ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: చివరి క్షణాలలో ఇద్దరు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు?

ఎయిర్ ఇండియా పైలట్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విమానం ప్రధాన పైలట్ కె. సుమిత్ సబర్వాల్‌ (ఎడమ) కో పైలట్‌ క్లైవ్ కుందర్ (కుడి)

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన నెల రోజుల తరువాత ప్రాథమిక నివేదిక విడుదలైంది.

ఈ నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (AAIB) విడుదల చేసింది.

విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణను ఈ నివేదిక వెల్లడించింది. ఈ సంభాషణను కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా సేకరించారు. మరో పక్క ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక

‘ఎందుకు కట్ చేశావు?’

విమానం, అహ్మదాబాద్ నుంచి బ్రిటన్‌లోని గాత్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది.

ఆ విమానంలో ఏటీపీఎల్ లైసెన్స్ పొందిన కెప్టెన్ (పీఐసీ), సీపీఎల్ లైసెన్స్ పొందిన

కో-పైలట్, మరో పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.

విమానం ప్రధాన పైలట్ కె. సుమిత్ సబర్వాల్‌తోపాటు కో పైలట్‌గా క్లైవ్ కుందర్ వ్యవహరించారు.

పైలట్‌లిద్దరూ ముంబయికి చెందినవారు. వీరిద్దరూ ఒకరోజు ముందుగానే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రయాణానికి ముందు వారు తగినంత విశ్రాంతి తీసుకున్నారు.

విమాన ప్రమాద సమయంలో కో-పైలట్ విమానాన్ని నడుపుతుండగా, కెప్టెన్ పర్యవేక్షిస్తున్నారు.

అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన విమానం సుమారుగా 08:08:42 యూటీసీ (కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్) వద్ద గరిష్ఠంగా 180 నాట్స్ ఐఏఎస్(ఇండికేటెడ్ ఎయిర్‌స్పీడ్) గగనతల వేగానికి చేరుకుంది.

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెకన్ల వ్యవధిలో ఇంజిన్ 1, ఇంజిన్ 2లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్‌లు ఒకదాని తర్వాత మరోటి రన్(ఆన్) నుంచి కటాఫ్‌(ఆఫ్) మోడ్‌లోకి వెళ్లాయని నివేదిక పేర్కొంది.

అప్పుడు, ''పైలట్లలో ఒకరు ఎందుకు కటాఫ్ చేశావని మరొకరిని అడుగుతున్నట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లలో వినిపించింది. అందుకు మరో పైలట్, నేను చేయలేదని బదులిచ్చారు.'' అయితే, కాక్‌పిట్‌ సంభాషణలో ఏ మాటలు ఎవరివో నివేదికలో పేర్కొనలేదు.

08:08:52 యూటీసీ వద్ద, ''ఇంజిన్ 1 ఇంధన కటాఫ్ స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్‌కి మారింది. ఆ తర్వాత నాలుగు సెకన్లకు ఇంజిన్ 2 కటాఫ్ స్విచ్ కూడా కటాఫ్ నుంచి రన్ మోడ్‌కి మారింది'' అప్పటికి సమయం 08:08:56 అయింది.

అనంతరం, 9 సెకన్ల తర్వాత 08:09:05కి పైలట్లలో ఒకరు "మే డే.. మే డే .. మే డే" అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సంకేతాలు పంపారు.

ఆ తర్వాత అధికారులకు ఎలాంటి స్పందనా రాలేదు. ఆ కొద్దిసేపటికే, విమానం కూలిపోవడం కనిపించింది.

విమాన ప్రమాదం

ఇంతకీ ప్రమాదానికి కారణమేంటి?

ఎయిర్ ఇండియా విమానం ప్రాథమిక నివేదిక నుంచి దర్యాప్తు అధికారులు రెండు ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చారు.

మొదట, టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత, రెండు ఇంజిన్లలోని ఇంధన కట్-ఆఫ్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ స్థానానికి కదిలాయి, దీనివల్ల విమానం అకస్మాత్తుగా 180 నాట్ల వేగంతో ఆగిపోయింది.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, ఒక పైలట్ మరొకరిని ఇంజిన్‌ను ఎందుకు ఆపావని అడుగుతున్నారు. మరొకరు తాను చేయలేదని చెబుతున్నారు.

ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందా లేదా అరుదైన సాంకేతిక లోపం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

ఎయిర్ ఇండియా ఏం చెబుతోంది?

ఈ నివేదికపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది . 'ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని' దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని కంపెనీ తెలిపింది.

నివేదికలోని నిర్దుష్ట వివరాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) జులై 12, 2025న విడుదల చేసిన ప్రాథమిక నివేదిక అందినట్లు ధృవీకరిస్తున్నాం" అని ఆ ప్రకటన పేర్కొంది.

"నియంత్రణ సంస్థలతో సహా అన్ని సంబంధిత పార్టీలతో ఎయిర్ ఇండియా దగ్గరగా పనిచేస్తోంది. దర్యాప్తులో ఏఏఐబీ, ఇతర అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. దర్యాప్తు కొనసాగుతున్నందున, ఎటువంటి నిర్దుష్ట వివరాలపై వ్యాఖ్యానించలేం అలాంటి ప్రశ్నలన్నింటినీ ఏఏఐబీకి పంపమని అభ్యర్థిస్తున్నాం’’ అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)