బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్: విమానాలలో ఇదే అత్యంత సేఫ్ అంటారు, కానీ డౌట్లు కూడా ఎక్కువే...

డ్రీమ్ లైనర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, థియో లెగెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురై, 270 మంది మృతికి కారణమైన విమానం, బోయింగ్ కంపెనీ తయారు చేసే అత్యాధునిక, పాపులర్ ఫ్లైట్ మోడల్స్‌లో ఒకటి.

అంతేకాదు, ఈ విమానాన్ని ఆ కంపెనీ తయారు చేసే వాటిలో అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటిగా చెబుతారు.

టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత ఫ్లైట్ 171 ఎందుకు కూలిపోయిందో ఇంకా తెలియలేదు. దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకొని, ప్రమాద కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో కూలిన విమానం మోడల్: 787 డ్రీమ్‌లైనర్, ఇది మోడ్రన్ జనరేషన్‌కు చెందినది మాత్రమే కాదు, ఇంధనాన్ని ఆదా చేసే విమానం కూడా.

ఈ ప్రమాదానికి ముందు, 787 డ్రీమ్‌లైనర్‌ మోడల్స్ దాదాపు 15 సంవత్సరాలుగా ఎటువంటి పెద్ద ప్రమాదానికి గురికాలేదు, ఎవరూ చనిపోలేదు. గత పదిహేనేళ్లలో వంద కోట్లమందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లినట్లు ప్రకటించింది బోయింగ్. నేడు, ప్రపంచవ్యాప్తంగా 1100కు పైగా డ్రీమ్‌లైనర్లు సర్వీసులో ఉన్నాయి.

అయితే, 787 విమానం కూడా నాణ్యత విషయంలో సమస్యలను ఎదుర్కొంది. 787లో పని చేసిన విజిల్‌బ్లోయర్స్ (ఒక సంస్థ లోపల సమస్యలు లేదా తప్పులను బయటపెట్టే వ్యక్తి) దాని ప్రొడక్షన్‌లో లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

తీవ్రమైన లోపాలున్న విమానాలను కూడా ఎగరడానికి అనుమతించారని కొందరు ఉద్యోగులు ఆరోపించారు. అయితే, బోయింగ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమానాలు, బోయింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంవత్సరాల కృషి, బిలియన్ల డాలర్ల పెట్టుబడి ఫలితం బోయింగ్ 787 విమానం.

సోనిక్ క్రూయిజర్, 9/11 ప్రభావం

2009 డిసెంబర్‌లో ఒక ఉదయాన సియాటెల్ సమీపంలోని పైన్ ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఒక సరికొత్త విమానం బయలుదేరింది. మేఘావృతమైన ఆకాశంలోకి విమానం ఎగురుతుండగా జనం ఉత్సాహంగా వీక్షించారు. సంవత్సరాల కృషి, బిలియన్ల డాలర్ల పెట్టుబడి ఫలితం ఈ విమానమని బోయింగ్ పేర్కొంది.

2000ల ప్రారంభంలో, ఇంధన ధరలు పెరిగిపోతున్నవేళ 787 మోడల్ విమానాల తయారీకి ఆలోచనలు మొదలయ్యాయి. ఎక్కువ మైలేజ్ ఇచ్చే విమానాన్ని నిర్మించాలని బోయింగ్ నిర్ణయించుకుంది. మొదట్లో సంస్థకు వేరే ప్రణాళిక ఉంది.

''1990ల చివరలో సోనిక్ క్రూయిజర్ అనే వేగవంతమైన విమాన నిర్మాణంపై కంపెనీ దృష్టి ఉండేది’’ అని విమానయాన చరిత్రకారుడు షియా ఓక్లే చెప్పారు.

లేటెస్ట్ టెక్నాలజీతో నిండిన ఆ విమానం 250 మందిని మోసుకెళ్లగలదని, ధ్వని వేగం కంటే కాస్త తక్కువ వేగంతో ప్రయాణించగలదని భావించారు. సోనిక్ నిర్మాణంలో ఇంధనం ఖర్చు కంటే వేగంపైనే దృష్టి పెట్టారు.

