‘భూగర్భంలోకి చొచ్చుకుపోయి పేలే 13,000 కేజీల బాంబులతో అమెరికా దాడి’

A satellite image of Fordo, one of three Iranian nuclear sites hit by Trump

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫోర్డో అణు స్థావరం ఉపగ్రహ చిత్రం
    • రచయిత, థామస్ మకింతోష్, నాడిన్ యూసఫ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై బాంబు దాడులు చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

దాడుల విషయంలో అమెరికాతో తాము పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ చెప్పింది.

మరోవైపు అమెరికా దాడులను ఇరాన్ ధ్రువీకరించినప్పటికీ తమకు భారీ నష్టం జరిగిందన్నది నిజం కాదని చెప్తోంది.

ఇవన్నీ ఎలా ఉన్నా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగడంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముదిరిందంటున్నారు నిపుణులు.

ఇంతకీ ఈ దాడుల్లో అమెరికా ఎలాంటి ఆయుధాలు వాడింది? అవి ఎంత శక్తిమంతమైనవి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Fordo

ఫోర్దో భూగర్భంలో ఎంత లోతున ఉంది?

అమెరికా బాంబులు వేసిన మూడు అణు స్థావరాలలో ఒకటైన ఫోర్దో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న పర్వతప్రాంతంలో ఉంది.

ఈ భూగర్భ స్థావరం యూకే, ఫ్రాన్స్‌ను కలిపే చానల్ టన్నెల్ కంటే కూడా బాగా లోతున ఉందని చెప్తారు.

భూగర్భంలో బాగా లోతున ఉండడంతో అమెరికా ఫోర్దోపై 'బంకర్ బస్టర్'గా పిలిచే జీబీయూ-57 మాసివ్ ఆర్డెనెన్స్ పెనెట్రేటర్(ఎంఓపీ) బాంబు వేసినట్లుగా అమెరికా మీడియా కథనాలు చెప్తున్నాయి.

US attack on IRAN, Bunker Buster

60 అడుగుల కాంక్రీట్‌లోంచి దూసుకుపోగల బాంబ్

13,000 కేజీల బరువు ఉండే ఈ బాంబు పేలడానికి ముందు 60 అడుగుల కాంక్రీట్ దిమ్మను కూడా చీల్చుకుంటూ పోగలదని నిపుణులు చెప్తున్నారు.

కాంక్రీట్ కాకుండా సాధారణ నేల అయితే 200 అడుగుల మేర చొచ్చుకు వెళ్లి పేలుతుందని చెప్తున్నారు.

అయితే, ఫోర్దో టన్నెల్‌ ఇంకా లోతున ఉండడంతో ఎంఓపీ బాంబు ఎంతవరకు విజయవంతమైందో చెప్పలేనప్పటికీ.. అంత లోపలకు వెళ్లగల బాంబు మాత్రం అదొక్కటే.

B 2 stealth bomber

ఇరాన్‌కు ఎలాంటి నష్టం కలిగింది?

అమెరికా దాడుల్లో ఇరాన్ ఎంత మేర నష్టపోయిందనేది ఇంకా స్పష్టం కాలేదు. అణు స్థావరాలకు ఎలాంటి నష్టం కలిగింది? దాడుల్లో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? వంటి వివరాలేవీ ఇంకా వెల్లడి కాలేదు.

తమ దేశానికి చెందిన మూడు అణు స్థావరాలపై జరిపిన దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఇరాన్ అణు శక్తి సంస్థ పేర్కొంది.

అమెరికా చేపట్టిన దాడుల తరువాత రేడియేషన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదలను గుర్తించలేదని సౌదీ అరేబియా, ఐక్యరాజ్య సమితికి చెందిన 'న్యూక్లియర్ వాచ్‌డాగ్స్' చెప్పాయి.