పందిస్తూ, "అది పూర్తిగా తప్పు. అయితే నేను చెప్పినట్లుగా, ఇదంత ముఖ్యం కాదు. జెట్‌లు ఎందుకు కూలిపోయాయి, ఆ తర్వాత మేం ఏం చేశామన్నదే కీలకం. అది మాకు చాలా ముఖ్యం'' అన్నారు.

ఇంతకుముందు, ఆర్మీ ఏం చెప్పింది?

మే 7న, భారత్ దాడికి ప్రతీకారంగా ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది.

ఆ తర్వాత, ''పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆరు ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేసిందని, వాటిలో కొన్ని ఫ్రాన్స్‌లో తయారైన రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి'' అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

''ఇప్పటి వరకూ ఐదు ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్స్, మూడు రఫేల్, ఒక Su-30, ఒక MiG-29, ఒక హెరాన్ డ్రోన్‌ను కూల్చివేసిటన్లు నేను మీకు ధ్రువీకరించగలను'' అని వార్తా సంస్థ రాయిటర్స్ షేర్ చేసిన వీడియోలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరి అన్నారు.

అయితే, ఈ వాదనలపై భారత్ స్పందించలేదు, మే 11న పాకిస్తాన్‌తో ఘర్షణ గురించి త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్, డీజీఏవో(ఎయిర్ ఆపరేషన్స్) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డీజీఎన్‌వో(నేవల్ ఆపరేషన్స్) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, నేవీ నుంచి మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద మీడియా సమావేశం నిర్వహించి, 'ఆపరేషన్ సిందూర్' గురించి వివరాలు తెలియజేశారు.

ఈ సమావేశంలో రఫేల్‌ను కూల్చివేసిందన్న పాకిస్తాన్ వాదనలకు సంబంధించిన ప్రశ్నకు ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ, ''మనం పోరాటంలో ఉన్నాం, నష్టాలు కూడా అందులో ఒక భాగమే. మీరు అడగాల్సింది ఏంటంటే, మనం మన లక్ష్యాలను సాధించామా? ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే టార్గెట్‌ను సాధించామా అని. దానికి సమాధానం అవును'' అని ఆయన అన్నారు.

''నిర్దేశిత లక్ష్యాలను సాధించాం, మన పైలట్లందరూ తిరిగొచ్చేశారు, అంతవరకూ మాత్రమే చెప్పగలను'' అన్నారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

దేశంలోనూ ప్రతిపక్షాల ప్రశ్నలు..

యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

భారత్ - పాకిస్తాన్ ఘర్షణపై సమగ్ర సమీక్షకు ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ మొత్తం వ్యవహారంపై వివరణాత్మక నివేదికను అందజేయాలని కాంగ్రెస్ కోరుతోంది.

భారత్ ఎన్ని విమానాలను కోల్పోయిందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మే 17న ఎక్స్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను అడిగారు.

సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

''1999 జూలై 29న, అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తండ్రి, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కె.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కార్గిల్ రివ్యూ కమిటీ వేశారు'' అని ఆయన రాశారు.

సింగపూర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇచ్చిన సమాచారం తర్వాత, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అలాంటి చర్య తీసుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)