జమ్మూకశ్మీర్: ప్రస్తుతం పహల్గాంలో పరిస్థితి ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Abid Bhat
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పర్యటకులను భయభ్రాంతులకు గురిచేసిన, భారత్ - పాకిస్తాన్‌ను దాదాపు యుద్ధం అంచుల వరకూ తీసుకెళ్లిన ఘోరమైనపహల్గాం దాడి తర్వాత, రెండు నెలల అనంతరం ఇప్పుడిప్పుడే హిమాలయ పర్వతాల చెంతనున్న అందమైన లోయలో టూరిజం పుంజుకుంటోంది.
శ్రీనగర్‌లో ప్రముఖ పర్యటక ప్రాంతమైన దాల్ సరస్సులో వాటర్ బైక్ మీద పిల్లలు చక్కర్లు కొడుతున్న దృశ్యాలను తన మొబైల్‌లో బంధిస్తున్నారు షబానా అవ్వల్.
ఆమె తన భర్త, పిల్లలతో పాటు మరో 15 మంది బృందంతో రాజస్థాన్ నుంచి కశ్మీర్ పర్యటనకు వచ్చారు.
"నేను కశ్మర్ చాలాసార్లు వచ్చాను. ఇక్కడ ప్రముఖ పర్యటక ప్రాంతాలైన గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్గాం చూశా. వీటిని మా బంధువులకు కూడా చూపించాలనుకున్ను" అని ఆమె బీబీసీతో చెప్పారు.
పది రోజుల కశ్మీర్ పర్యటనకు షబానా కుటుంబం మార్చిలో ప్లాన్ చేసుకుంది.
"వేసవిలో రాజస్థాన్‌లో చాలా వేడిగా ఉంటుంది. అందుకే పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే కశ్మీర్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం" అని షబానా చెప్పారు.
అయితే, వాళ్లు కశ్మీర్ పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న కొద్దిరోజుల తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యటకులపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు.
జమ్మూ కశ్మీర్ ఆర్థిక రంగానికి పర్యటకమే కీలకం. అయితే, టూరిస్టులపై జరిగిన దాడి దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఈ దాడి తర్వాత, కశ్మీర్ లోయలోని 48 పర్యటక ప్రాంతాలను అధికారులు మూసేశారు. వాటిలో మూడింట రెండొంతులు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి.

పర్యటకుల్ని మళ్లీ రప్పించేందుకు, మూతపడిన పర్యటక ప్రాంతాలను తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, "దాడి ప్రభావం విస్తృతంగా వ్యాపించింది" అని అన్నారు.
"పర్యటకులు భారీ సంఖ్యలో వెనక్కి వెళ్లిపోయారు. అనేక మంది తమ బుకింగ్‌లు రద్దు చేసుకున్నారు. కొంతమంది కశ్మీర్ పర్యటనలను వాయిదా వేసుకున్నారు. భారత్ - పాకిస్తాన్ మే నెలలో కొద్దిరోజుల పాటు దాదాపు యుద్ధం చేశాయి" అని ఒమర్ అబ్దుల్లా బీబీసీతో చెప్పారు.
"రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం.. ఈ ఏడాది టూరిజం సీజన్‌పై ప్రభావం చూపింది. ఈ ఏడాది పర్యటకం ఎలా ఉండబోతోందనేది ఎలా చెప్పాలి? దీన్ని ఒక విపత్తుగా చెప్పొచ్చు."

