బోయింగ్ 787 కూలిపోవడం ఇదే తొలిసారి... ఈ విమానాల తయారీలో నాణ్యతా లోపాలు ఉన్నాయా?

ఒక బోయింగ్ 787 విమానం కూలిపోవడం ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఒక బోయింగ్ 787 విమానం కూలిపోవడం ఇదే తొలిసారి.
    • రచయిత, జోనాథన్ జోసెఫ్స్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్.

ఇలా ఒక బోయింగ్ 787 విమానం కూలిపోవడం ఇదే తొలిసారి.

అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ ఈ మోడల్‌ను 14 ఏళ్ల క్రితం ఆవిష్కరించింది.

వంద కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన మోడల్‌గా ఇటీవలే ప్రశంసలు అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థల ఆధీనంలో 787 మోడల్ విమానాలు 1,175కు పైగా ఉన్నాయని ఆ సందర్భంగా బోయింగ్ కంపెనీ ప్రకటించింది.

అవి 3 కోట్ల గంటలకు పైగా ప్రయాణించి దాదాపుగా 5 లక్షల ట్రిప్స్‌తో వంద కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని వెల్లడించింది.

ఇప్పటికే తన 737 మోడల్ విమానాలు ప్రమాదాలకు గురవ్వడంతో పాటు పలు సమస్యలను అధిగమించడానికి సతమతమవుతున్న బోయింగ్ కంపెనీకి... ఈ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోవడం పెద్ద దెబ్బే అనే చెప్పాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ కంపెనీ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్‌కు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మరో అగ్నిపరీక్ష. ఈ ఉద్యోగ బాధ్యతలలో తొలి వార్షికోత్సవం చేసుకున్న ఆయనకు ఇదొక సవాలు.

తీవ్రమైన ఇబ్బందుల నేపథ్యంలో బోయింగ్ భవితవ్యంపై పలు ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ, ఆయా సమస్యలన్నీ పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.

బోయింగ్, 787 డ్రీమ్ లైనర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, లండన్ విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోయింగ్ విమానాల తయారీలో అనేక లోపాలున్నాయని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఆరోపించారు.

ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 ప్రత్యేకతలివే...

బోయింగ్ 787-8 మోడల్ 2014లో ఎయిర్ ఇండియా సంస్థలోకి వచ్చింది.

మొత్తం 256 సీట్ల బోర్డు దీని సొంతం

దీని పొడవు 57 మీటర్లు, వెడల్పు (రెండు రెక్కల కొనల మధ్య దూరం) 60 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు.

విమానాల తయారీలో సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని బోయింగ్ సంస్థపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి జాన్ బర్నెట్ పలు ఆరోపణలు గుప్పించారు. ఆ కంపెనీలో 32 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన 2017లో ఉద్యోగ విరమణ చేశారు. బోయింగ్‌పై దాఖలైన 'విజిల్ బ్లోయర్' దావాకు సంబంధించి పలు సాక్ష్యాధారాలను సమర్పించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే, 2024 మార్చి 9న తనకు తానే శరీరంపై గాయాలు చేసుకొని బర్నెట్ చనిపోయారు.

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత బోయింగ్ షేరు విలువ 4.32 శాతం పడిపోయింది.

ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో కూలిపోయిన బోయింగ్ 787 విమాన శకలం

తయారీ లోపాలపై ఆరోపణలు...

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో తయారుచేస్తున్నప్పుడు జాన్ బర్నెట్ అక్కడ క్వాలిటీ మేనేజర్‌గా ఉన్నారు.

ప్రొడక్షన్ లైన్‌లో తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న ఉద్యోగులు... నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న విడిభాగాలను ఉద్దేశపూర్వకంగానే విమానాలకు బిగించారని ఆయన 2019లో బీబీసీకి చెప్పారు.

విమానం ఆక్సిజన్ వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నాలుగు మాస్క్‌లలో ఒకటి పనిచేయదని బర్నెట్ హెచ్చరించారు. 787లో అమర్చిన ఎమర్జెన్సీ ఆక్సిజన్ వ్యవస్థను పరీక్షించినపుడు,25 శాతం విఫలమైందని చెప్పారు.

సౌత్ కరోలినాలో తయారీ ప్రారంభించిన తర్వాత విమానాలను త్వరగా తయారుచేయాలని కార్మికులపై ఒత్తిడి పెరిగిందని, అందుకే వారు అసెంబ్లీ ప్రాసెస్, రక్షణ వ్యవస్థల విషయంలో రాజీపడినట్లు ఆరోపించారు.

బర్నెట్ ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) చేపట్టిన సమీక్షలో... కొన్ని వాస్తవమేనని ధ్రువీకరించింది.

లోపాలున్న విడిభాగాలు, పరికరాలు కంపెనీ నుంచి కనిపించకుండా పోయాయని, తగిన చర్యలు తీసుకోవాలని బోయింగ్‌ను ఆదేశించింది.

బర్నెట్ ఆరోపణలను బోయింగ్ కంపెనీ ఖండించింది.

పంపిణీ సంస్థ కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను సరిగ్గా పంపించలేదని గుర్తించామని, వాటిని విమానాలకు అమర్చామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని నాడు (2017లో) స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, కొత్తగా తయారుచేసిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం గత ఏడాది జనవరి ప్రారంభంలో పోర్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే దాని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ (అత్యవసర ద్వారం) ఊడిపడిపోయింది.

ఇలా తయారీలో, భద్రతా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో విఫలమవుతోందని బోయింగ్‌పై గతంలోనే తీవ్రమైన ఆరోపణ ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)