మీకు ఇష్టమైన ఆరోగ్యకర పానీయాలు మీ దంతాలను పాడు చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నజానిన్ మోటామెది
- హోదా, బీబీసీ ప్రతినిధి
పండ్ల రసాల బాటిళ్లు, పెద్ద గ్లాసు నిండా ఆరెంజ్ జ్యూస్ లాంటివి సాప్ట్ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించవచ్చు.
కానీ, ఫ్రూట్ టీ సహా ఇలాంటి పానీయాలు దంతాలకు కోలుకోలేని నష్టం చేస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.
అయితే, మనం ఏమేం పానీయాలు తీసుకుంటాం, ఎప్పుడెప్పుడు తీసుకుంటాం వంటి అలవాట్లు డెంటల్ ఎరోజన్ (దంత క్షీణత)ను నివారించడంలో కీలకమని 20 ఏళ్ల అనుభవమున్న బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు.
నా దంతాలను పరీక్ష చేయించుకునేందుకు నేను అక్కడకు వెళ్లాను.


ఫొటో సోర్స్, Getty Images
దంత క్షయం Vs దంత క్షీణత
పళ్లు సరిగ్గా తోముకోకపోతే పళ్లు పుచ్చిపోతాయని, స్వీట్లు, చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్లు పాడవుతాయని చిన్నప్పటి నుంచే మనల్ని హెచ్చరిస్తుంటారు.
మనం తియ్యని పదార్ధాలు తిన్నప్పుడు నోటిలో మిగిలిపోయిన చక్కెరను పళ్లు, చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా తింటూ.. పళ్లకు రంధ్రాలు చేసి పుచ్చిపోయేలా చేస్తాయి. బ్యాక్టీరియా కారణంగా దంతాలు దెబ్బతినడాన్ని దంత క్షయం( డెంటల్ డెకే)గా వ్యవహరిస్తారు.
అయితే, అవి చిన్నవిగా ఉన్నప్పుడైతే, పూడ్చివేయొచ్చు.
కానీ, దంత క్షీణత(డెంటల్ ఎరోజన్) మరోలా ప్రభావం చూపుతుంది.
మనం తీసుకునే ఆహారం, తాగే ద్రవ పదార్ధాలలోని ఆమ్లాలు(యాసిడ్స్) దంతాల ఉపరితలంపై ఉండే ఎనామిల్‌పై దాడి చేస్తాయి.
అలా దాడి చేసినప్పుడు, దంతాల పైపొరలో ఉండే ఎనామిల్‌తో పాటు లోపల ఉండే డెంటైన్ కూడా క్రమేపీ ధ్వంసం అవుతూ ఉంటుంది.
దంతాల మృదువైన పొరలను ఎనామిల్ సంరక్షిస్తుంది. అయితే, యాసిడ్స్, షుగర్స్ నుంచి తరచూ వచ్చే ముప్పును ఎదుర్కోలేదు. ఒక్కసారి అది దెబ్బతినడం మొదలైతే దానిని పునరుద్దరించలేం.
"తీపి పదార్ధాలు, ఆమ్లాలు ఎక్కువగా ఉండే పండ్ల రసాలు అతిగా తీసుకోవడం వల్ల ఎనామిల్ దెబ్బతిని డెంటల్ ఎరోజన్ మొదలవుతుంది" అని డెంటల్ ఎరోజన్‌పై పరిశోధన చేసిన కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధన బృంద సభ్యుడు, డెంటల్ సర్జన్ పోలివియోస్ చారలంబౌస్ చెప్పారు.
"ఎనామిల్ కోత మొదలైనప్పుడు దానికి చికిత్స అందించకపోతే, దంతాలపై మచ్చలు ఏర్పడటం, గుంటలు పడటం, విరిగిపోవడం, పుచ్చిపోవడం, దంతాల అంచులు పాడైపోవడం, చల్లటి లేదా వేడి పదార్థాలు తగిలినప్పుడు జివ్వుమనడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దంతాలకు నష్టం జరగకుండా పానీయాలు ఎలా తాగాలి?
నేను ఆరెంజ్ జ్యూస్ మూడు రకాలుగా తాగాను.
ఒకటి చప్పరించడం.
రెండోది ఒక్కసారిగా నోటినిండా పోసుకుని తాగడం.
మూడోది నోట్లోనే పుక్కిట పట్టి కొంచెం కొంచెంగా తాగడం.
ఇలా తాగినప్పుడు నా నోట్లో ఆమ్లాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొలిచేందుకు డాక్టర్ పోలివియోస్ పీహెచ్ మీటర్ ఉంచారు.
దంతాలు సురక్షితంగా ఉండాలంటే పీహెచ్ మీటర్‌ను నోట్లో పెట్టినప్పుడు అది సహజంగా 7 పాయింట్లకు కొద్దిగా అటుఇటుగా చూపించాలి.
ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల పీహెచ్ స్థాయిలు 4.7 శాతానికి పడిపోయాయి. తిరిగి సాధారణ స్థాయికి రావడానికి 18 సెకన్లు పట్టింది.
