‘మహా న్యూస్’ కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి.. ఎవరేమన్నారు?

బీఆర్ఎస్, కేటీఆర్, మహా న్యూస్

ఫొటో సోర్స్, x.com/MahaaNews

ఫొటో క్యాప్షన్, కేటీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేశాయి.
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే తారక రామారావు ఫోటోలతో పెట్టిన యూట్యూబ్ వీడియో థంబ్ నెయిల్స్ కి నిరసనగా బీఆర్ఎస్ ఈ దాడికి దిగింది.

దాడిలో మహా న్యూస్ కార్యాలయంలో ఫర్నీచర్, బయట కార్లు దెబ్బతిన్నాయి. దీనిపై కేసు పెట్టిన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌ని అరెస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బీఆర్ఎస్, కేటీఆర్, మహా న్యూస్

ఫొటో సోర్స్, x.com/MahaaNews

ఫొటో క్యాప్షన్, కేటీఆర్‌పై అభ్యంతరకర థంబ్‌నెయిల్స్‌తో మహా న్యూస్ వార్తలు రాసిందని బీఆర్ఎస్ ఆరోపించింది.

థంబ్‌నెయిల్స్ వివాదమేంటి?

కొంత కాలంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృతంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా న్యూస్ కొన్ని వార్తలు ప్రసారం చేసింది.

మహిళల ఫోటోలు బ్లర్ చేసి, కేటీఆర్ ఫోటో మాత్రం పెట్టి ఆ వార్తలు ప్రసారం చేసింది మహా న్యూస్.

అయితే ఆ వార్తల థంబ్ నెయిల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

శనివారం మధ్యాహ్నం(జూన్ 28) సమయంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, గెల్లు శ్రీనివాస్ నాయకత్వంలో జూబ్లిహిల్స్ లోని మహా న్యూస్ భవనంపై దాడికి దిగారు. బ

యట ఉన్న కార్ల అద్దాలు పగలగొట్టారు. కార్లపై పెద్ద రాళ్లు వేశారు. కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. రిసెప్షన్‌ను ధ్వంసం చేశారు.

లోపలికి ప్రవేశించారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు పెద్ద సంఖ్యలో పగిలాయి.

ఆ సమయంలో లోపల ఉన్న సిబ్బంది కొందరు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు న్యూస్ రూమ్ అద్దం పగలగొట్టి తలుపు తెరవాలని ప్రయత్నించడం, ఇటువైపు సిబ్బంది అడ్డుకోవడం జరిగింది.

ఆ సమయంలో కొందరి చేతుల్లో లైట్ స్టాండ్లు కనిపించాయి.

బీఆర్ఎస్, కేటీఆర్, మహా న్యూస్

ఫొటో సోర్స్, x.com/MahaaNews

ఫొటో క్యాప్షన్, బీఆర్ఎస్ దాడిని కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఖండించాయి.

దాడిపై రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంది?

ఈ దాడిని కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఖండించాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా మహా న్యూస్ కార్యాలయానికి వెళ్లి మద్దతు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ''మహాటీవీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమర్ధనీయం కాదు'' అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ, తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ దాడిని ఖండించారు.

తెలంగాణ సీపీఎం నాయకులు జాన్ వెస్లీ, సీపీఐ నాయకులు నారాయణ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే ఈ దాడిని ఖండించింది.

''ఫోన్ ట్యాపింగ్ అంశాలను, సిట్ విచారణను మహా న్యూస్ బయట పెడుతున్న నేపథ్యంలో మా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా 15-20 మంది గూండాలు బీఆర్ఎస్ శ్రేణులుగా చెప్పుకుంటూ, అత్యంత క్రూరంగా ఆఫీసు మీద రాడ్లతో దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేశారు. చంపే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు కొందరు ఈ పనికి పూనుకున్నారు. ఇది కేసీఆర్ చర్యా లేక కేటీఆర్ చర్యా అనేది ప్రజలకు తెలియాలి'' అని మహా గ్రూప్ చైర్మన్, ఎండీ మారెళ్ళ వంశీకృష్ణ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మహా న్యూస్‌కి లీగల్ నోటీసులు

ఈ దాడి గురించి జాతీయ మహిళా కమిషన్‌కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, కేంద్ర సమాచార మంత్రికీ, కార్యదర్శకీ, కేంద్ర సమాచార శాఖలోని పీఐబీకి, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్‌కీ, ప్రెస్ కౌన్సిల్‌కీ, తెలంగాణ ముఖ్యమంత్రికీ ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.

దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఆ సంస్థ అభివర్ణించింది.

మరోవైపు బీఆర్ఎస్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించింది. మహా న్యూస్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.

''ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు! కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్నీ మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చారు మన రేవంత్ రెడ్డి, ఆయన అనుంగ మిత్రులు! దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలి. చట్టాన్ని నమ్మాలి. మీ ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాను. మీ ప్రేమను గౌరవిస్తున్నాను. దురదృష్టవశాత్తూ డబ్బు సంచులతో దొరికిన రేవంత్ వంటి వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అబద్ధాలు, వదంతులే ప్రధాన స్రవంతి అయ్యాయి. అరాచకత్వం ఏలుతోంది. దీనిపై మేం కోర్టులకు వెళ్తాం. మనం కాంగ్రెస్ తప్పులను ప్రశ్నించడంపై దృష్టి పెడదాం'' అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. పలువురు బీఆర్ఎస్ నాయకులు మహా న్యూస్ ఎల్లో జర్నలిజం చేస్తుందని ఆరోపిస్తూ ప్రకటనలు చేశారు.

బీఆర్ఎస్, కేటీఆర్, మహా న్యూస్

ఫొటో సోర్స్, https://www.facebook.com/

ఫొటో క్యాప్షన్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు

బీఆర్ఎస్‌ను ఆంధ్ర మీడియా లక్ష్యంగా చేసుకుందని ఆరోపణలు

ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉన్న ఆ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఆ అరెస్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి.

''సోషల్ మీడియా వేదికగా మా నాయకుల వ్యక్తిగత జీవితాలు తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అందరికీ తల్లీ, చెల్లి, కూతుళ్లు ఉంటారు. వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో పెడితే సమర్థిస్తారా? ఆంధ్ర మీడియాలో ఒక వర్గం అప్పట్లో ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రసారం చేసినట్టే, ఇప్పుడు బీఆర్ఎస్ ను లక్ష్యం చేసుకుంది. పోలీసులుకు చిత్తశుద్ధి ఉంటే, మామీదే కాదు, వారిమీద కూడా చర్యలు తీసుకోవాలి'' అని అరెస్టుకు ముందు మీడియాతో అన్నారు గెల్లు శ్రీనివాస్.

ఈ ఘటనపై గెల్లు శ్రీనివాస్ తో పాటు ఇతరులపై 331(5), 331(7), 109(1), 118(1), 126(2), 324(5), 324(6), 351(3), 79 r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు.

సోషల్ మీడియా వేదికగా దాడిని సమర్థిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులు, వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం మద్దతుదారులు సహా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)