ఇరాన్ పై అమెరికా దాడి: ఇప్పటి వరకూ జరిగిందే అనూహ్యం, ఇక ముందు జరిగేది మరింత తీవ్రంగా ఉండొచ్చు...

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌పై అమెరికా దాడితో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
    • రచయిత, లిసె డౌసెట్
    • హోదా, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్

ప్రత్యక్ష మిలటరీ చర్యకు దిగడమనే ప్రమాదకర రెడ్‌లైన్‌ను నాలుగు దశాబ్దాలుగా అమెరికా, ఇరాన్‌లు అత్యంత జాగ్రత్తగా పక్కకుపెడుతూ వచ్చాయి.

మరీ ముఖ్యంగా, ప్రమాదకరమైన పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా నిండా మునిగిపోవచ్చనే భయంతో ఇరాన్‌కు వ్యతిరేకంగా సైన్యాన్ని మోహరించడానికి చాలామంది అమెరికా అధ్యక్షులు భయపడ్డారు.

కానీ, శాంతి వచనాలు ప్రకటించిన ట్రంప్ మాత్రం, తెహ్రాన్ అణుస్థావరాలపై నేరుగా మిలిటరీ దాడులు చేయడం ద్వారా ఈ అప్రకటిత నియమాన్ని ఉల్లంఘించారు.

పాత రూల్స్ అన్నింటినీ బద్ధలు కొట్టేస్తానంటూ గర్వంగా ప్రకటించుకునే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తీవ్ర పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ఉలిక్కిపడేలా చేసిన అనూహ్యమైన చర్య ఇది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఏం చేయబోతున్నారు?

ఇరాన్ తదుపరి చర్య చాలా కీలకమైనది. ప్రస్తుతం బంకర్‌లో ఉన్నారని భావిస్తున్న సుప్రీం లీడర్, 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ, తన దేశాన్ని రక్షించుకునేందుకు అత్యంత శక్తిమంతమైన శత్రువుకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన ఆట చాలా జాగ్రత్తగా ఆడారు.

ఇప్పుడు ఆయన మామూలుగా స్పందిస్తే తన ప్రతిష్ఠ కోల్పోతారు. తీవ్రస్థాయిలో స్పందిస్తే ఆయన అన్నింటీనీ కోల్పోవచ్చు.

''ఖమేనీ తర్వాతి అడుగులు చాలా కీలకమైనవి, అనేక పర్యవసానాలకు దారితీసేవి. ప్రస్తుతం ఆయన ఉనికి కోసమే కాదు. చరిత్రలో ఆయన ఎలా నిలిచిపోతారనేది కూడా ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది'' అని థింక్ ట్యాంక్ సంస్థ చాథమ్ హౌస్‌లో వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరక్టర్‌గా పని చేస్తున్న సనమ్ వకిల్ అన్నారు.

''ఆయన గిన్నెలో ఉన్న విషం 1988లో తాగిన దానికన్నా మరింత చేదుగా ఉండొచ్చు'' అని వకీల్ అన్నారు. అప్పటి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కాల్పుల విరమణ నిర్ణయాన్ని అయిష్టంగానే తీసుకున్నారని గుర్తు చేస్తూ వకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, shutterstock

ఫొటో క్యాప్షన్, శాంతి కోసం హామీ ఇచ్చిన అధ్యక్షులు ట్రంప్ తెహ్రాన్ అణుస్థావరాలపై దాడులు జరిపారు.

‘ఇది ఇరాన్ కోరుకున్న యుద్ధం కాదు’

ఇరాక్‌తో జరిగిన యుద్ధం ప్రభావం ఇరాన్ సమాజంపై ఇప్పటికీ ఉంటుంది. కానీ ఇరాక్‌తో ఎనిమిదేళ్లపాటు సాగిన యుద్ధంలో జరిగిన నష్టంకన్నా గత పది రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న తీవ్రమైన దాడులు ఇరాన్ కమాండ్, మిలటరీ హార్డ్‌వేర్‌ వ్యవస్థలకు ఎక్కువ నష్టం కలిగించాయి.

అగ్రస్థాయి అణు శాస్త్రవేత్తలు సహా భద్రతా బలగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇప్పుడీ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడం సంక్షోభాన్ని ఒక్కసారిగా తీవ్రతరం చేసింది.

ఇరాన్‌పై ఎందుకు దాడి చేశామా అని ఎప్పటికీ పశ్చాత్తాపం చెందేలా అమెరికాపై ప్రతీకార దాడికి దిగుతామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరిస్తోంది.

కానీ, ఈ మాటల యుద్ధం వెనక వినాశకర పరిణామాలు జరగకుండా నివారించే తీవ్రమైన ఆలోచనలున్నాయి.

