రష్యా-యుక్రెయిన్ యుద్ధం: ఈ సరికొత్త భయానక ఆయుధం యుద్ధ గతిని మార్చేస్తోందా?

యుక్రెయిన్ రష్యా యుద్ధం, డ్రోన్ల దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు ప్రమాదకరంగా మారాయి.
    • రచయిత, యోగితా లిమాయే
    • నుంచి, బీబీసీ ప్రతినిధి

రిడిన్‌స్కీ పట్టణమంతా ఘాటైన వాసన వ్యాపిస్తోంది. మేం కారులో పట్టణంలోకి ప్రవేశించిన రెండు నిమిషాల తర్వాత అది ఎక్కడ నుంచి వస్తుందో మాకు కనిపించింది.

250 కేజీల గ్లైడ్ బాంబు పట్టణంలోని పరిపాలనా భవనాన్ని చీల్చుకుంటూ వెళ్లింది.

బాంబు పేలుడుకు 3 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. బాంబు పేలిన ఒక రోజు తర్వాత మేం ఆ ప్రాంతానికి వెళ్లాం. శిథిలాల నుంచి ఇప్పటికీ పొగ వస్తోంది.

పట్టణ శివార్ల నుంచి ట్యాంకులు, తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తోంది. యుక్రేయిన్ సైనికులు డ్రోన్లను కూల్చి వేస్తున్నారు.

యుద్ధంలో చిక్కుకున్న పొక్రాస్క్ నగరానికి ఉత్తరాన 15కిలోమీటర్ల దూరంలో రిడిన్‌స్కీ పట్టణం ఉంది. గతేడాది శీతాకాలం నుంచి రష్యా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే రష్యన్ సైనికులు నగరంలోకి రాకుండా యుక్రేయిన్ బలగాలు ఆపగలిగాయి.

దీంతో రష్యన్లు వ్యూహాన్ని మార్చారు. నగరంలోకి రావడానికి బదులు నగరాన్ని చుట్టుముట్టారు. నగరంలోకి సరఫరాలను రాకుండా అడ్డుకున్నారు.

గత రెండు వారాలుగా యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలం కావడంతో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. జనవరి తర్వాత మరింత పురోగతి సాధించింది. రిడిన్‌స్కీలో దీనికి సంబంధించిన ఆధారాలు కనిపించాయి.

పట్టణంలోకి వచ్చిన నిమిషాల్లోనే మా మీద ఒక రష్యన్ డ్రోన్ ఎగరుతున్న శబ్దం విన్నాం. రక్షణ కోసం మా బృందం దగ్గరలో ఉన్న చెట్టు కిందకు పరుగు తీసింది.

డ్రోన్ మమ్మల్ని చూడకుండా ఉండేందుకు మేము దానికి వ్యతిరేక దిశలో దాక్కున్నాం. తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. మరో డ్రోన్ అక్కడ తన ప్రభావం చూపిస్తోంది. మాపైన ఉన్న డ్రోన్ ఇంకా ఎగురుతూనే ఉంది.

కొన్ని నిమిషాల పాటు ఈ యుద్ధంలో ప్రమాదకరంగా మారిన ఆ ఆయుధపు భయంకరమైన శబ్దాన్ని మేం వింటూనే ఉన్నాం. అది మాకు వినిపించడం ఆగిపోయిన తర్వాత అక్కడకు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక పాత భవనంలోకి పరుగు తీశాం.

లోపలకు వెళ్లిన తర్వాత మాకు డ్రోన్ శబ్దం మళ్లీ వినిపించసాగింది. మా కదలికలను గమనిస్తే అది తిరిగి వచ్చే అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రిడిన్‌స్కీను రష్యన్ డ్రోన్లు చుట్టుముట్టడం పొక్రాస్క్‌కు దక్షిణాన తమ స్థావరాల నుంచి రష్యన్లు మరింత దగ్గరగా వచ్చారని చెప్పడానికి నిదర్శనంగా భావించవచ్చు.

ఆ డ్రోన్లు బహుశా, పొక్రాస్క్ తూర్పు నుంచి కోస్టియాన్టినివ్‌కా వెళ్లే కీలకమైన రహదారి మీద రష్యన్లు కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చు.