''కానీ 9/11 దాడుల తర్వాత విమానయాన పరిశ్రమ మారిపోయింది. వేగవంతమైన సోనిక్ క్రూయిజర్ కాకుండా, అంతే సామర్థ్యమున్న చౌకైన, ఇంధనాన్ని ఆదా చేసే విమానం అవసరమని విమానయాన సంస్థలు బోయింగ్‌తో చెప్పాయి'' అని ఓక్లే తెలిపారు.

కాబట్టి బోయింగ్ సోనిక్ క్రూయిజర్ ఆలోచనను విరమించుకుని 787ను నిర్మించడం ప్రారంభించింది. ఇది విమానయాన సంస్థల పని విధానాన్ని మార్చింది. ప్రధాన విమానాశ్రయాలకు (హబ్ ఎయిర్ పోర్టులకు) వెళ్లడానికి భారీ విమానాలకు బదులుగానూ, తక్కువ రద్దీ ఉన్న నగరాల మధ్య నేరుగా ప్రయాణించడానికి చిన్న విమానాలను ఉపయోగించడం మొదలైంది.

ఎయిర్ బస్, బోయింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల మధ్య ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులను తీసుకెళ్లడానికి ఏ380 సూపర్‌జంబోను ఎయిర్ బస్ నిర్మించింది.

ఎయిర్‌బస్ ఏ380 vs బోయింగ్ 787

బోయింగ్ ప్రత్యర్థి అయిన యూరప్‌కు చెందిన ఎయిర్‌బస్ అదే సమయంలో భిన్నమైన మార్గాన్ని తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల మధ్య ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులను తీసుకెళ్లడానికి ఏ380 సూపర్‌జంబోను నిర్మించింది.

జాగ్రత్తగా పరిశీలిస్తే, బోయింగ్ ప్రణాళిక తెలివైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఎయిర్‌బస్ ఏ380 చాలా ఇంధనం అవసరమయ్యేది. 251 విమానాలు తయారు చేసిన తర్వాత 2021లో వాటి ప్రొడక్షన్‌ను నిలిపేశారు.

భవిష్యత్తులో విమాన ప్రయాణం ప్రధానంగా ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ), హీత్రూ (యూకే) లేదా నరిటా (జపాన్) వంటి పెద్ద ప్రధాన విమానాశ్రయాల ద్వారా (హబ్‌) జరుగుతుందని, అక్కడి నుంచే జనం విమానాలు మారాలనుకుంటారని ఎయిర్‌బస్ భావించిందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్, విమానయాన నిపుణుడు రిచర్డ్ అబౌలాఫియా అన్నారు.

‘‘ప్రజలు నేరుగా గమ్యస్థానానికే వెళ్లాలనుకుంటారని బోయింగ్ చెప్పింది. అది సరైన ఆలోచనే" అని రిచర్డ్ అభిప్రాయపడ్డారు

787 అనేది చాలా కొత్త రకం విమానం. తక్కువ బరువు ఉండటానికి అల్యూమినియంకు బదులుగా కార్బన్ ఫైబర్ వంటి పదార్థాలతో తయారైన మొదటి కమర్షియల్ ఫ్లైట్ ఇది.

జనరల్ ఎలక్ట్రిక్, రోల్స్ రాయిస్‌లకు చెందిన కొత్త ఇంజిన్‌లను కూడా ఇది ఉపయోగించింది. విమానంలో అనేక మెకానికల్, న్యూమాటిక్ వ్యవస్థల స్థానంలో తేలికైన విద్యుత్ వ్యవస్థలను వాడింది.

ఈ మార్పులన్నీ 787ను పాత 767 కంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యంగా ఉండేలా చేశాయని బోయింగ్ తెలిపింది. విమానంలో శబ్దం తగ్గిందని, నేలపై 60 శాతం తక్కువ శబ్దంతో ప్రయాణిస్తోందని చెప్పింది.

అత్యవసర ల్యాండింగ్‌లు, విమానంలో మంటలు

787 సర్వీసులోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంది. 2013 జనవరిలో బోస్టన్ విమానాశ్రయంలో వేచి ఉన్న 787 విమానంలో లిథియం అయాన్ బ్యాటరీ మంటల్లో చిక్కుకుంది. వారం తర్వాత, బ్యాటరీ వేడెక్కడం వల్ల మరొక విమానాన్ని జపాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో బోయింగ్ 787 విమానాలన్నీ నెలల తరబడి నిలిచిపోయాయి.

