'కొందరిలో సంతోషం, మరికొందరిలో ఆగ్రహం', ఇజ్రాయెల్ దాడులపై ఇరానియన్లు చీలిపోయారా?

ఇరాన్, ఇజ్రాయెల్, బాంబు దాడులు, తెహ్రాన్, పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ రాజధాని తెహ్రాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది.
    • రచయిత, కారోలిన్ హాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెట్రోలు బంకులు, బేకరీల ముందు పొడవాటి క్యూలు ఉన్నాయి. దేశ రాజధాని నగరాన్ని వదిలి వెళ్లే వారితో రహదారుల మీద కారులు బారులు తీరాయి. చీకటి పడితే చాలు నిస్తేజం, భయం ఆవహిస్తోంది.

ఇజ్రాయెల్ హఠాత్తుగా వైమానిక దాడులు చేయడంతో తెహ్రాన్ ప్రజలు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు.

నగర ప్రజలు భయం, ఆందోళన, అయోమయం, నిస్సహాయత.. ఇలా రకరకాల భావోద్వేగాల సంఘర్షణలో ఉన్నారు.

"మేం రాత్రిళ్లు నిద్ర పోవడం లేదు" అని 21ఏళ్ల మ్యూజిక్ స్టూడెంట్ ఒక ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా యాప్ ద్వారా నాకు చెప్పారు.

"అందరూ వెళ్లిపోతున్నారు. నేను వెళ్లడం లేదు. పారిపోవడం కంటే మన ఇంట్లో ఉండి చనిపోవడం గౌరవప్రదం అని మా నాన్న చెప్పారు" అని ఆయన తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దోన్యా, ఆమె అసలు పేరు వెల్లడించడానికి ఇష్టడలేదు.

ఇరాన్‌లో తాను ద్వేషించే ప్రభుత్వానికి, ఇజ్రాయెల్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న అనేక మంది ఇరానియన్లలో ఆమె కూడా ఒకరు. గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని ఆమె ప్రసార మాధ్యమాల ద్వారా చూసివున్నారు.

"మా అందమైన తెహ్రాన్ గాజాలా మారడానికి ఎంత మాత్రం ఒప్పుకోను" అని ఆమె అన్నారు.

మత బోధకుడి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పిలుపుపై ఆమె తీవ్రంగా స్పందించారు.

"ఇజ్రాయెల్ మమ్మల్ని కాపాడాలని మేము కోరుకోవడం లేదు. ఇరాన్‌ మీద ఏ దేశానికి కూడా శ్రద్ధ లేదు. అలాగని మేము ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూడా కోరుకోవడం లేదు" అని ఆమె చెప్పారు.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనిక అధికారులు మరణించడం చూసి తనకు చాలా ఉత్సాహంగా అనిపించిందని మరో మహిళ చెప్పారు. అంతటి శక్తిమంతులకి అలా జరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఆమె అన్నారు.

"వాళ్లు చాలా శక్తిమంతులు అనే ముద్ర ఒక్కసారిగా చెరిగిపోయింది" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"అయితే, రెండో రోజు దాడుల్లో సాధారణ ప్రజలు చనిపోయారని తెలిసినప్పుడు, నాలాంటి వాళ్లు కూడా చనిపోతారని తెలిశాక, కాస్త బాధగా.. భయంగా అనిపించింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రంపైనా ఇజ్రాయెల్ బాంబులు వేసిందని తెలిశాక బాధ కాస్తా కోపంగా మారిందని ఆమె చెప్పారు. "ఇరాన్‌ను కూడా శిథిలాల దిబ్బగా" మారుస్తుందేమోనని భయపడుతున్నానన్నారు.

జీవితంలో తొలిసారి మరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టానని ఆమె చెప్పారు.

శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 220 మంది పౌరులు చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

అదే సమయంలో, ఇరాన్ దాడుల వల్ల తమ దేశంలో 24 మంది చనిపోయారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

ఇరాన్, ఇజ్రాయెల్, బాంబు దాడులు, తెహ్రాన్, పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలు తెహ్రాన్ వదిలి వెళుతుండటంతో నగరంలోని రహదారులపై రద్దీ పెరిగింది.

ఇజ్రాయెల్‌లో మాదిరిగా ఇరాన్‌లో వైమానిక దాడుల గురించి హెచ్చరించే వ్యవస్థలు, దాక్కునేందుకు రక్షణ కేంద్రాలు లేవు.

ఆకాశం నుంచి క్షిపణి దాడులు జరిగాయి. అయితే రాజధాని తెహ్రాన్‌లో కారు బాంబులు పేలతాయని ఇరాన్, ఇజ్రాయెల్ మీడియాలో జరిగిన ప్రచారం ప్రజల్లో భయాన్ని, అయోమయాన్ని పెంచాయి.

ఇరాన్ పాలకులకు మద్దతిస్తున్న వారిలో కొంతమంది, తాము గొప్పగా ఊహించుకుంటున్న పాలకుల వైఫల్యాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు.

అనేక మంది ఇరానియన్లు అధికారులను అసలు నమ్మడం లేదు.