‘‘ఇది ఇరాన్ కోరుకున్న యుద్ధం కాదు'' అని అంతర్జాతీయ వ్యవహారాలపై పశ్చిమాసియా కౌన్సిల్‌కు చెందిన హమీద్రెజా అజీజ్ చెప్పారు.

''అమెరికా దాడి వల్ల వాస్తవంగా ఎంత నష్టం జరిగిందన్నదానితో సంబంధం లేకుండా, ప్రాంతీయ శక్తిగా బలమైన దేశంగా ఉన్న ఇరాన్ ఇమేజ్ ఈ దాడుల వల్ల దెబ్బతిన్నదని, దీనికి స్పందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ మద్దతుదారులు చేస్తున్న వాదనలను మనం ఇప్పటికే చూస్తున్నాం'' అని అజీజ్ తెలిపారు.

ఏ ప్రతిస్పందన అయినా ప్రమాదకరమైనదే. పశ్చిమాసియాలోని 20 అమెరికా స్థావరాలలో ఏ ఒక్కదానిపైనా లేదా 40వేలమంది అమెరికా బలగాలపై ఎవరిపైనైనా నేరుగా ఇరాన్ దాడిచేస్తే, అమెరికా తీవ్రస్థాయిలో ప్రతీకారానికి దిగే అవకాశముంటుంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టెల్‌ అవీవ్‌పై ఇరాన్ దాడి చేసింది.

సంక్షోభం మరింత ముదురుతుందా?

ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతతో ఈ ప్రాంతంలోని అరబ్ మిత్రదేశాలు, ఇరాన్‌ చమురుకు ప్రధాన కస్టమర్ అయిన చైనా అసంతృప్తికి గురవడం ఇరాన్‌కు నష్టం కలిగించొచ్చు.

భారీ ఆర్థిక నష్టం నుంచి తప్పించుకునేందుకు వెస్ట్రన్ నేవల్ పవర్స్ రంగంలోకి దిగొచ్చు.

తన రక్షణ వ్యవస్థగా ఇరాన్ భావించే ప్రాక్సిస్ నెట్‌వర్క్, దాని భాగస్వామ్యులంతా 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, హత్యలతో బలహీనపడ్డారు.

అమెరికాకు ఆగ్రహం తెప్పించకుండా ఇరాన్ ప్రతిస్పందనకు దిగి, యుద్ధం అంచులదాకా వెళ్లకుండా రెండు దేశాలు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

అమెరికా, ఇరాన్ మధ్య ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు కూడా ఏర్పడ్డాయి. ఐదేళ్ల కిందట ఐఆర్‌జీసీ కమాండర్ ఖాసిమ్ సులేమనీని బాగ్దాద్‌లో డ్రోన్ దాడితో హతమార్చడానికి ట్రంప్ ఆదేశాలిచ్చినప్పుడు ఇది భారీ స్థాయి యుద్ధానికి దారితీస్తుందని చాలామంది భయపడ్డారు. కానీ ఇరాన్ మరోలా స్పందించింది. తన ఇరాకీ అధికారుల ద్వారా ప్రతిదాడికి దిగింది. అమెరికా సిబ్బందిని హతమార్చడం, అమెరికాకు భారీ నష్టం కలిగించడం కాకుండా అమెరికా స్థావరాల విభాగాలను లక్ష్యంగా చేసుకుంది.

కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా దాడుల తర్వాత ఫోర్డో అణుస్థావరం శాటిలైట్ చిత్రం

‘దౌత్య మోసాలు చేసింది ఇరాన్ కాదు, అమెరికా’

ఇరాన్‌పై దాడి చేయడానికి బదులుగా, దానితో ఒప్పందం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పదే పదే చెప్పిన ట్రంప్, ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ కోణం నుంచి చూస్తునట్టు కనిపిస్తోంది.

అణుబాంబును తయారుచేస్తుండడం ద్వారా పశ్చిమాసియాలో ఇరాన్ ప్రమాదకరంగా మారిందని ట్రంప్ ఆరోపించారు.

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బీ-2 బాంబుల దాడి ఇదేనని పెంటగాన్ చెబుతోంది. ఈ దాడిని నిఘా బృందాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్ ప్రధాన అణుస్థావరాలపైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దోకు తీవ్ర నష్టం కలిగినట్టు భావిస్తున్నారు.

భూగర్భంలో అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న ఫోర్దో కేంద్రంలోకి ''బంకర్ బస్టింగ్ బాంబులు'' మాత్రమే చొచ్చుకుపోగలవు.

శాంతి కోసం ముందుకు రావాలని అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

కానీ అమెరికా దౌత్య సందేశాన్ని ఇరాన్ ఇప్పుడు లొంగుబాటుగా చూస్తోంది. శుక్రవారం(జూన్ 20) ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్‌చీ, జెనీవాలో యూరప్ విదేశాంగమంత్రులతో సమావేశమయ్యారు. తెహ్రాన్‌కు అసలేమాత్రం అణుసామర్థ్యం ఉండకూడదని వాషింగ్టన్ భావిస్తోందని యూరప్ మంత్రులు ఇరాన్‌తో చెప్పారు.

