‘ఇరాన్ సుప్రీం లీడర్‌ను మాత్రం చంపొద్దు’ అని ఇజ్రాయెల్‌కు ట్రంప్ చెప్పారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సెషెర్ అసఫ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అడ్డుకున్నారని అమెరికాకు చెందిన ముగ్గురు అధికారులు బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
ఖమేనీని చంపాలన్న ఆలోచన మంచిది కాదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ తెలిపినట్లు ఈ అధికారుల్లో ఒకరు చెప్పారు. అయితే, ఈ రిపోర్టుపై అధ్యక్షుడు బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.
శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఈ సంభాషణ జరిగినట్లు తెలిసింది.
అయతొల్లాను చంపే ప్రణాళికను ట్రంప్ అడ్డుకున్నారని రాయిటర్స్‌లో వచ్చిన రిపోర్టును ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు.
''ఎన్నడూ జరగని సంభాషణలపై ఎన్నో తప్పుడు రిపోర్టులు వస్తుంటాయి. అటువంటి వాటి జోలికి నేను వెళ్లను'' అని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.
''మేం చేయాల్సింది తప్పక చేస్తామని నేను చెప్పదల్చుకున్నా. మేం చేయాల్సిన అవసరం ఉన్నది కూడా చేస్తాం. అమెరికాకు ఏది మంచో ఆ దేశానికి తెలుసని నేను అనుకుంటున్నా. నేను వాటి జోలికి వెళ్లాలనుకోవడం లేదు'' అని తెలిపారు.
‘‘సూత్రప్రాయంగా ఇజ్రాయెల్ రాజకీయ నేతలను చంపదు. మేం న్యూక్లియర్, మిలటరీపై దృష్టిసారించాం. ఇలాంటి కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకునే వారెవరైనా స్వేచ్చగా జీవించాలని నేను అనుకోను'' అని సీబీఎస్ న్యూస్‌తో ఒక ఇజ్రాయెల్ అధికారి అన్నారు.
ఇరాన్ అణు, సైనిక స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. అప్పటి నుంచి ఒకదానిపై మరొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ట్రూత్ సోషల్‌లో స్పందించిన ట్రంప్, '' ఇరాన్, ఇజ్రాయెల్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. భారత్-పాకిస్తాన్ మధ్య తాజాగా నెలకొన్న ఘర్షణను ఆపివేసిన మాదిరి ఈ రెండు దేశాలకు మధ్య శత్రుత్వం ఆపివేసేలా చేస్తాను'' అని పోస్టు చేశారు.
కెనడాలో జరగబోయే జీ7 సదస్సుకు వెళ్లడానికి ముందు రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్.. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఆ దేశాన్ని కోరారా? లేదా? అన్న దానిపై స్పందించడానికి మాత్రం నిరాకరించారు.
అమెరికా-ఇరాన్ మధ్యలో తదుపరి విడత అణు చర్చలు ఆదివారం జరగాల్సి ఉంది. కానీ, ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించే ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసైదీ ఈ చర్చలకు ఒకరోజు ముందు, వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదురవుతున్నందువల్ల కాల్పుల విరమణ చర్చలకు తాము సిద్ధంగా లేమని ఖతార్, ఒమన్‌లకు ఇరాన్ చెప్పినట్లు..రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఒక అధికారి ఆదివారం చెప్పారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని ట్రంప్ శనివారం వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














