పులిపిర్లు ఎందుకు వస్తాయి, వాటికి చికిత్స ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
పులిపిర్లు చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. చేతులు, కాళ్లు, ముఖంపై ఎక్కువ వస్తుంటాయి, కొంతమంది వాటిని ఎలాగైనా తొలగించుకోవాలని గిల్లుతూ ఉంటారు.
ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే పులిపిర్లు కూడా వైరస్ వల్లే వస్తాయని.
పులిపిర్లను ఇంగ్లిషులో వార్ట్స్ అంటారు. ఇవి ప్రపంచంలో దాదాపు పది శాతం జనాభాపై ప్రభావం చూపుతున్నాయి. పులిపిర్లు శరీరంలోని ఏ భాగంలో అయినా రావచ్చు.
మీ చర్మ ఉపరితల పొరల్లో పులిపిర్లు వస్తాయి. దానినే ఎపిడెర్మిస్ అంటారు. ఈ వైరస్ చర్మ కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది, దీని వలన పులిపిర్లు ఏర్పడతాయి. చాలావరకూ పులిపిర్ల ఉపరితలం ఉబ్బి, గరుకుగా ఉంటుంది. కానీ, కొన్ని అంటే ముఖంపై వచ్చే పులిపిర్లు మృదువుగా, చదునుగా ఉండచ్చు.


ఫొటో సోర్స్, Getty Images
పులిపిర్లు ఎందుకు వస్తాయి?
పులిపిర్లు రావడానికి హ్యూమన్ పాపిలోమావైరస్ కారణం. దీన్నే హెచ్‌పీవీ అని కూడా అంటారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్‌లో వందకు పైగా రకాలు లేదా స్ట్రెయిన్స్ ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే పులిపిర్లు వచ్చేలా చేస్తాయి. ఇవి స్కూల్ పిల్లల్లో చాలా సాధారణంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.
పులిపిర్ల వల్ల ఎక్కువగా హాని ఉండదు. కానీ, అప్పుడప్పుడూ ఇబ్బందులు కలిగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా వ్యాపిస్తాయి?
మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు వేరేవాళ్లను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తాకడం వల్ల ఇవి వ్యాపించవచ్చు. అంటే ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, జిమ్ లేదా పార్లర్స్ వంటి వాటిలో మీరు పులిపిర్లు ఉన్న వ్యక్తి వస్తువులు వాడినపుడు అవి సోకవచ్చు.
లైంగిక సంబంధాలు కూడా పులిపిర్లకు కారణం కావచ్చు. మీరు హెచ్‌పీవీ ఉన్న ఏదైనా భాగంలో గోకినపుడు మరింత వ్యాపించవచ్చు. ఇన్ఫెక్షన్ అవకాశాలు పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఉందా?
కొన్ని పులిపిర్లు ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే ఒకటి రెండేళ్ల తర్వాత పోతాయి. మరికొన్ని ఏళ్లపాటు ఉండిపోతాయి. వాటికి చికిత్స అవసరం ఉండొచ్చు.
''పులిపిర్లను చికిత్సతో తొలగించాలి. దీనికోసం లేజర్ లేదా ఆర్ఎఫ్ మెషిన్ వాడుతాం. చెప్పాలంటే వాటిని కాల్చేస్తాం. అప్పుడప్పుడు కొన్ని బలమైన యాసిడ్స్ కూడా ఉపయోగిస్తాం. లేదా ఇంట్లో రాసుకోడానికి కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తాం. కొన్ని లోషన్స్ అవి ఊడిపోయేలా చేస్తాయి. అవి వైరల్ కాబట్టి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, మేం వారి రోగనిరోధక శక్తిపై దృష్టి పెడతాం'' అని దిల్లీలోని బీఎల్‌కే మ్యాక్స్ ఆసుపత్రిలోని డెర్మటాలజిస్ట్ ఇందూ బాలానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పులిపిర్లు రాకుండా ఉండాలంటే?
పులిపిర్లు రాకుండా అడ్డుకోడానికి ఎలాంటి పక్కా విధానం లేదు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినపుడు మీరు పరిశుభ్రత పాటించడం మంచిది.
ఇతరుల వ్యక్తిగత వస్తువులు అంటే టవల్, రేజర్ లాంటివి షేర్ చేసుకోకూడదు. మీకు ఉన్న పులిపిర్లను మాటిమాటికీ తాకకండి. వేరే వారి పులిపిర్లను కూడా తాకవద్దు. మీ చర్మాన్ని మాయిశ్చరైజ్డ్‌గా చూసుకోండి. గాట్లు లాంటివి పడకుండా చూసుకోండి.
ఎందుకంటే ఈ వైరస్ పగిలిన, తెగిన, పొడిబారిన చర్మం నుంచి సులభంగా లోపలికి వెళ్లగలదు.
మరో విషయం హెచ్‌పీవీ వ్యాక్సీన్ గురించి వైద్యులను సంప్రదించండి. మీ శరీరంలోని ఒక భాగం నుంచి మరో భాగంలోకి పులిపిర్లు వ్యాపించకుండా ఉండాలంటే వాటిని పట్టీతో కవర్ చేసి ఉంచండి.
ప్రమాదకరమా?
పులిపిర్ల వల్ల ప్రమాద ఘంటికలు ఎప్పుడు మోగుతాయంటే.. హఠాత్తుగా చాలా పులిపిర్లు రావడం.. కొన్ని పులిపిర్లు నొప్పిగా ఉంటూ, రక్తం రావడం, లేదా దురద పుట్టినప్పుడు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
చాలావరకూ పులిపిర్లు క్యాన్సర్‌కు కారణం కావు. కానీ, కొన్ని కేసుల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
(ఇది అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించండి).
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