జ్యూస్‌ను పుక్కిట పట్టినప్పుడు (10 సెకన్ల పాటు) నోట్లో ఆమ్లాల స్థాయి పెరిగింది. ఇది సాధారణ స్థాయికి రావడానికి ఐదు రెట్ల అధిక సమయం తీసుకుంది.
జ్యూస్ నోటిలో పుక్కిట పట్టి తాగినప్పుడు పీహెచ్ స్థాయి 3కి పడిపోయింది. అది సాధారణ స్థాయికి రావడానికి 30 రెట్ల అధిక సమయం పట్టింది.
ఆమ్లాలు ఉండే ద్రవ పదార్ధాలను తాగేటప్పుడు వాటిని నోటిలో ఎక్కువ సేపు ఉంచడం వల్ల దంతాలకు ఎక్కువ నష్టం జరిగినట్లు ఈ ప్రయోగంలో తేలింది.
"దంతాలను రక్షించుకోవాలనుకుంటే, ఆమ్లాలు ఉండే డ్రింక్స్ తాగేటప్పుడు వాటిని ఎక్కువ సేపు మీ నోట్లో ఉంచుకోకండి. అవి దంతాలను తాకకుండా స్ట్రా ద్వారా తాగడం ఉత్తమం. సాఫ్ట్ డ్రింక్స్ వల్ల దంతాలకు జరిగే నష్టాన్ని స్ట్రాలు తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది" అని డాక్టర్ చారలంబౌస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పానీయాల వల్ల దంతాలు ఎక్కువగా పాడవుతాయి?
ఆరెంజ్ జ్యూస్, కోలా, లస్సీ, ఫ్రూట్ టీ లాంటి వాటిలో ఎనామిల్‌ను ముంచడం ద్వారా.. ఈ నాలుగు రకాల డ్రింక్స్ దంతాలపై చూపించే నాలుగు వేర్వేరు ప్రభావాలను కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ టీమ్ పోల్చి చూసింది.
ఒక గంట తర్వాత, జరిగిన నష్టాన్ని గమనిస్తే.. అది ఈ నాలుగు రకాల పానీయాలు రెండు రోజుల పాటు రోజుకు మూడుసార్లు తాగితే జరిగే నష్టానికి సమానంగా ఉంది.
ఈ ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి: సాఫ్ట్ డ్రింక్స్ వల్ల డెంటల్ ఎరోజన్ బాగా ఎక్కువగా ఉంది. ఆరెంజ్ జ్యూస్, రెడ్ బెర్రీస్‌తో చేసిన టీ, చివరిగా లస్సీ లాంటివి దంతాలపై ప్రభావం చూపుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఆహారం ప్రభావం చూపుతుంది?
ఎసిడిక్ ఫుడ్స్, డ్రింక్స్ దంతాలను దెబ్బతీస్తాయి. మనం తినే అనేక పండ్లలో పరిమిత స్థాయిలోనైనా ఈ ఆమ్లాలు ఉంటాయి. ఇందులో సిట్రస్ ఫ్రూట్లలో మరీ ఎక్కువ. అరటిపండుతో పోలిస్తే నారింజ పండులో సి విటమన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కింది పదార్ధాల్లోనూ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి
- మిరపకాయలు
- టొమాటోలు, కెచప్
- పచ్చళ్లు
- పులియబెట్టిన ఆహారం
- వెనిగర్లు( ప్రత్యేకించి యాపిల్ సైడర్ వెనిగర్)
- ఫ్రూట్ స్క్వాష్
- లెమన్ వాటర్
- బెర్రీ టీ, జింజర్, లెమన్ టీ
- ఆల్కహాలిక్ డ్రింక్స్
- సాఫ్ట్ డ్రింక్స్
సమస్య ఏంటంటే.. వీటిలో అనేక ఆహార పదార్ధాలు, పండ్లు, పానీయాలు మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరం. అందుకే దంతాను రక్షించుకుంటూ వాటిని కాపాడుకోవడానికి తెలివైన మార్గాలున్నాయి.
అన్నం తిన్న తర్వాత కాల్షియం ఎక్కువగా ఉండే చీజ్, పెరుగు లేదా పాలు లాంటివి తీసుకోవడం వల్ల నోటిలో ఆమ్లాలు సాధారణ స్థాయికి వస్తాయి.
చక్కెర లేని చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల నోటిలో లాలాజలం ఊరుతుంది. అది దంతాలను సంరక్షిస్తుంది.
ఫ్రూట్ టీకి బదులుగా బ్లాక్ టీ తాగడం మంచిది. బ్లాక్ టీ వల్ల దంతాలకు జరిగే నష్టం తగ్గుతుంది.
సి విటమిన్ అధికంగా ఉండే పుల్లటి పండ్లకు బదులు మింట్, రోజ్‌మేరీ, ఇతర పానీయాలను తాగడం ఉత్తమం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














