ఇరాన్ - ఇజ్రాయెల్ ఘర్షణ: రష్యాకి మరో ఎదురుదెబ్బ తగలనుందా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- నుంచి, రష్యా ఎడిటర్
ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్'ను ప్రారంభించినప్పుడు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని రష్యా అధికారులు 'ఆందోళనకరమైనదిగా, ప్రమాదకరమైనది'గా అభివర్ణించారు.
ఇదే సమయంలో రష్యాకు కలిగే కొన్ని ప్రయోజనాలను ఆ దేశ మీడియా హైలైట్ చేసింది. ఇందులో చమురు ధరల పెరుగదల ఒకటి, ఇది రష్యా ఆదాయాన్ని పెంచుతుంది.
అలాగే, యుక్రెయిన్‌తో యుద్ధం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లిస్తుంది.
మోస్కోవ్‌స్కీ కొమ్సోమోలెట్స్ వార్తాపత్రిక "కీవ్‌ను మర్చిపోయారు" అనే శీర్షికతో కథనం ప్రచురించింది.
ఈ ఘర్షణలో మధ్యవర్తిత్వానికి రష్యా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తే.. యుక్రెయిన్‌లో దాడులు చేసినప్పటికీ, రష్యా తనను తాను ఒక కీలక దేశంగా, పశ్చిమ ఆసియాలో శాంతిని తీసుకొచ్చేదిగా చూపించుకోగలదని రష్యన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే, ఇజ్రాయెల్ సైనిక చర్య ఎంత ఎక్కువ కాలం కొనసాగితే, ప్రస్తుత ఘటనల వల్ల రష్యా అంత నష్టపోవాల్సి వస్తుందని గ్రహించాలి.
ఈ వివాదం మాస్కోకు తీవ్రమైన సమస్యలను, ప్రమాదాలను సృష్టించగలదని రష్యన్ రాజకీయ నిపుణులు ఆండ్రీ కోర్టునోవ్ ఒక వార్తాపత్రికలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యన్ మీడియా ఏం రాస్తోంది?
'పెరుగుతున్న వివాదం రష్యాకు ప్రమాదకరంతో పాటు ఖరీదైనది కూడా కావొచ్చు' అని ఆండ్రీ కోర్టునోవ్ సోమవారం బిజినెస్ వార్తాపత్రిక కొమ్మెర్సంట్‌లో రాశారు.
ఈ పత్రిక కథనం ప్రకారం..
''వాస్తవానికి రష్యా ఐదు నెలల కిందట ఇరాన్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, ఇజ్రాయెల్ దాడిని నిరోధించలేకపోయింది.
ఇజ్రాయెల్ చర్యలను రాజకీయంగా ఖండించడానికే మాస్కో పరిమితమైంది, ముందుకు వెళ్లాలని కోరుకోలేదు, ఇరాన్‌కు సైనిక సాయం అందించేందుకు సిద్ధంగా లేదని స్పష్టంగా తెలుస్తోంది.''
ఈ సంవత్సరం ప్రారంభంలో రష్యన్-ఇరానియన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన సంతకాలు సైనిక కూటమి కోసం కాదు.
అంటే, ఇరాన్‌పై దాడి జరిగితే రష్యా రక్షించాల్సిన అవసరం లేదు, ఒప్పంద సమయంలోనే రష్యా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వార్తాసంస్థ రియా నోవోస్టికు ఇచ్చిన ఇంటర్వ్యూలో '' శాంతిభద్రతలపై పనిచేయడం కోసమే ఈ ఒప్పందం. రక్షణ, భద్రతా విషయాలలో రష్యా, ఇరాన్ సహకారాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Contributor/Getty Images
రష్యాకు మరో ఎదురుదెబ్బ తగలనుందా?
కొన్నినెలల ముందే, పశ్చిమ ఆసియాలో బషర్ అల్-అసద్ రూపంలో ఒక ముఖ్యమైన మిత్రదేశాన్ని కోల్పోయింది రష్యా.
గత డిసెంబర్‌లో సిరియా నాయకుడు బషర్ అల్-అసద్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, రష్యా ఆయనకు ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు, ఇరాన్ ప్రభుత్వంలో మార్పు వస్తే మరో కీలక భాగస్వామిని కోల్పోవచ్చని రష్యా ఆందోళన చెందుతోంది.
"ప్రస్తుతం ప్రపంచంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇవి రష్యాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి" అని మోస్కోవ్‌స్కీ కొమ్సోమోలెట్స్ వార్తాపత్రిక మంగళవారం తన కథనంలో తెలిపింది.
ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరానికి సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదిక కావడంతో ఈ వారం పుతిన్ అక్కడే ఉండనున్నారు.
గతంలో ఈ కార్యక్రమాన్ని 'రష్యా దావోస్' (స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ ఆర్థిక వేదిక) అని పిలిచేవారు. కానీ ఇప్పుడు, ఆ పేరు సరిపోలదు.
ఇటీవలి సంవత్సరాలలో, ముఖ్యంగా యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి తర్వాత పెద్ద పాశ్చాత్య కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ ఫోరమ్‌కు హాజరు కాలేదు.
అయినప్పటికీ, ఈ సంవత్సరం 140కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.
యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాలు ఫలించలేదని చూపించడానికి రష్యన్ అధికారులు ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఇది ప్రధానంగా ఆర్థిక సమావేశం అయినప్పటికీ, రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పశ్చిమ ఆసియా, యుక్రెయిన్ గురించి అధ్యక్షుడు పుతిన్ ఏం మాట్లాడుతారోనని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














