వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అరెస్టు చేసిన పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఎందుకు చనిపోయారు?

ఫొటో సోర్స్, ISPR
పాకిస్తాన్ వజీరిస్తాన్ జిల్లాలోని సరారోఘా ప్రాంతంలో జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో పాక్ ఆర్మీ మేజర్ సయద్ మోయిజ్ అబ్బాస్ షా మృతి చెందారు.
2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ భూభాగంలో అరెస్టు చేసింది మోయిజ్ అబ్బాసే.
మేజర్ సయద్ మోయిజ్ అబ్బాస్ షాకు నివాళి అర్పించే కార్యక్రమం రావల్పిండిలో జరిగింది.
పాకిస్తాన్ ఆర్మీ ఇన్‌ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) ప్రకారం..పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, హోమ్ మంత్రి మోహ్సీన్ నఖ్వీలు రావల్పిండిలో జరిగిన మోయిజ్ అబ్బాస్ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఎస్‌పీఆర్ సమాచారం ప్రకారం, తీవ్రవాదులతో మేజర్ సయద్ మోయిజ్ ధైర్యంగా పోరాడారని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చెప్పారు.
ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి అసలైన ఉదాహరణగా నిలుస్తూ.. చివరికి ఆయన విధి నిర్వహణలో ప్రాణాలను పోగొట్టుకున్నారని తెలిపారు.
కడసారి నివాళులు అర్పించిన తర్వాత, అంత్యక్రియల కోసం మేజర్ సయద్ మోయిజ్ మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు.

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, భద్రతా బలగాలు దక్షిణ వజీరిస్తాన్‌లోని సరారోఘా ప్రాంతంలో మిలటరీ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ ఆపరేషన్‌లో టెర్రరిస్టులపై భద్రతా బలగాలు దాడి చేశాయని, 11 మంది టెర్రరిస్టులు చనిపోయారని, ఏడుగురు గాయపడ్డట్లు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది.
ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మేజర్ సయద్ మోయిజ్ అబ్బాస్ షా, లాన్స్ నాయక్ జిబ్రానుల్లాలు కాల్పుల్లో మరణించినట్లు ఐఎస్‌పీఆర్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మేజర్ సయద్ మోయిజ్ ఎవరు?
37 ఏళ్ల మేజర్ సయద్ మోయిజ్ అబ్బాస్ షా పాకిస్తాన్‌లోని చక్వాల్‌కు చెందిన వ్యక్తి. 2011లో పాకిస్తాన్ సైన్యంలో చేరారు.
ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)లో భాగమయ్యారు. ప్రస్తుతం వజీరిస్తాన్‌లో పనిచేస్తున్నారు.
ఆరేళ్ల కిందట భారత్, పాకిస్తాన్ దేశాలు యుద్ధం అంచుల్లోకి వచ్చాయి. ఆ సమయంలో బాలాకోట్‌పై వైమానిక దాడుల్లో భారత ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయరు.
వెంటనే పాకిస్తాన్ ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకున్నప్పుడు మేజర్ సయద్ మోయిజ్ పేరు వినిపించింది.
2019 ఫిబ్రవరి 27న ఈయన వీడియో ఒకటి వైరల్ అయింది.
సయద్ మోయిజ్, ఇతర సైనిక సిబ్బంది తమ భూభాగంలో పడిపోయిన భారతీయ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను అరెస్ట్ చేసేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపానికి వెళ్లారు.

అభినందన్ విమానం క్రాష్ అవ్వడంతో పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పారాచూట్ సాయంతో ల్యాండ్ కావడాన్ని స్థానిక నివాసి మహమ్మద్ రజాక్ చౌధరీ చూశారు.
తాను, ఇతర గ్రామస్థులం అక్కడికి చేరుకున్నప్పుడు, ఇండియన్ పైలట్ చుట్టూ మూగిన ప్రజలు ఆయనపై రాళ్లు విసురుతున్నారని, అభినందన్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సమయంలో బీబీసీతో మాట్లాడిన రజాక్ చౌధరీ చెప్పారు.
వింగ్ కమాండర్ అభినందన్ అక్కడి నుంచి సమీపంలోని కాలువ వద్దకు చేరుకున్నారు. కానీ, స్థానిక ప్రజలు అక్కడ కూడా ఆయన్ను చుట్టుముట్టారు.
కానీ, ఆ సమయంలోనే కెప్టెన్ సయద్ మోయిజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆర్మీ అక్కడకు వచ్చింది.
గుమిగూడిన ప్రజల్లో కొందరు భారతీయ పైలట్ అభినందన్‌ను కొట్టినట్లు కూడా మహమ్మద్ రజాక్ చౌధరీ గుర్తు చేసుకున్నారు.
ఈ సమయంలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. వింగ్ కమాండర్ అభినందన్ ముఖం రక్తంతో తడిచిపోయింది.
పాకిస్తాన్ సైనికులు ఆయన్ను ఆ జనం నుంచి బయటికి తీసుకొచ్చారు.

ఆ ఘటన గురించి అప్పట్లో మేజర్ సయద్ మోయిజ్ ఏం చెప్పారు?
ఆ ఘటన జరిగిన ఏడాదైన సందర్భంగా మాట్లాడిన మేజర్ సయద్ మోయిజ్.. భారత పైలట్ వద్దకు తాము చేరుకున్నప్పుడు ఆయన చుట్టూ ప్రజలు గుమిగూడి ఉన్నారని టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ సమయంలో ప్రజలు ఆయనపై దాడి చేస్తున్నారని మేజర్ సయద్ మోయిజ్ తన ఇంటర్వ్యూలో తెలిపారు.
‘‘ భారత పైలట్ వద్దకు చేరుకున్న వెంటనే, ఆయన నా ర్యాంకు చూశారు. 'కెప్టెన్, నేను భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను. లొంగిపోతాను, ప్లీజ్ కాపాడండి' అన్నారు. ఆయన లొంగిపోయారు కాబట్టి అభినందన్ భద్రత నా వృత్తిపరమైన బాధ్యత'' అని మేజర్ సయద్ మోయిజ్ ఆ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న అభినందన్ వీడియోను విడుదల చేసినప్పుడు.. అభినందన్ తన పేరును, ర్యాంకును చెప్పారు. అంతేకాక, తనను బాగా చూసుకుంటున్నారని తెలిపారు. ఆ తర్వాత అభినవ్ వర్థమాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది.
మేజర్ సయద్ మోయిజ్ అబ్బాస్ షాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