దోన్యా ఇరాన్ పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న వస్త్రధారణను తిరస్కరిస్తూ తన జుట్టు కనిపించేలా బట్టలు ధరిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ పరీక్షలు వారం రోజులు వాయిదా పడ్డాయి. దీంతో ఆమె ఇంటివద్దనే ఉంటున్నారు.

"రాత్రి పూట చాలా భయంగా ఉంటోంది. నిద్ర కోసం మాత్రలు వేసుకుంటున్నాను" అని ఆమె చెప్పారు.

ప్రజలు మసీదులు, మెట్రో స్టేషన్లలో రక్షణ పొందాలని ఇరానియన్ ప్రభుత్వం సూచించింది.

అయితే, అది చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నగరంలో ఎక్కడైనా అకస్మాత్తుగా బాంబులు పడొచ్చు.

"తెహ్రాన్ చాలా పెద్ద నగరం, అయినప్పటికీ దాడుల వల్ల అనేక ప్రాంతాల్లో విధ్వంసం కనిపిస్తోంది" అని మరో మహిళ బీబీసీతో చెప్పారు.

"ప్రస్తుతానికి మేమంతా గంటకోసారి వార్తలు చూస్తున్నాం. మా స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి వారి చుట్టు పక్కల ఏవైనా బాంబులు పడ్డాయా, విధ్వంసం జరిగిందా? వాళ్లు బతికే ఉన్నారా లేదా అని కనుక్కుంటున్నాం" అని ఆమె అన్నారు.

ఆమె, ఆమె కుటుంబం ఇల్లు వదిలేసి ప్రభుత్వ భవనాలు ఏమీ లేని ప్రాంతంలో ఉంటోంది.

అయితే, ఇరాన్ లాంటి దేశంలో మీ పొరుగున ఎవరు ఉంటున్నారో మీకు ఎప్పటికీ తెలియదు.

ఇరాన్, ఇజ్రాయెల్, బాంబు దాడులు, తెహ్రాన్, పెట్రోలు ధరలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌లోని షరాన్ చమురు డిపో మీద ఇజ్రాయెల్ దాడి చేసింది.

ఇజ్రాయెల్ దాడులు ఇరానియన్లలో చీలిక తెచ్చాయని ఆమె అన్నారు. ఇరాన్ పాలకులకు జరిగిన నష్టం చూసి కొంతమంది సంతోషిస్తున్నారని, అలాంటి వారిని చూసి మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె చెప్పారు.

అనేక మంది ఇరానియన్లు తమ అభిప్రాయాలను మార్చుకుంటూనే ఉంటారు. కొన్ని కుటుంబాల్లోనూ విబేధాలు తీవ్రంగా ఉన్నాయి.

"ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితి, టైటానిక్ నౌక మంచు కొండను ఢీ కొట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది" అని ఆమె చెప్పారు.

"కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఇది అసలు సమస్యే కాదని చెబుతున్నారు. మరికొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు."

ఇరాన్‌లో మతాధికారుల పాలనను ఆమె ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే నెతన్యాహు తమ దేశానికి చేస్తున్నది మాత్రం "క్షమించరానిదని" ఆమె అన్నారు.

"ఈ దాడుల్ని వ్యతిరేకిస్తున్న వారు లేదా సమర్థిస్తున్నవారు, ఎవరైనా కావొచ్చు. ప్రతీఒక్కరి జీవితం మారిపోయింది."

"ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా ఇరాన్‌లో నగరాలు, నిస్సహాయులైన పౌరుల మీద పడుతున్న బాంబుల వల్ల స్వేచ్ఛ, మానవహక్కులు లాంటివి రావనే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు" అని ఆమె చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వం కావాలనే తమ సైనిక కమాండ్ సెంటర్లు, ఆయుధాలను పౌర ఆవాసాల మధ్య ఉన్న భవనాల్లో ఉంచిందని ఇజ్రాయెల్ చెబుతోంది.

విదేశాల్లో ఉంటున్న ఇరానియన్లు కూడా తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు.

"ప్రస్తుతం ఇరానియన్ల పరిస్థితి ఏంటో చెప్పడం చాలా కష్టం" అని లీడ్స్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త, పరిశోధకురాలు డోర్రేహ్ ఖటిబి హిల్ చెప్పారు.

ఆమె ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రభుత్వ వ్యతిరేకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

"ప్రజల్ని వేధిస్తూ, చిత్రహింసలు పెడుతున్న పాలకుల నిస్సహాయత చూసి మీకు సంతోషంగా ఉండవచ్చు. అయితే, దాడుల్లో ప్రజలు చనిపోతున్నారు. ఇది తీవ్రమైన మానవ విపత్తుకు దారితీస్తుంది" అని ఆమె చెప్పారు.

అసలేం జరుగుతుందనే దాని గురించి ఇరానియన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇరాన్‌లో ప్రజలు ప్రాణాల కోసం పారిపోతూ ఉంటే, దేశంలో ముఖ్యమైన వ్యక్తి సుప్రీం లీడర్ ప్రాణాలతోనే ఉన్నారు" అని ఆమె చెప్పారు.

"ఇరాన్ మరో ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్‌లాగా మారాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఈ యుద్ధాన్ని మేమెవ్వరం కోరుకోవడం లేదు. అలాగే ఈ పాలన కూడా మాకొద్దు" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)