మేం అరగంట సేపు ఆ శిథిల భవనంలో వేచి చూశాక డ్రోన్ శబ్దం ఆగిపోయింది. దీంతో మేం చెట్టుకింద పార్క్ చేసిన కారు వద్దకు పరుగు తీశాం. రిడిన్‌స్కీ నుంచి త్వరగా వెళ్లిపోయాం.

రహదారి పక్కన కూలిపోయిన ఒక డ్రోన్ కాలిపోతూ ఉండటం, అందులో నుంచి వస్తున్న పొగ సుడులు తిరుగుతూ గాలిలో కలిసిపోతుండటాన్నిమేం చూశాం.

యుక్రెయిన్ రష్యా యుద్ధం, డ్రోన్ల దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు
ఫొటో క్యాప్షన్, రష్యా వైమానిక దాడులతో రిడిన్‌స్కీ లాంటి పట్టణాలు శిథిలాల దిబ్బగా మారాయి.

అక్కడ నుంచి మేం యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉన్న బిలిట్స్కేకు వెళ్లాం. అక్కడ మాకు అంతకు ముందు రోజు రాత్రి క్షిపణి దాడిలో వరుసగా ధ్వంసమైన ఇళ్లు కనిపించాయి. అందులో స్విత్లానా ఇల్లు కూడా ఉంది.

"ఇది మరింతగా దిగజారుతోంది. గతంలో పేలుళ్లు మాకు చాలా దూరంగా వినిపించేవి. అవి ఎక్కడో జరిగేవి. ఇప్పుడు మా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అది మాకు తెలుస్తోంది" అని 61 ఏళ్ల స్విత్లానా చెప్పారు.

ఆమె శిథిలమైన తన ఇంట్లో నుంచి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చుకున్నారు. దాడి జరిగిన సమయంలో అదృష్టత్తువశాత్తూ స్విత్లానా అక్కడ లేరు.

"పట్టణం మధ్యలోకి వెళ్లండి. అక్కడ మీరు చాలా విధ్వంసాన్ని చూడవచ్చు. బేకరీ, జూ కూడా ధ్వంసం అయ్యాయి" అన్నారు.

డ్రోన్లు చేరుకోలేని ఒక సురక్షిత ప్రాంతంలో మేం ఐదో అస్సాల్ట్ బ్రిగేడ్‌ ఫిరంగి దళానికి చెందిన సైనికులను కలిశాం.

"రష్యన్ దాడుల తీవ్రత పెరగడాన్నిగమనించవచ్చు. నగరంలోకి సరఫరాలు రాకుండా అడ్డుకునేందుకు వారు మోర్టార్లు, డ్రోన్లు.. ఒకటేమిటి, అన్నింటినీ వాడుతున్నారు" అని సెర్హీ చెప్పారు.

తమకు కేటాయించిన స్థావరాలకు చేరుకునేందుకు సెర్హీ యూనిట్ మూడు రోజుల నుంచి వేచి చూస్తోంది. డ్రోన్ల నుంచి వారికి రక్షణ దొరికేలా బలమైన గాలులు వీచే సందర్భం కోసం ఈ బృందం కాచుకుని ఉంది.

యుక్రెయిన్ రష్యా యుద్ధం, డ్రోన్ల దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు
ఫొటో క్యాప్షన్, డ్రోన్ల భయం వల్ల సెర్హీ యూనిట్ తమకు కేటాయించిన స్థావరానికి వెళ్లేందుకు వేచి చూస్తోంది.

రోజు రోజుకూ తీవ్రమవుతున్న యుద్ధంలో, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చే ముప్పుని సైనికులు వేగంగా స్వీకరించాల్సి వస్తోంది.

అలాంటి ముప్పు వాళ్లకిప్పుడు ఆప్టిక్ ఫైబర్ డ్రోన్ల నుంచి వస్తోంది. డ్రోన్ కింద కిలోమీటర్ల పొడవున్న సన్నని వైరు అమర్చి ఉంటుంది. ఈ కేబుల్ డ్రోన్‌ను పైలట్ వద్ద ఉండే కంట్రోలర్‌కు కనెక్ట్ చేస్తుంది. ఇది ఒకరకంగా గాలిపటం ఎగరేయడం లాంటిది.