సమస్యను పరిష్కరించిన తర్వాత రోజువారీ విమానాలు సజావుగా తిరిగాయి కానీ, విమానాల ఉత్పత్తి సమస్యగానే ఉంది.

సీయాటెల్‌లోని దాని ప్రధాన కేంద్రానికి సుమారు 3200 కిలోమీటర్లు దూరంగా దక్షిణ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్‌లో బోయింగ్ ఒక కొత్త అసెంబ్లీ లైన్ (ఫిటింగ్ ఫ్యాక్టరీ)ని ప్రారంభించడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాంతంలో యూనియన్ సభ్యత్వ రేటు తక్కువగా ఉండటం, ప్రభుత్వం నుంచి లభించే మద్దతును సద్వినియోగం చేసుకోవడానికి కంపెనీ అక్కడ ఏర్పాటు చేసింది.

విజిల్‌బ్లోయర్, బోయింగ్ 787

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోస్టన్ విమానాశ్రయంలో వేచి ఉన్న 787 విమానంలో బ్యాటరీ మంటల్లో చిక్కుకోవడంతో దర్యాప్తునకు ఆదేశించారు.

విజిల్‌బ్లోయర్స్ ఆరోపణలు

ఫిటింగ్‌ను ప్రభావితం చేసేలా ఉన్న విమాన విడి భాగాలలోని లోపాలను బోయింగ్ 2019లో కనుగొంది. ఆ తర్వాత మరికొన్ని సమస్యలు రావడంతో సంస్థ దానిపై విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత కూడా లోపాలు బయటపడ్డాయి.

ఈ నేపథ్యంలో డెలివరీలు ఆలస్యం అయ్యాయి. 2021 మే నుంచి 2022 జులై వరకు, తరువాతి సంవత్సరం కూడా అదే పరిస్థితి.

కానీ, అత్యంత తీవ్రమైన ఆరోపణలు బోయింగ్ కంపెనీ ఉద్యోగుల నుంచి వచ్చాయి. వారిలో దక్షిణ కరోలినా 787 ఫ్యాక్టరీలో పనిచేసిన క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ ఒకరు. వీలైనంత త్వరగా విమానాలను ఉత్పత్తి చేయాలనే ఒత్తిడి వాటి భద్రతను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్యాక్టరీలోని విమాన భాగాలను ట్రాక్ చేయడానికి ఉద్దేశించిన కఠినమైన విధానాలను ప్లాంట్‌లోని వర్కర్లు పాటించ లేదని, ఇది నిర్మాణ లోపాలున్న భాగాలు పట్టుకోలేకుండా చేసిందని జాన్ బార్నెట్ 2019లో బీబీసీతో చెప్పారు.

ఉత్పత్తి తగ్గకూడదని కొంతమంది వర్కర్లు స్క్రాప్ బిన్‌ల నుంచి నిర్మాణ లోపాలున్న భాగాలను తీసుకొచ్చి, ఫిటింగ్ చేశారని ఆయన అన్నారు.

మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బోయింగ్ 787 మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్

ఎయిర్‌క్రాఫ్ట్ డెక్‌లకు నష్టం జరగొద్దని అసంపూర్ణంగా ఫిటింగ్ చేశారని బార్నెట్ అన్నారు. ఫిటింగ్ లోపాల కారణంగా విమానంలో సన్నని, పదునైన లోహపు ముక్కలు పడేవని, అవి కొన్నిసార్లు విమానంలో భారీగా తీగలున్న ప్రదేశాలకు చేరేవని ఆయన తెలిపారు.

ఈ వివరాలను అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ అయిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్ఏఏ)కు తెలియజేసినట్లు, వారు పాక్షికంగా దానిని ఒప్పుకున్నట్లు బార్నెట్ క్లెయిమ్ చేసుకున్నారు.

