‘పుతిన్ తీరుతో నిరాశ చెందా, కానీ దీనిని వదలను’ - బీబీసీతో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, బీబీసీ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పుతిన్ తీరుతో నిరాశ చెందా.అయినా నేను వెనక్కు తగ్గను అని ట్రంప్ బీబీసీకి చెప్పారు.
    • రచయిత, గ్యారీ ఓ'డోనోగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తీరుతో నిరాశ చెందానని, కానీ దీనిని వదలనని డోనల్డ్ ట్రంప్ బీబీసీతో జరిపిన ప్రత్యేక ఫోన్ సంభాషణలో చెప్పారు.

రష్యా నేతపై విశ్వాసముందా అని ప్రశ్నించగా ‘‘దాదాపుగా నేను ఎవరినీ విశ్వసించను’’ అని ఆయన బదులిచ్చారు.

యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపనున్నట్టు ప్రకటించి, 50 రోజుల్లోపు కాల్పుల విరమణకు అంగీకరించకపోతే రష్యాపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించిన కొన్నిగంటలకే ట్రంప్ మాట్లాడారు.

ఓవల్ కార్యాలయం నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఒకప్పుడు ‘‘అనవసర వ్యవస్థ’’గా అభివర్ణించిన నేటోకు మద్దతు ప్రకటించారు. సంస్థ ఉమ్మడి రక్షణ సూత్రాన్ని తాను సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది జూలైలో పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగింది.

పెన్సిల్వేనియా దాడికి ఏడాది

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో కిందటేడాది ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగి ఏడాది అయిన సందర్భానికి గుర్తుగా బీబీసీ అడిగిన ఇంటర్వ్యూకు డోనల్డ్ ట్రంప్ స్పందించి ఫోన్ చేశారు. ఆ సంభాషణ 20 నిమిషాలపాటు సాగింది.

ఈ హత్యాయత్నం నుంచి బయటపడటం మిమ్మల్ని ఏమైనా మార్చిందా అని ప్రశ్నించగా, దాని గురించి వీలైనంత తక్కువగా ఆలోచించడానికి ఇష్టపడతానని చెప్పారు.

"ఇది నన్ను మార్చిందా, లేదా అని ఆలోచించడం నాకు ఇష్టం లేదు" అని ఆయన అన్నారు. దాన్నే తవ్వుకుంటుంటే అది 'జీవితాన్ని మార్చగలదని' ట్రంప్ అన్నారు.

కొద్దిసేపటి కిందటే నేటో చీఫ్ మార్క్ రుట్టేను కలిసిన తరువాత ట్రంప్ ఇంటర్వ్యూలో ఎక్కువ సమయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తనకు ఏర్పడిన నిరుత్సాహాన్ని వివరించడానికి గడిపారు.

‘‘యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు నాలుగు వేర్వేరు సందర్భాలలో రష్యాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తాను భావించానని’’ ట్రంప్ చెప్పారు.

పుతిన్‌తో అన్నీ ముగిసిపోయాయా అని ట్రంప్‌‌ను అడగగా "ఆయనపై నాకు నిరుత్సాహం కలిగింది. కానీ ఆయనతో సంబంధం పూర్తిగా ముగించలేదు. అయినా ఆయనపై నిరుత్సాహంగా ఉన్నాను’’ అన్నారు.

‘‘పుతిన్‌ను ఎలా అడ్డుకుంటారు? ఈ రక్తపాతాన్ని ఎలా ఆపుతారు?’’ అని ప్రశ్నించగా, ‘‘మేం దానిపై పనిచేస్తున్నాం గ్యారీ’’ అన్నారు.

పుతిన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటోట)

''పుతిన్‌తో చర్చలు తరచుగా శాంతికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయి, ఆ తర్వాత ఆయన కీయేవ్‌లోని ఒక భవనాన్ని కూల్చేస్తారు" అని ట్రంప్ అన్నారు.

ఇటీవల వారాలలో యుక్రెయిన్ నగరాలపై రష్యా డ్రోన్లు, క్షిపణిదాడులను తీవ్రతరం చేసింది, ఇది రికార్డుస్థాయిలో పౌరుల మరణాలకు కారణమైంది. రష్యా తన పొరుగుదేశంపై 2022లో పూర్తిస్థాయి దండయాత్రకు దిగింది.

పుతిన్ కూడా తాను శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ యుద్ధానికి దారితీసిన ‘‘ప్రధాన కారణాలు’’ ముందుగా పరిష్కరించాల్సిందేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధానికి కీయేవ్, నేటో, సామూహిక పశ్చిమదేశాల నుంచి రష్యా భద్రతకు ఎదురైన బాహ్య ముప్పే కారణమని ఆయన వాదన.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

నేటోపై

ఆ తర్వాత మా సంభాషణ నేటో వైపు మళ్లింది, దీనిని ట్రంప్ ఒకప్పుడు 'కాలం చెల్లినది'గా పిలిచారు. కానీ ఇప్పుడది నిజం కాదంటున్నారాయన. ఎందుకంటే, నేటో దేశాలు 'తమ బిల్లులను తామే చెల్లిస్తున్నాయి' అన్నారు ట్రంప్.

