ఇప్పటివరకు ఎయిర్ ఇండియా, బోయింగ్ విమానాలు ఎన్నిసార్లు ప్రాణాంతక ప్రమాదాలకు గురయ్యాయి?

ఫొటో సోర్స్, Chetan Singh
- రచయిత, జాస్మిన్ నిహలానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూన్ 12 నుంచి జూన్ 17 మధ్య వరకు ఎయిరిండియాకు చెందిన 83 విమానాలను రద్దయ్యాయని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ 83 సర్వీసుల్లో రద్దయిన 66 విమానాలు బోయింగ్ 787 రకానివే. ఇదే మోడల్ ఇటీవల అహ్మదాబాద్‌లో క్రాష్ అయింది.
ఈ విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయారు. ఈ దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత విషాదకర ప్రమాదంగా ఇది నిలిచింది.

242 ప్రయాణికులతో లండన్‌కు బయలు దేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం, అహ్మదాబాద్ సర్దార్ వల్లాభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలిపోయింది.
ఒక్క ప్రయాణికుడు తప్ప ఈ విమానంలో ఉన్న వారందరూ చనిపోయారు. మెడికల్ హాస్టల్‌పై ఈ విమానం కూలిపోవడంతో, మరణాల సంఖ్య మరింత పెరిగింది.
ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
మా విశ్లేషణ ప్రకారం గడిచిన 78 సంవత్సరాలలో ఎయిరిండియా విమానయాన సంస్థ 30కి పైగా ప్రమాదాలను ఎదుర్కొంది . వాటిలో 14 ప్రమాదాలు దారుణమైన విషాదాన్ని మిగిల్చాయి.
1985లో ఏఐ-182 విమాన ప్రమాదంలో 329 మంది చనిపోయారు. దీని తరువాత ఎయిరిండియా విమానయాన సంస్థకు రెండో భయానక ప్రమాదం అహ్మదాబాద్ ఘటనే.
భారత్‌లో బోయింగ్‌కు అతిపెద్ద కస్టమర్ ఎయిరిండియానేనని డీజీసీఏ తాజా డేటాలో తెలిసింది. దీని విమానశ్రేణిలో 54 బోయింగ్ విమానాలు ఉండగా, వాటిలో 28 విమానాలు 787 రకానికి చెందినవి.
దీని చౌక ధరల అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కూడా 48 విమానాలను నడుపుతోంది. వీటిలో 43 బోయింగ్ విమానాలే.
గత ఏడాది ఎయిరిండియా మరో 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది, వీటిలో 20 విమానాలు 787 రకానివే.
బోయింగ్ విమాన ప్రమాదాలు
అహ్మదాబాద్ ప్రమాదం జరిగినప్పటి నుంచి చాలా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి.
దీంతో, వాటిల్లో కొన్ని విమానాశ్రయాల్లోనే ఆగిపోవడం లేదా తిరిగి విమానాశ్రయానికి వెళ్లడం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వచ్చే ఎయిరిండియా విమానం మార్గమధ్యంలో కోల్‌కతాలోనే ఆగిపోవాల్సి వచ్చిందనే వార్తలు వచ్చాయి.
హాంకాంగ్ నుంచి దిల్లీ వస్తోన్న బోయింగ్ 787-8 విమానంలో కూడా పైలట్ సాంకేతిక సమస్య నెలకొన్నట్టు అనుమానించడంతో మధ్యలోనే వెనుదిరిగింది.
దిల్లీ నుంచి వడోదర కు వెళ్లాల్సిన మరో విమానం కూడా ల్యాండింగ్ గేర్ సమస్యతో వెనక్కి వచ్చేసింది.
ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో బోయింగ్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత ఏడాది ఒక్క నెలలోనే ఈ విమానాల తయారీ కంపెనీ బిలియన్ డాలర్లను కోల్పోయింది.
2018, 2019లో టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే రెండు 737 మ్యాక్స్ విమానాలు క్రాష్ అయ్యాయి. దానిలో ఒకటి ఇండోనేషియాలో జరిగింది. ఆ ప్రమాదంలో 189 మంది చనిపోయారు. ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందారు.
ఈ ప్రమాదాలకు కారణం సాఫ్ట్‌వేర్ లోపమని గుర్తించారు. ఫలితంగా 18 నెలల పాటు ఈ మోడల్ విమానాలను ఆపేశారు.
ఏవియేషన్ సేఫ్టీ సెక్యూరిటీ డేటాను ఆధారంగా చేసుకుని మేం జరిపిన విశ్లేషణలో 2014 నుంచి 2025 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణీకుల విమానాలలో కనీసం 40 ప్రాణాంతక ప్రమాదాలు జరిగాయి. అందులో 12 విమానాలు బోయింగ్‌వే.
అయితే, అహ్మదాబాద్ ప్రమాదం బోయింగ్ మార్క్యూ 787-8 డ్రీమ్ లైనర్ మొదటి ప్రాణాంతక ప్రమాదం. డ్రీమ్ లైనర్ కు గతంలోనూ ప్రమాదాలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు ఏవీ ఇంతటి ప్రాణాంతకం కాలేదు.
బోయింగ్ అన్ని మోడళ్లలో ఇప్పటి వరకు 2,500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిలో కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం విమాన ప్రయాణ భద్రతకు చెందిన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువ?
వాణిజ్య విమానాలలో ప్రాణాంతక ప్రమాదాల చారిత్రక డేటాను పరిశీలిస్తే, అవి 1970 1980 లలో చాలా సాధారణమైనవిగా చూపిస్తోంది.
అయితే, కాలక్రమేణా, విమానాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు ప్రాణాంతక ప్రమాదాల సంఖ్య తగ్గింది.
1970లో 68 లక్షల విమానాలే ఉండేవి. 2024 నాటికి విమానాల సంఖ్య 3.38 కోట్లకు చేరుకుంది.
విమానాల సంఖ్య పెరగడంతో, భయానక ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. 2024లో పదిలక్షల విమానాలకు గానూ ప్రమాదాల రేటు 0.12గా ఉంది.
విమాన ప్రయాణం ముగిసే సమయంలో అత్యంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు డేటా చెబుతోంది.

2015 నుంచి 2024 మధ్య కాలంలో కమర్షియల్ ఫ్లయిట్లకు జరిగిన ప్రమాదాల్లో 37 శాతం ల్యాండింగ్ సమయంలోనే జరిగాయి.
మొత్తం విమాన ప్రయాణ సమయంలో ల్యాండింగ్ అనేది కేవలం 1 శాతం సమయం మాత్రమే.
దీనికి భిన్నంగా మొత్తం ప్రయాణంలో క్రూయిజింగ్ (విమానం ఎక్కువ ఎత్తులో స్థిరమైన వేగంతో ప్రయాణించడం) అనేది 57 శాతం ఉండగా, ఈ దశలో 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