"డ్రోన్ ఎగిరినప్పుడు అది చూపించే వీడియో, కంట్రోల్ సిగ్నల్స్ రేడియో తరంగాల నుంచి కాకుండా ఫైబర్ కేబుల్ ద్వారా ప్రసారమవుతాయి. దీనర్ధం ఈ ఫైబర్ డ్రోన్లను ఎలక్ట్రానిక్ ఇంటర్‌సెప్టర్ల ద్వారా జామ్ చేయడానికి వీలుపడదు" అని 68వ జేగర్ బ్రిగేడ్‌లోని ఓ సైనికుడు చెప్పారు.

ఈ యుద్ధంలో డ్రోన్లను భారీ స్థాయిలో వినియోగిస్తుండటంతో రెండు సైన్యాలు తమ వాహనాలకు ఎలక్ట్రానికి వార్‌ఫేర్ సిస్టమ్స్‌ను అమర్చుకున్నాయి. వీటి ద్వారా డ్రోన్లను కూల్చివేయవచ్చు.

ఆఫ్టిక్ ఫైబర్ డ్రోన్లు రావడంతో ఈ భద్రతా వ్యవస్థ వల్ల కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలాంటి పరికరాలతో రష్యా ప్రస్తుతానికి పైచేయి సాధించింది. యుక్రెయిన్ వీటి ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నిస్తోంది.

"రష్యా మాకంటే చాలా ముందే ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను ఉపయోగించడం మొదలు పెట్టింది. మేమింకా వాటిని పరీక్షించే దశలో ఉన్నాం. సాధారణ డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించలేని ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. మనం వీటిని ఇళ్లలోకి కూడా పంపించి టార్గెట్లు ఉన్నాయేమో చూడవచ్చు" అని 68వ జేగర్ బ్రిగేడ్‌కు చెందిన డ్రోన్ పైలట్ వెనియా చెప్పారు.

"ఆప్టిక్ ఫైబర్ డ్రోన్‌కుండే వైరును కట్ చేయడానికి కత్తెరలు తీసుకు వెళ్లాలేమో అని మేం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం" అని ఫిరంగి దళ సభ్యుడు సెర్హీ చెప్పారు.

ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లలోనూ లోపాలు ఉన్నాయి. అవి నెమ్మదిగా ఉంటాయి. వాటికుండే కేబుల్ వైరు చెట్లలో చిక్కుకుపోవచ్చు. అయితే ప్రస్తుతం రష్యా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉండటంతో, యుక్రెయిన్ సైనికులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడం యుద్ధభూమి కంటే ప్రాణాంతకంగా మారుతోంది.

యుక్రెయిన్ రష్యా యుద్ధం, డ్రోన్ల దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు
ఫొటో క్యాప్షన్, ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల తయారీపై యుక్రెయిన్ సైనికులు పని చేస్తున్నారు.

"మీరు ఒక స్థావరంలో ఉంటే, మీరు అక్కడ ఉన్నట్లు ప్రత్యర్థులు గుర్తించారో లేదో మీకు తెలియదు. మిమ్మల్ని గుర్తిస్తే, మీరు మీ జీవితంలో ఆఖరి గంటలకు చేరువైనట్టే" అని 5వ అస్సాల్ట్ బ్రిగేడ్ చీఫ్ సార్జంట్ ఓలెస్ చెప్పారు.

ఈ భయం కారణంగా సైనికులు తమ స్థావరాల్లో సుదీర్ఘ సమయం గడుపుతున్నారు.

ఓలెస్ అతని మనుషులు పదాతిదళంలో ఉన్నారు. యుక్రెయిన్ భద్రత కోసం అందరి కంటే ముందుండి కందకాలలో పని చేస్తున్నారు. ఈ రోజుల్లో పదాతిదళంలో పని చేసే సైనికుల గురించి జర్నలిస్టులు మాట్లాడం చాలా అరుదు. ఈ కందకాలలోకి వెళ్లడం కూడా ప్రమాదంతో కూడుకున్నది.

ఓలెస్, మాక్సిమ్‌ను ఊరిలోని తాత్కాలిక స్థావరంలో కలిశాం. విధి నిర్వహణలో లేని సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడకు వచ్చేవారు.

