అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉందా, నిపుణులు ఏమన్నారు?

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేక్ హోర్టన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది.

ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్‌లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు బీబీసీతో చెప్పారు.

బీబీసీ వెరిఫై చేసిన ఒక వీడియోలో విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.

విమానయాన నిపుణుడు జెఫ్రీ థామస్ మాట్లాడుతూ "నేను వీడియోను చూసినప్పుడు, చక్రాలు (అండర్ క్యారేజ్) ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్‌లు లోపలికి వెళ్లాయి" అని అన్నారు.

''ఇది వింతగా ఉంది. ఎందుకంటే విమానం పైకి లేవడానికి సాయం కోసం ఫ్లాప్‌లను సాధారణంగా టేకాఫ్ తర్వాత కొంత సమయం పాటు బయట ఉంచుతారు'' అని జెఫ్రీ అన్నారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వింగ్ ఫ్లాప్‌లు ( ఫైల్ ఫోటో)

'10 నిమిషాల తర్వాతే లోపలికి లాగాలి'

''చక్రాలు సాధారణంగా 10–15 సెకన్ల తర్వాత లోపలికి వెళ్తాయి. తర్వాత 10–15 నిమిషాలలో ఫ్లాప్‌లను నెమ్మదిగా లోపలికి లాగుతారు'' అని ఆయన అన్నారు.

మరో నిపుణుడు టెర్రీ టోజర్ మాట్లాడుతూ "వీడియోను చూసి చెప్పడం కష్టం, కానీ ఫ్లాప్‌లు విచ్చుకుని ఉన్నట్లు కనిపించడం లేదు. విమానం సరిగ్గా టేకాఫ్ కాలేకపోవడానికి అదే కారణం కావచ్చు" అని అన్నారు.

"ఫ్లాప్‌లను సరిగ్గా సెట్ చేయకపోతే, అది మానవ తప్పిదం కావచ్చు. కానీ, వీడియో దానిని నిరూపించేంత స్పష్టంగా లేదు" అని మాజీ పైలట్, బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ అయిన మార్కో అన్నారు.

ఎయిర్ ఇండియా విమానం

ఫొటో సోర్స్, EPA

భారత్‌కు యూకే నిపుణుల బృందం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేయడానికి యూకే నుంచి అధికారులు భారత్ వస్తున్నారు.

ఇండియాలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సాయం చేయడానికి సిద్ధమని తాము అధికారికంగా చెప్పినట్లు యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఏఏఐబీ) తెలిపింది.

విమానంలో బ్రిటిష్ పౌరులు ఉన్నందున, యూకే బృందానికి దర్యాప్తులో నిపుణుల హోదా ఇవ్వనున్నారు.

"మేం నిపుణుల బృందాన్ని ఇండియాకు పంపుతున్నాం. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి గురించి మేం బాధపడుతున్నాం" అని ఏఏఐబీ తెలిపింది.

అమెరికా నుంచి..

అమెరికా దర్యాప్తు అధికారులు కూడా భారత్ రానున్నారు.

యూఎస్ బృందానికి నాయకత్వం వహించనున్నట్లు, క్రాష్ దర్యాప్తుకు సహాయం చేయనున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) ఎక్స్‌లో తెలిపింది.

ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా భారత ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని పేర్కొంది.

కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. ఇది అమెరికాలో తయారైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)