శర్మిష్ఠ పనోలీ: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అరెస్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు, మమతా బెనర్జీ వీడియో షేర్ చేస్తూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Social Media/janasena/fb
'ఆపరేషన్ సిందూర్' విషయంలో ఒక కమ్యూనిటీకి సంబంధించిన మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలతో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్ఠ పనోలీని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ పోలీసులు గుర్‌గావ్‌లో ఆమెను అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ అరెస్టును ధ్రువీకరించారు.
''ఆపరేషన్ సిందూర్ విషయంలో బాలీవుడ్ నటుల మౌనంపై శర్మిష్ఠ ఒక వీడియోను అప్‌లోడ్ చేశారని, ఆ సమయంలో ఒక మతంపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు'' అని కోల్‌కతా పోలీసు వర్గాలు బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ప్రభాకర్ మణి తివారీకి తెలిపాయి.
శర్మిష్ఠ పనోలీని గుర్‌గావ్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, ట్రాన్సిట్ రిమాండ్‌పై కోల్‌కతాకు తీసుకెళ్లి శనివారం అలీపుర్ కోర్టులో హాజరుపరిచారు.
న్యాయస్థానం శర్మిష్ఠను జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

తన అరెస్టును వ్యతిరేకిస్తూ శర్మిష్ఠ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. శర్మిష్ఠ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
న్యాయవాది షమీముద్దీన్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, ''కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించే ముందు, సోషల్ మీడియా పోస్టులు చేసేందుకు వాడారని ప్రాసిక్యూషన్ చెబుతున్న ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వస్తువులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలియజేశాం'' అన్నారు.
''కోర్టు మా పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్ పోలీస్ కస్టడీ కోరగా, న్యాయస్థానం తిరస్కరించింది. నిందితురాలిని జూన్ 13 వరకు జుడీషియల్ కస్టడీకి పంపించింది'' అని చెప్పారు.
అయితే, పోలీస్ వాహనంలోకి ఎక్కేముందు, ''ప్రజాస్వామ్య దేశంలో నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు'' అంటూ శర్మిష్ఠ నినాదాలు చేస్తున్నట్లుగా ఉన్న 'వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్' వీడియో వైరల్ అవుతోంది.
శర్మిష్ఠ పుణెలోని సింబయాసిస్ లా స్కూల్‌లో బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
ఆమె అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా చాలామంది స్పందించారు.
పశ్చిమ బెంగాల్‌లో 'బుజ్జగింపు రాజకీయాలు' జరుగుతున్నాయని సువేందు అధికారి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో పనిచేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

ఫొటో సోర్స్, Social Media
అసలేం జరిగింది?
కోల్‌కతా పోలీసు వర్గాలు ప్రభాకర్ మణి తివారీకి తెలిపిన వివరాల ప్రకారం, శర్మిష్ఠ కొద్దిరోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.
ఈ పోస్టుకి సంబంధించి మే 15న, కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదు అందిన తర్వాత ఆమెకు నోటీసులు పంపించే ప్రయత్నం జరిగింది. కానీ, ఆమె తన కుటుంబ సభ్యులు సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారెంట్ జారీ అయింది, దాని ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు.
ఆ వీడియో వైరల్ కావడంతో పాటు దానిపై నిరసనలు వ్యక్తమవడంతో, శర్మిష్ఠ సోషల్ మీడియాలో బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ వివాదాస్పద వీడియో సహా సంబంధిత పోస్టులను తొలగించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ, ఈ కేసులో కోర్టు వారెంట్ జారీ చేసింది.
శర్మిష్ఠ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, అందులో ఆమె ఒక మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉందని, ఆ వీడియోపై అందిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
శర్మిష్ఠపై యూనివర్సిటీ చర్యలు
శర్మిష్ఠను 3 నెలలపాటు సస్పెండ్ చేసినట్లు సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రో చాన్సలర్ తెలిపినట్లు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' న్యూస్ పేపర్ పేర్కొంది.
''శర్మిష్ఠ వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చాయి. ఏ సింబయాసిస్ విద్యార్థికీ, ఏ భారతీయ పౌరుడికీ ఆమె ఉపయోగించిన భాష సముచితం కాదు'' అని యూనివర్సిటీ ప్రో చాన్సలర్ విద్యా యెరవేద్కర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
''యూనివర్సిటీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అనుసరించాం, క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించాం. ఆ విద్యార్థిని విద్య, ఇతర కార్యకలాపాల నుంచి 3 నెలల పాటు సస్పెండ్ చేశాం'' అని చెప్పారు.
లౌకికవాదం కొందరికి డాలు, మరికొందరిపై కత్తి కాకూడదు: పవన్