"నేను 31 రోజుల పాటు డ్యూటీ చేశాను. ఇదే నేను చేసిన అతి పెద్ద డ్యూటీ. అయితే 90 రోజులు, 120రోజుల పాటు నిర్విరామంగా పని చేసిన వారు నాకు తెలుసు. డ్రోన్లు రావడానికి ముందు ప్రతి 3 లేదా 7 రోజులకొకసారి మమ్మల్ని మార్చేవారు" అని మాక్సిమ్ చెప్పారు.

"యుద్ధం అంటే రక్తం, మరణం, బురద, కాలి బొటన వేలి నుంచి తల వరకు చలి. మీరు రోజంతా ఇలాగే గడపాలి. మేం ఒకసారి మూడు రోజుల పాటు నిద్ర పోలేదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండేవాళ్లు. రష్యన్లు మా వైపు గుంపులు గుంపులుగా వచ్చేవారు. మేం చిన్న తప్పు చేసినా మా ప్రాణాలు పోయేవి" అని మాక్సిమ్ మాతో అన్నారు.

రష్యన్ పదాతి దళం తమ వ్యూహాలను మార్చిందని ఒలెస్ చెప్పారు.

"గతంలో వారు గుంపులుగా వచ్చి దాడి చేసేవారు. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరిని పంపిస్తున్నారు. వాళ్లు మోటార్ సైకిళ్లు కొన్ని సార్లు నాలుగు చక్రాల బైకులను వాడుతున్నారు. కొన్ని సార్లు అవి జారిపోయి పడిపోతున్నారు" అని ఒలెస్ అన్నారు.

దీని అర్థం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఇకపై ఎదురెదురుగా నిలబడి సంప్రదాయ యుద్ధం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ చదరంగంలో పావుల మాదిరిగా ఉండవచ్చు. ఒకరి స్థానంలోకి మరొకరు రావచ్చు.

దీని వల్ల ఎవరు ఎక్కడ పై చేయి సాధించారో అర్థం కాకుండా పోతోంది.

యుక్రెయిన్ రష్యా యుద్ధం, డ్రోన్ల దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఫైబర్ ఆప్టిక్ కంట్రోల్‌తో డ్రోన్లను పరీక్షిస్తున్న యుక్రెయిన్ సైనికుడు

రష్యా ఇటీవల కొన్ని విజయాలు సాధించినప్పటికీ పొక్రాస్క్ ఉన్న దోనియెస్క్ ప్రాంతాన్ని ఆక్రమించడం అంత తేలిగ్గా, వేగంగా జరగలేదు.

యుక్రెయిన్ సైన్యం రష్యన్ సేనలను గట్టిగా అడ్డుకుంది. అయితే వాళ్లు యుద్ధాన్ని కొనసాగించాలంటే ఆయుధాలు, మందుగుండు నిర్విరామంగా సరఫరా జరగాలి.

యుద్ధం ఇప్పుడు నాలుగో ఏడాదిలోకి ప్రవేశించింది. రష్యాకు భారీ సైన్యం ఉంటే, యుక్రెయిన్ మానవ వనరుల కొరతతో ఇబ్బంది పడటం కనిపిస్తోంది.

మేం కలిసిన వారిలో అనేకమంది సైనికులు యుద్ధం ప్రారంభమైన తర్వాత సైన్యంలో చేరారు. వారికి కొన్ని నెలల శిక్షణ మాత్రమే ఇచ్చారు. అయితే వాళ్లు యుద్ధ రంగంలోనే చాలా నేర్చుకోవాల్సి వచ్చింది.

సైన్యంలో చేరడానికి ముందు మాక్సిమ్ డ్రింక్స్ కంపెనీలో పని చేసేవారు. ఆయన సైన్యంలో చేరడంపై అతని కుటుంబం ఏమంటోందని నేను అడిగాను.

"ఇది చాలా చాలా కష్టం. నా కుటుంబం నాకు అండగా ఉంది. నాకు రెండేళ్ల బాబు ఉన్నాడు. నేను అతన్ని ఎక్కువగా చూడలేకపోతున్నాను. అప్పుడప్పుడు వీడియోకాల్ చేస్తాను. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంతా బాగానే ఉంది" అని అతను ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు.

మాక్సిమ్ తన దేశం కోసం పోరాడుతున్న సైనికుడు మాత్రమే కాదు. రెండేళ్ల తన బిడ్డకు ఆప్యాయత పంచలేకపోతున్న తండ్రి కూడా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)