పౌర అణు కార్యక్రమంలో భాగంగా యురేనియంను సమకూర్చుకోవడానికి తమకున్న హక్కును ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.

ట్రంప్ దౌత్య ప్రయత్నాలను, ఆయన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ నిర్వహించిన ఐదు రౌండ్ల పరోక్ష చర్చలను కూడా ఇప్పుడు విస్తృతమైన మోసంగా అరాఘ్‌చి భావిస్తున్నారు.

మస్కట్‌లో ఆరో దశ చర్చలు జరగడానికి రెండురోజుల ముందు ఇజ్రాయెల్ మిలటరీ దాడికి దిగింది. దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశం కల్పించేలా రెండు వారాల గడువు ఉండాలని భావిస్తున్నట్టు చెప్పిన రెండు రోజులకే ట్రంప్ యుద్ధంలోకి దిగారు.

ఇజ్రాయెల్, అమెరికా బాంబులు కురిపిస్తున్నప్పుడు చర్చల కోసం ముందుకు రాబోమని చెబుతోంది ఇరాన్.

దౌత్యపరమైన మోసం చేసింది అమెరికా అని, ఇరాన్ కాదని అని ఇస్తాంబుల్‌లో అరాఘ్‌చి ఆరోపించారు. ఇస్లామిక్ కాన్ఫరెన్స్ విదేశాంగమంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడిని ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఖండించింది.

ఇదొక ప్రమాదకరమైన అతిక్రమణ అని ఈ దాడిని అభివర్ణించింది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, ఇరాన్ విదేశాంగమంత్రి

ఇరాన్ అణుకార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని మిస్సైల్స్ ద్వారా కాకుండా చర్చల ద్వారా అడ్డుకోవాలని యూరప్ నేతలు కూడా కోరుతున్నారు.

ఇరాన్ అణుబాంబును సమకూర్చుకోవడాన్ని తాము అనుమతించబోమని కూడా వారు చెబుతున్నారు. తెహ్రాన్ దగ్గర 60శాతం శుద్ధ యురేనియం ఉండడం, ఆయుధాలు సమకూర్చుకోడానికి అవసరమైన 90శాతం యురేనియాన్ని సమకూర్చుకునేందుకు చేరువగా ఉండడం ఇరాన్ ఉద్దేశాలను ప్రతిబింబిస్తోందని వారు అంటున్నారు.

''తన అణుస్థావరాలకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపి, ఇలాంటి దాడుల తర్వాత కూడా తమ అణుకార్యక్రమం సురక్షితంగా ఉందని ఇరాన్ చెప్పే అవకాశం ఉంది'' అని యూరోపియన్ కౌన్సిల్‌లో విదేశీ సంబంధాలపై వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డిప్యూటీ హెడ్ ఎల్లీ గెరాన్ మయే విశ్లేషించారు.

ఇరాన్ అణుస్థావరాలకు చాలా నష్టం జరిగిందని చెప్పడం ద్వారా ఇది తమ మిలటరీ విజయంగా ప్రకటించి ట్రంప్ తర్వాతి దాడులకు దిగకపోవచ్చని ఆయన విశ్లేషించారు.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌కు కృతజ్ఞతలు చెబుతూ టెల్ అవీవ్‌లో బోర్డు ఏర్పాటుచేశారు.

దాడిపై అమెరికాలో ఏమనుకుంటున్నారు?

ఇరాన్‌కు మరింత నష్టం కలిగించేలా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ట్రంప్ తమవైపే ఉండేలా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చేస్తారు.

అయితే ట్రంప్‌పై ఒత్తిడి పెరగనుంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ట్రంప్ దాడులకు దిగారని అమెరికా చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమెరికాను మరో సుదీర్ఘయుద్ధంలోకి నడిపించబోమని ఇచ్చిన హామీని ట్రంప్ ఉల్లంఘించారని మద్దతుదారులంటున్నారు.

తాము టార్గెట్ కాకుండా నివారించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మునుపటి పరిస్థితులు వస్తాయనేది ఇరాన్ డెసిషన్ మేకర్లు ఈ క్షణంలో ఆలోచిస్తుండొచ్చు.

''ఇది చాలా బలీయమైన విషయం'' అని గెరాన్‌మయే హెచ్చరించారు.

‘‘ఇరాన్ నుంచి అణు హెచ్చరికలు రాకూడదని ట్రంప్ భావించినప్పటికీ, అది అణ్వస్త్ర దేశంగా మారే అవకాశాన్ని ఆయన పెంచారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)