వారి జీడీపీలో రక్షణ వ్యయాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించినందుకు నేటో నాయకులను ట్రంప్ ప్రశంసించారు, దీనిని 'అద్భుతం' అన్నారు. "అది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు" అన్నారు.

సమిష్టి రక్షణను ఇప్పటికీ నమ్ముతున్నానని, దీనర్థం చిన్న దేశాలు పెద్ద దేశాల నుంచి తమను తాము రక్షించుకోగలవన్నారు ట్రంప్.

జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల నాయకులు తనను, తన నిర్ణయాలను గౌరవిస్తారని ట్రంప్ అన్నారు. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికవడమనే విషయం చాలా ప్రతిభతో కూడినదిగా ప్రపంచ నాయకులు భావిస్తారని, ఇదే దానికి కారణమని ఆయన చెప్పారు.

ప్రపంచ నాయకులు మిమ్మల్ని పొగుడుతున్నారా అని అడిగినప్పుడు, ట్రంప్ బదులిస్తూ "వారు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు" అన్నారు.

ప్రపంచంలో యూకే భవిష్యత్తు గురించి ట్రంప్‌ను అడిగితే "గొప్ప ప్రదేశం, మీకు తెలుసా, నాకు అక్కడ ప్రాపర్టీ కూడా ఉంది" అన్నారు.

బ్రెగ్జిట్‌ను యూకే సద్వినియోగం చేసుకుందని మీరనుకుంటున్నారా? అని అడిగితే, ట్రంప్ 'లేదు' అని బదులిచ్చారు. "ఇది అలసత్వంగా ఉందనుకుంటున్నాను కానీ, దాన్ని సరిదిద్దుతున్నారని భావిస్తున్నా" అన్నారు.

యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌ గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. " ఆయన ఉదారవాది అయినప్పటి నేను చాలా ఇష్టపడతాను’’ అంటూ యూకే, యూస్‌ ఒప్పందాన్ని ప్రశంసించారు. యూకేతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆ దేశంతో ఒప్పందు కుదుర్చుకున్నానని చెప్పారు. ‘‘మీ పోటీదారుల విషయంలోనైనా, యూరోపియన్ యూనియన్ విషయంలోనైనా ఇప్పటివరకు అలాంటి ఒప్పందం చేయలేదు’’ అని వివరించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూకేలో పర్యటించాలని ట్రంప్ అనుకుంటున్నారు. ఆ పర్యటనలో ఏం సాధించాలని కోరుకుంటున్నారు అని అడగగా ‘‘ యూకేలో మంచి సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కింగ్ చార్లెస్‌ 'గ్రేట్ జెంటిల్‌మెన్' ఆయనకు తగిన గౌరవం చూపాలనేది నా అభిమతం’’

అమెరికా వలసలు

ఫొటో సోర్స్, Getty Images

వలసలు తగ్గాయా?

ఇక దేశీయ ఎజెండా గురించి ట్రంప్ మాట్లాడుతూ, తన కీలక ఎన్నికల వాగ్దానాలలో ఒకటైన అమెరికా-మెక్సికో సరిహద్దులో చొరబాటులను అరికట్టడంలో 'గొప్ప పని' చేశానని అధ్యక్షుడు అన్నారు. తన రెండో పదవీకాలం మొదటి నెలల్లో సరిహద్దులో చొరబాటులు రికార్డు స్థాయిలో తగ్గిపోయాయన్నారు.

‘‘నేను చేసిన వాగ్ధానాలకంటే ఎక్కువే చేశాను’’ అని ఆయన చెప్పారు.

ఇప్పుడు అమెరికాలో సరైన పత్రాలు లేని వలసదారులను, ముఖ్యంగా నేరస్థులను గుర్తించి వారిని త్వరగా బహిష్కరించడంపై దృష్టి సారించినట్లు ట్రంప్ చెప్పారు. ఎంతమంది వలసదారులనేది సంఖ్య ఇవ్వబోనని, వారిని ఎల్ సాల్వడార్‌తో పాటు ఇతర ప్రదేశాలకు పంపిస్తున్నట్లు చెప్పారు.

తన బహిష్కరణ విధానంలోని అంశాలను నిలిపివేయడానికి కొన్ని కోర్టులు తీసుకున్న చర్యల గురించి ట్రంప్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన చాలా తీర్పులను అప్పీల్ చేయగా, రద్దు చేసినట్లు తెలిపారు.

ట్రంప్ తన కొత్త పన్ను, వ్యయ బిల్లును ప్రశంసించారు, అది 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' అని అన్నారు.

అధ్యక్షుడిగా ప్రజలు తనను దేని కోసం గుర్తుంచుకుంటారని అడిగితే, ట్రంప్ 'అమెరికాను రక్షించడం' అన్నారు.

"అమెరికా ఇప్పుడు గొప్ప దేశం అనుకుంటున్నాను, అది ఏడాది కిందట మృత దేశం"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)