ఫ్యాక్టరీలో సరిగాలేని 53 విమాన భాగాలు కనిపించకుండా పోయాయని దర్యాప్తులో తేలింది. కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ డెక్‌ల కింద చిన్న లోహపు ముక్కలను కూడా ఎఫ్ఏఏ గుర్తించింది.

అయితే, ఈ సమస్యను కంపెనీ బోర్డు విశ్లేషించిందని బోయింగ్ ప్రకటించింది. అది విమాన భద్రత సమస్య కాదని నిర్ణయించినట్లు తెలిపింది.

ఆ తర్వాత, బోయింగ్ కొన్ని విడిభాగాలను తిరిగి డిజైన్ చేసింది.

"ఎఫ్ఎఫ్ఏ గుర్తించిన సమస్యలను పూర్తిగా పరిష్కరించామని, పునరావృతం కాకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యలను అమలు చేశాం" అని బోయింగ్ ప్రకటించింది.

విమానం

ఫొటో సోర్స్, Getty Images

'తీవ్రమైన ప్రమాదం జరగొచ్చు'

ఇప్పటికే 787 మోడల్ విమానాలు వినియోగంలో ఉన్నాయని, వాటిలో తీవ్రమైన ప్రమాదానికి దారితీసే లోపాలు ఉండొచ్చని బార్నెట్ ఆందోళన వ్యక్తంచేశారు.

787 విషయంలో సమయం వచ్చినపుడు ఏదైనా పెద్ద ఘటన జరగొచ్చని బార్నెట్ అభిప్రాయపడ్డారు. ' నా అంచనాలు తప్పు కావాలని కోరుకుంటున్నా' అని ఆయన అన్నారు.

2024 ప్రారంభంలో బార్నెట్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ సమయంలో బోయింగ్‌పై విజిల్‌బ్లోయర్ కేసులో ఆయన సాక్ష్యం ఇస్తున్నారు.

బార్నెట్ వాదనలు మరో మాజీ క్వాలిటీ మేనేజర్ సింథియా కిచెన్స్ ఆందోళనల మాదిరిగానే ఉన్నాయి. 2016లో బోయింగ్‌ ప్లాంట్‌లో ఉద్యోగానికి రిజైన్ చేశారు కిచెన్స్.

2011లో ఉత్పత్తి ఆలస్యం కాకూడదని క్వారంటైన్ బిన్‌ల నుంచి లోపాలున్న భాగాలను తీసుకొని, విమానాలలో ఉపయోగిస్తున్నారని ఆమె రెగ్యులేటర్స్‌కు ఫిర్యాదుచేశారు.

అంతేకాదు, ఈ వ్యవహారంపై చూసీచూడనట్లు ఉండాలని వర్కర్లకు చెప్పారని కిచెన్స్‌ చెప్పారు. లోహపు ముక్కలతో దెబ్బతిన్న వైర్లను విమానాలలో ఉపయోగిస్తున్నారని, ఇవి షార్ట్ సర్క్యూట్‌లకు కారణమవుతాయని ఆమె పేర్కొన్నారు.

బోయింగ్ ఈ వాదనలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. 2016లో కిచెన్స్‌ను పెర్ఫార్మెన్స్ ప్లాన్‌లో ఉంచుతున్నట్లు చెప్పిన తర్వాత ఆమె వెళ్లిపోయారని పేర్కొంది. ఆమె నాణ్యత సమస్యలపై కాకుండా వివక్ష, ప్రతీకారం కోసం బోయింగ్‌పై దావా వేశారని, కేసు కొట్టివేశారని కూడా పేర్కొంది.

నిరుడు, మూడవ విజిల్‌బ్లోయర్ సామ్ సలేపూర్, అమెరికా సెనేట్ కమిటీ ముందు హాజరయ్యారు.

బోయింగ్‌లో తాను గమనించిన భద్రతా సమస్యలను పరిష్కరించకపోతే, వందలమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు.

2020 చివరిలో బోయింగ్ 787పై పనిచేస్తున్నప్పుడు, ప్రొడక్షన్‌ను వేగవంతం చేయడానికి సంస్థ షార్ట్‌కట్‌లను ఉపయోగించిందని క్వాలిటీ ఇంజినీర్ అయిన సలేపూర్ అన్నారు. దీని కారణంగా, విమానాలలో లోపాలున్న భాగాలు అనేకం వాడారని, ఇన్‌స్టలేషన్‌ కూడా సరిగ్గా జరగలేదని ఆయన తెలిపారు.