ఫొటో సోర్స్, ANI
శర్మిష్ఠ అరెస్టుపై పవన్ కల్యాణ్ ఏమన్నారు?
శర్మిష్ఠ అరెస్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్ పోలీసులను తప్పుబట్టారు. న్యాయంగా పనిచేయాలని ఆయన అన్నారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు, ''ఆపరేషన్ సిందూర్ సమయంలో, లా స్టూడెంట్ శర్మిష్ఠ మాట్లాడారు. ఆమె మాటలు విచారకరం, అవి కొందరిని బాధించాయి. ఆమె తన తప్పును అంగీకరించి, ఆ వీడియోను తొలగించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ విషయంలో సత్వర చర్యలు చేపట్టారు''.
''కానీ.. టీఎంసీ నాయకులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన బాధ గురించి ఏం చెబుతారు? మన విశ్వాసాన్ని 'గంధా ధర్మ్' (మురికి మతం) అన్నప్పుడు ఈ ఆగ్రహావేశాలు ఏమయ్యాయి? వాళ్లు క్షమాపణ చెప్పారా? వాళ్లను ఇంతే త్వరగా అరెస్టు చేశారా?'' అని పవన్ ప్రశ్నించారు.
తన పోస్టుతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియోను కూడా పవన్ కల్యాణ్ షేర్ చేశారు.
''దైవదూషణను ఖండించాల్సిందే. అయితే, లౌకికవాదం కొందరికి డాలు.. మరికొందరిపై కత్తి కాకూడదు. అది రెండువైపులా సమానంగా ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులారా, దేశం మొత్తం చూస్తోంది. అందరికీ న్యాయం సమానమే అనేలా పనిచేయండి'' అని ఆయన తన పోస్టులో రాశారు.
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా శర్మిష్ఠ అరెస్టుపై స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో 'బుజ్జగింపు రాజకీయాలు' జరుగుతున్నాయని ఆయన అన్నారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ, ''మహువా మొయిత్రా కాళీమాతపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ, ఏవైనా చర్యలు తీసుకున్నారా? టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్ మహాదేవ్‌పై చేసిన పోస్ట్‌పై ఏమైనా చర్యలు తీసుకున్నారా?'' అని ప్రశ్నించారు.
''ఫర్హాద్ హకీమ్‌పై చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సనాతనవాదులపై మాత్రమే చర్యలు తీసుకుంటారు. సనాతనవాదులను దూషించేందుకు ఇక్కడ లైసెన్స్ ఉంది'' అన్నారాయన.
శర్మిష్ఠ అరెస్టును పోలీస్ అధికారాల దుర్వినియోగంగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం.
''ఒకవేళ ఆ పోస్టుల కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని నిర్ధరించలేకపోతే, సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం అంతర్రాష్ట్ర అరెస్టులు చేయడం కచ్చితంగా పోలీస్ అధికారాలను దుర్వినియోగం చేయడమే'' అని ఆయన ‘ఎక్స్’లో రాశారు.

ఫొటో సోర్స్, ANI
అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ఏమంటున్నారు?
శర్మిష్ఠ వ్యాఖ్యల అనంతరం, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన నాయకుల్లో ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ కూడా ఉన్నారు.
ఆయన మే 14న, శర్మిష్ఠ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, ''ఈమె వ్యాఖ్యలను ఏ ముస్లిం కూడా సహించడు. దేశమంతా ఏకతాటిపై ఉన్న సమయంలో, అలాంటి భాష ఉపయోగించడం ద్వారా ఆమె దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని రాశారు.
శర్మిష్ఠను అరెస్టు చేయాలని ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను ఆ పోస్టులో డిమాండ్ చేశారు.
శర్మిష్ఠ అరెస్టు అనంతరం వారిస్ పఠాన్, ''ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. దేశమంతా ఏకతాటిపై ఉన్న సమయంలో, మీరు ఇలాంటి పదాలు వాడుతున్నారు, దానిని సహించబోం'' అన్నారు.
''ఆమెపై చాలా మంది ఫిర్యాదులు చేశారు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేం కూడా ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అలాంటి భాషను ఎవరూ సహించరు."
"ప్రస్తుతం, చర్యలు చేపట్టారు. మేం హింసకు వ్యతిరేకమని ఇప్పటికే చెప్పాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. కానీ, మరోసారి ఎవరూ ఇలా చేయకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి" అని వారిస్ పఠాన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