ఫొటో సోర్స్, Abid Bhat
కశ్మీర్ విషయం భారత్- పాకిస్తాన్ మధ్య కొన్ని దశాబ్దాలుగా వివాదంగా ఉంది.
కశ్మీర్ కోసం ఈ అణ్వస్త్ర దేశాలు ఇప్పటికే రెండు యుద్ధాలు చేశాయి. ఒక పరిమిత స్థాయి సంఘర్షణ కూడా జరిగింది. పాతికేళ్ల పాటు ఈ ప్రాంతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును కూడా చూసింది. అయినా, పర్యటకులను లక్ష్యంగా చేసుకున్న సందర్బాలు చాలా అరుదు.
"నిజంగా, మాకేమీ భయమనిపించలేదు. ఏం జరిగినా సరే, ఎదుర్కోగలం" అనే ధైర్యంతో టూర్ ప్లాన్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు షబానా చెప్పారు.
''ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే కశ్మీర్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ పరిస్థితి మామూలుగానే ఉంది" అని ఆమె చెప్పారు. కశ్మీర్ వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయానికి 'మీడియా హైప్' కారణమని ఆమె తప్పుబట్టారు.
కశ్మీర్ పర్యటనపై సంతృప్తిగా ఉంది కేవలం షబానా కుటుంబం మాత్రమే కాదు.
జమ్మూకు చెందిన దీప్తి, అనూజ్ గాంధీ కూడా వారం క్రితం ప్లాన్ చేసుకుని శ్రీనగర్ వచ్చారు. "వేసవిలో కశ్మీర్ కంటే ఉత్తమమైన ప్రదేశం ఏదీ లేదు" అని అనూజ్ చెప్పారు.
"దాల్ లేక్‌లో వాటర్ బైక్ మీద చక్కర్లు కొట్టడాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఆ తర్వాత, లేక్‌లో బోటింగ్‌కి వెళ్తాం. మేము ప్రతి ఏటా ఇక్కడకు వస్తాం. ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకే ఈ ఏడాది కూడా వచ్చాం" అని దీప్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Abid Bhat
వారం రోజుల కిందట పోలాండ్ నుంచి పర్యటకుల బృందం శ్రీనగర్‌కు వచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
పహల్గాం దాడి తర్వాత, ప్రస్తుతం శ్రీనగర్ వస్తున్న పర్యటకుల సంఖ్య స్థానిక హోటళ్ల యజమానులు, టాక్సీ డ్రైవర్లు, టూర్ గైడ్లు, దుకాణ యజమానులు, దాల్ లేక్‌లో పడవల యజమానుల్లో ఆశలు రేపుతోంది.
"సహజంగా ఏప్రిల్‌లో దాల్ లేక్ ప్రాంతం వేల మంది పర్యటకులతో నిండిపోతుందని, రోడ్ల మీద వాహనాలతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడతాయని, హోటళ్లలో గదులు దొరకడం లేదని ఫిర్యాదులు వచ్చేవి" అని షికారా యజమానుల సంఘం అధ్యక్షుడు హాజీ వాలి మొహమ్మద్ బట్ చెప్పారు.
"పర్యటకులపై దాడి దురదృష్టకరం, విషాదకరం" అని ఆయన అన్నారు.
"అది మా అందరి జీవనాధారంపై ప్రభావం చూపించింది. పర్యటకులే మాకు ఆధారం, టూరిజమే మా లైఫ్‌లైన్. ఏం పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నామో ఆ దేవుడికే తెలియాలి" అని ఆయన ఆవేదనతో చెప్పారు.
టూర్ ఆపరేటర్ల పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి భారత టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు రవి గోసైన్ మూడు రోజుల పాటు ఫ్యాక్ట్ ఫైండిగ్ ట్రిప్ నిర్వహించారు.
"కొన్నేళ్లుగా కశ్మీర్‌లో పర్యటక రంగం విస్తరిస్తోంది. కొత్తగా అనేక హోటళ్లు కట్టారు. వాహనాలు కొన్నారు. కొత్త దుకాణాలు తెరిచారు" అని ఆయన చెప్పారు.
2024లో 2 కోట్ల 36 లక్షల మంది పర్యటకులు జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారని, అందులో 39 లక్షల మంది కశ్మీర్ లోయలో పర్యటించారని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది కశ్మీర్ లోయ పీక్ సీజన్‌ను నష్టపోయిందని, రానున్న రోజుల్లో టూరిజం పుంజుకుంటుందని గోసైన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Abid Bhat
"శ్రీనగర్ వస్తున్న వారిని స్థానికులు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. పర్యటకులతో హోటల్ యజమానులు, టూర్ గైడ్లు, దుకాణాల యజమానులు స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అది మీరిక్కడ చూడవచ్చు. విమానాల నిండా ప్రయాణికులు ఉన్నారు. పర్యటకం వేగంగా పుంజుకుంటోంది."
"పర్యటకులు శ్రీనగర్ రాకుండా భయపెట్టాలనే ఉద్దేశంతో జరిగిన దాడిని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఆ ఉద్దేశాలు ఎన్నటికీ నెరవేరవు. పహల్గాం లాంటి ఘటన మరోసారి జరగదని ఆశిస్తున్నా" అని రవి గోసైన్ చెప్పారు.
భారత్‌లోని ఇతర ప్రాంతాలను కశ్మీర్‌తో కలుపుతూ శ్రీనగర్‌కు కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ కూడా పర్యటకం పుంజుకోవడంలో కీలకపాత్ర పోషించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
జమ్మూ ప్రాంతంలోని కాట్రా నుంచి రోజుకు రెండుసార్లు శ్రీనగర్ ప్రయాణించే రైలు ఇటీవల పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికల్లో నిలిచింది.
"ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి" ప్రారంభించిన తర్వాత, రెండు నెలల వరకు ఈ మార్గంలో టిక్కెట్లన్నీ బుక్కయ్యాయి.
ఈ ప్రయాణంలో ప్రారంభ స్థానమైన, మాతా వైష్ణోదేవి కొలువుదీరిన కాట్రా పట్టణాన్ని గతేడాది దాదాపు 95 లక్షల మంది సందర్శించారు.
జూన్ 7న కాట్రా నుంచి శ్రీనగర్‌కు కొత్తగా వందే భారత్ రైలు ప్రారంభించిన తర్వాత కాట్రా వచ్చిన వారిలో చాలా మంది శ్రీనగర్ వెళ్లేందుకు ఆ రైలు ఎక్కుతున్నారు.

ఫొటో సోర్స్, Abid Bhat
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అనేక మంది యాత్రికులలో ఘనశ్యామ్ భరద్వాజ్, ఆయన భార్య మమత శర్మ, వారి పిల్లలు ఉన్నారు. దిల్లీకి చెందిన ఈ కుటుంబం దాల్‌లేక్ వద్ద వేడివేడి టీ తాగుతూ ఆనందిస్తున్నారు. "శ్రీనగర్ రావాలని క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాం" అని వారు చెప్పారు.
"కాట్రా నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం. ఈ రాత్రికి మేమిక్కడ ఉండి రేపు కాట్రా వెళ్లి, అక్కడ నుంచి దిల్లీ వెళతాం" అని భరద్వాజ్ చెప్పారు.
పహల్గాం దాడి తర్వాత, కొద్దిరోజులకే కశ్మీర్ లోయకు రావడం గురించి ఏమైనా ఆందోళనగా అనిపించిందా? అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది.
"భయపడాల్సింది ఏమీ లేదు. ఇది నా దేశం" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