చాలా విమానాల ప్రధాన భాగాల మధ్య జాయింట్లలో చిన్నచిన్న ఖాళీలు ఉన్నట్లు గుర్తించానని, వాటిని సరిదిద్దలేదని సలేపూర్ అన్నారు. ఇది విమానంలో సమస్యలకు దారితీస్తుందని, ప్రమాదాలను సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

వెయ్యికి పైగా విమానాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని సాలేపూర్ హెచ్చరించారు.

అయితే, 787 నిర్మాణంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అని బోయింగ్ తెలిపింది. అమెరికా ఎఫ్ఏఏ ఈ సమస్యలను పరిశీలించిందని, విమానాలు దీర్ఘకాలిక వినియోగం కోసం సురక్షితమైనవని నిర్ధరించిందని స్పష్టంచేసింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం, బోయింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం తయారై 11 సంవత్సరాలైంది.

ఒత్తిడిలో బోయింగ్

ముఖ్యంగా రెండు 737 మ్యాక్స్ మోడల్ విమానాలు క్రాష్‌ కావడం, మరొక తీవ్రమైన సంఘటన తర్వాత, సేఫ్టీ విషయంలో బోయింగ్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన సీఈవో కెల్లీ ఓర్ట్‌బర్గ్, భద్రత, నాణ్యత తనిఖీలను మెరుగుపరచడం ద్వారా నమ్మకం కలిగించే పనిలో ఉన్నారు.

గత 787 ఫెయిల్యూర్స్‌పై బోయింగ్ రాజీపడిందా? అదే ఇప్పటి భద్రతా ప్రమాదాల సమస్యలకు దారితీస్తోందా? అంటే, రిచర్డ్ అబౌలాఫియా కాదని అంటున్నారు.

"16 సంవత్సరాలు, 1200 జెట్‌లు, వంద కోట్లకు పైగా ప్రయాణికులు, ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అదొక అద్భుతమైన సేఫ్టీ రికార్డు" అని రిచర్డ్ అభిప్రాయపడ్డారు.

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం తయారై 11 సంవత్సరాలైంది.

అమెరికాలో ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ అనే సంస్థను బోయింగ్ విమానాల మాజీ విజిల్‌బ్లోయర్ ఎడ్ పియర్సన్ ప్రారంభించారు. ఇటీవలి ప్రమాదానికి ముందే 787 గురించి ఆందోళనలు వ్యక్తం చేసినట్లు ఫౌండేషన్ తెలిపింది.

"ఇది భద్రతా లోపం వల్ల జరిగిన ప్రమాదమే. మేం యాక్సిడెంట్ రిపోర్టులను పరిశీలించాం. నిబంధనలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాం" అని ఎడ్ పియర్సన్ అన్నారు.

పియర్సన్ లేవనెత్తిన ఒక సమస్య ఏమిటంటే, వాష్‌రూమ్ కుళాయిల నుంచి విద్యుత్ పరికరాలున్న ప్రాంతాలకు నీరు లీక్ అవుతోంది. కొన్ని 787 మోడళ్ల విషయంలో దీన్ని తనిఖీ చేయాలని 2023లో విమానయాన సంస్థలకు చెప్పింది ఎఫ్ఏఏ .

అయినప్పటికీ, ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం తెలియలేదు. సమస్య విమానంలోనా, విమానయాన సంస్థలోనా లేదా మరొకటా? అనేదానికి త్వరగా సమాధానాలు కనుగొనాలని నిపుణులు అంటున్నారు.

"ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమేమిటో మనకు తెలియదు" అని ఏవియేషన్ కన్సల్టింగ్ కంపెనీ లీహం ఎండీ స్కాట్ హామిల్టన్ చెప్పారు.

"కానీ, విమానం గురించి మనకు తెలిసినదాని ప్రకారమైతే, 787 ఎక్కేందుకు నేను వెనుకాడను" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)