‘రక్షణ ప్రాజెక్టులు సకాలంలో చేతికి రావని తెలిసినా ఒప్పందాలపై సంతకాలు చేస్తారు’ అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రక్షణ రంగానికి చెందిన కీలకమైన వ్యవస్థల కొనుగోలు, వాటి డెలివరీల్లో జరుగుతోన్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ గురువారం దేశీయ రక్షణ రంగంపై కొన్ని గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, డిఫెన్స్ ప్రాజెక్టులేవీ సరైన సమయానికి పూర్తి అవ్వట్లేదని అన్నారు. దేశీయ రక్షణ రంగం ఒప్పందాలకు చెందిన కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించారు.
భారత వైమానిక దళం చాలా కాలంగా మిలిటరీ హార్డ్‌వేర్ కొరతతో ఇబ్బంది పడుతోంది. అత్యాధునిక స్టెల్త్ విమానాలు కూడా లేవు.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల స్వదేశీయంగా అయిదో తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ల ఉత్పత్తిని ఆమోదించింది. వీటిని తయారు చేయడం, సైన్యంలో మోహరించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
''గడువులోగా పనిని పూర్తి చేస్తామని ఆర్డర్లు తీసుకున్న వ్యక్తులు కచ్చితమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సకాలంలో పని పూర్తవ్వదు అనిపిస్తే ముందే చెప్పేస్తే కనీసం ప్రత్యామ్నాయాలు చూసే అవకాశం ఉంటుంది'' అని రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ వార్తా చానెల్ ఎన్డీటీవీతో అన్నారు.
భారత్, పాకిస్తాల మధ్య ఇటీవల నెలకొన్న ఘర్షణ వాతావరణంతో భారత్‌లో రక్షణ సన్నాహాలను తీవ్రతరం చేయడం గురించి చర్చలు ఊపందుకున్నాయి.
భారత సన్నాహాలను మరింత వేగవంతం చేయాలనే కోణంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలను చూడాలంటూ నిపుణులు అంటున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏమన్నారు?
ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదని గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక వ్యాపార సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.
''అవి సకాలంలో డెలివరీ కావనే సంగతి ఒప్పందంపై సంతకం చేసే సమయంలోనే అర్థం అవుతుంది. కానీ, తర్వాతి సంగతి తర్వాత చూద్దాం అనుకొని వాటిపై సంతకం చేస్తాం. ఇలా సహజంగానే ప్రక్రియ పక్కదారి పడుతుంది. టైమ్ లైన్ పాటించడం ఒక పెద్ద సమస్య. నాకు తెలిసి ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. పూర్తి చేయలేని హామీలు ఇవ్వడం ఎందుకు?
మేకిన్ ఇండియా గురించి మాత్రమే కాకుండా 'డిజైన్ ఇన్ ఇండియా' గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. భారత్‌లోనే డిజైన్ చేసి వాటిని వినియోగంలోకి తెచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అన్నారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సంస్థతో 2021లో ఒప్పందం కుదుర్చుకున్న 83 తేజస్ ఎంకే 1ఎ తేలికపాటి యుద్ధ విమానాల డెలివరీలో ఆలస్యం జరిగిన నేపథ్యలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.
70హెచ్‌టీటీ-40 అనే ట్రైనర్ విమానాల కోసం కూడా హెచ్‌ఏఎల్‌తో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా షెడ్యూల్ చేశారు.
భవిష్యత్‌లో ఏం జరుగనున్నా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇదే లక్ష్యంతో మనం సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 10 ఏళ్లలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తుండొచ్చు. కానీ, ఈరోజు మనకు కావాల్సినదే మన నేటి అవసరం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏం అంటున్నారు?
కాంట్రాక్టు మొదలైన తర్వాత, ప్రాజెక్టును 36 నుంచి 40 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రతీ రక్షణ రంగ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంటారని బీబీసీతో రక్షణ రంగ నిపుణులు రాహుల్ బేడీ చెప్పారు.
''ప్రతీ కాంట్రాక్టు 12 దశల్లో సాగుతుంది. ప్రతీ దశలోనూ కొంత ఆలస్యం, అవాంతరాలు ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్టులు పూర్తవ్వడానికి సగటున 7 నుంచి 10 ఏళ్లు సమయం తీసుకుంటాయి'' అని ఆయన వివరించారు.
ఇటీవలే ఆమోదం పొందిన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)ను ఉదాహరణగా చూపిస్తూ, 2035లో దీని మొదటి ప్రోటోటైప్ వస్తుందని, వీటి ఉత్పత్తికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు. అంటే ఈ విమానాలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి 13 ఏళ్లు పడుతుంది. అది కూడా అంతా సవ్యంగా సాగితే అని ఆయన అన్నారు.
భారత వైమానిక దళం 2018-19లో 114 ఫైటర్ జెట్ల కోసం ప్రతిపాదనలు పంపిందని, కానీ నేటికీ ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆన్నారు. దీని ప్రకారం చూస్తే, ఎయిర్ చీఫ్ మార్షల్ బాధను అర్థం చేసుకోవచ్చని రాహుల్ బేడీ చెప్పారు.
''ఆపరేషన్ సిందూర్‌లో, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. భారత విమానాలు కూలిపోయాయంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు రాగా, భారత్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, భారత వైమానిక దళం తమ సంసిద్ధతను అంచనా వేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు'' అని రాహుల్ బేడీ అభిప్రాయపడ్డారు.
రక్షణ రంగ కొనుగోళ్లలో జరిగిన మరో ఆలస్యం గురించి చెబుతూ రాఫెల్‌ను ఆయన ఉదహరించారు. రాఫెల్ కాంట్రాక్టు చర్చలు 2007-08లో మొదలైతే, 2016లో వాటికి గ్రీన్ సిగ్నల్ లభించిందని, 2018లో రాఫెల్ విమానాల డెలివరీ మొదలైందని ఆయన చెప్పారు.
ఏదైనా సామగ్రిని దేశీయంగా తయారు చేయలేకపోతే, నేటి అవసరాలకు తగినట్లుగా వాటిని బయటి నుంచి కొనుగోలు చేయాలనేది ఎయిర్ చీఫ్ మార్షల్ మాటల్లోని ఆంతర్యం అని రాహుల్ బేడీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత సైన్యం బలం ఎంత?
'గ్లోబల్ ఫైర్ పవర్' వెబ్‌సైట్ ప్రకారం, 2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12.
భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది.
4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు 1.5 లక్షల సాయుధ వాహనాలు,100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి.
దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి.
భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం ఉంది.
2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి.
భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి.
వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు.
భారత నౌకాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు.
రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి.
వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్‌మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి.
భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














